తానా పర్యావరణ దినోత్సవ వేడుకలు ప్రారంభించిన గవర్నర్
ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిదని, ఈ విషయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చూపిన చొరవ ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‍రాజన్ అన్నారు. తానా ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఐరాసతో కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జూమ్ ద్వారా అంతర్జాలంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రకృతిని ప్రేమించాలన్న రవీంద్రుని మాటలను ఉటంకించారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మనిషి దాని పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నేటి ఆధునిక సమాజంలో తప్పనిసరి బాధ్యత అని, మూడురోజుల పాటు అంతర్జాలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు 6వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని, ‘‘ఉమ్మడి లక్ష్యం-ఉమ్మడి బాధ్యత’’ స్ఫూర్తితో ప్రపంచదేశాల్లోని ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు, సూచనలు అందించి పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు భాగస్వామ్యులు కావాలని కోరారు. Time for Nature-Celebrate and Protect Biodiversity ప్రధాన అంశంగా కార్యక్రమాలను చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఐరాసలో భారతీయ ప్రతినిధి రాజా కార్తికేయ, అమెరికా కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, టామ్ సూజ్జీ, న్యూయార్క్ అసెంబ్లీ స్పీకర్ కార్ల్ హేస్టీ, ముంబయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, ఐ.ఎ.ఎస్.అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ ముఖ్యమంత్రి సలహదారుడు రామచంద్రమూర్తి, తెలంగాణా వనసంరక్షణ అధికారి ఆర్.శోభ, కేరళ వనసంరక్షణ అధికారి జీ.ఫణీంద్ర కుమార్, ఉత్సవ నిర్వహణ సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల, తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా ఇవిపి లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.