తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : కేటీఆర్
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని, పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన కేటీఆర్ తొలిరోజు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో పాల్గొన్నారు. ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ చర్చలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పాలనాపరమైన అడ్డంకులు తొలగాయని, అనుమతుల మంజూరులో పారదర్శకత పెరిగిందని చెప్పారు.
ప్రపంచ టాప్-5 సంస్థలు యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తమ కేంద్ర కార్యాలయాల తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను హైదరబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ అత్యుత్తమమైనదని మెర్సల్ గత ఐదేళ్లుగా గుర్తిస్తూ వస్తోందని వివరించారు. ప్రపంచంలోని 130 నగరల్లో అత్యంత డైనమిక్ నగరం హైదరాబాద్ అని జేఎల్‌ఎల్ సంస్థ గుర్తించిందని చెప్పారు. ఈవోడీబీతో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింపు, క్యాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను వినియోగించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. భారత్‌తో పాటు రాష్ట్రాలన్నీ మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్.. అనే త్రీ ఐ మంత్రాన్ని పాటించాలని సూచించారు.