తెలుగు మహాసభల్లో తెలంగాణ విందు
ప్రపంచ తెలుగు మహాసభల్లో హాజరయ్యేవారికి తెలంగాణ వంటకాలతో ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర వాసులు ఎక్కువగా ఇష్టపడే రుచులను భోజన పట్టికలో చేర్చారు. మేక, గొర్రె కాళ్ల మాంసంతో చేసే పాయా, పచ్చిపులుసు, చింతకాయ, పచ్చిమిరప, పుంటికూర, తొక్కులు, గుడాలు, అంబలి, గటుక, సజ్జరొట్టెలు, సర్వపిండి, మురుకులు, సకినాలు తదితరాలను వడ్డించనున్నారు. వేదికల వద్దే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకచోట వండి, అన్ని వేదికల వద్దకు వాటిని సరఫరా చేస్తారని మహాసభల వ్యూహ బృందం సభ్యుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు.
ఆతిథ్యం :
అతిథులందరికీ ఏ లోటూ లేకుండా చూసేందుకు ప్రతీ అతిథికీ ఓ సహాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, పరిశోధకులను అతిథులుగా గుర్తిస్తూ ఆహ్వానాలు అందజేశారు. దాదాపు వేయిమంది వరకు అతిథులు పాల్గొనే తెలుగు మహాసభల్లో ఎవరికీ ఏ సమస్య లేకుండా చూసుకునేలా, వారి అవసరాలకు అనుగుణంగా వేదికలను తీసుకుపోయేలా ఒక వాలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తెలుగు భాష, సాహిత్యంపట్ల అవగాహన ఉన్న వారిని వాలంటీర్లుగా ఎంపిక చేయాలని సాహిత్య అకాడమీ భావించినా జీఈస్ విజయవంతానికి దోహదపడిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులో తెలుగు తెలిసిన వారిని వాలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు.