ASBL Koncept Ambience

పెట్టుబడులే లక్ష్యం... అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పెట్టుబడులే లక్ష్యం... అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

అమెరికా పర్యటనలో తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలుచేశారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని.. ప్రపంచంతోనే పోటీ పడుతున్నామన్నారు. చైనా ప్లస్ 1 స్టేట్ అనేదే తమ విధానమన్నారు రేవంత్. అంతేకాదు.. రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టాలంటూ అమెరికాలోని ఎన్నారైలకు.. రేవంత్ పిలుపునిచ్చారు. వారి పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు రేవంత్.

అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్‌రెడ్డి న్యూజెర్సీలో తెలంగాణ‌కు చెందిన తెలుగు వారిని క‌లుసుకున్నారు. .“తెలంగాణ మీ జన్మభూమి, ఇక్కడ పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం.. ప్రతిఫలం ఉంటుంది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుంటే ఆనందం బోనస్‌గా వస్తుంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో పదేళ్లు సాగిన కేసీఆర్‌ దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని గ‌తంలో చెప్పిన విష‌యాన్ని తాజాగా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తాను ఇచ్చిన హామీల‌ను వివ‌రించారు. అయితే.. ఇచ్చిన ప్ర‌తిహామీని నెర‌వేర్చేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించామ‌ని.. అదేవిధంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తున్నామ‌ని చెప్పారు. ఇక‌, ఉద్యో గాల‌కు నోటిఫికేష‌న్ కూడా ఇచ్చామ‌న్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌తిహామీని అమలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

అలానే ఇప్పుడు కూడా ఎన్నారైల‌కు తాను హామీ ఇస్తున్న‌ట్టు చెప్పారు. పెట్టుబ‌డులు పెట్టేవారికి అన్ని సౌక‌ర్యాలు అందిస్తామ‌న్నారు. రూపాయి కి రూపాయి వ‌చ్చేలా చూస్తామ‌ని.. తెలంగాణ నేల త‌న వారి కోసం ఎదురు చూస్తోంద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్... వివిధ పరిశ్రమల అధినేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా కొన్ని కంపెనీలు తమ శాఖలను విస్తరించాలని నిర్ణయించగా.. మరికొన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్ లో కాలు మోపే అవకాశం కనిపిస్తోంది.

 

 

 

Tags :