గ్రేటర్ లో టీడీపీకి 9 సీట్లు?
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్రవాసులు ఎక్కువగా ఉన్నందువల్ల గతంలో తమకు ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమకు 9 సీట్లు కావాలని ప్రతిపాదించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి తొమ్మిది సీట్లు దక్కే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నగరంలోని రెండో స్థానంలో నిలిచిన స్థానాలను తమకే కేటాయించాలన్న ప్రాతిపదికన సీట్లను సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలున్న కోర్ సిటీలో టీడీపీ పార్టీకి పాతబస్తీలోని మలక్‌పేట, చార్మినార్, సికిందరాబాద్, ఖైరతాబాద్ స్థానాలతో పాటు ముషీరాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో ఒకటితో కలిపి ఐదు స్థానాలను కేటాయించే దిశగా ప్రజాకూటమి సీట్ల సర్దుబాటు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక మిగిలిన స్థానాల్లో జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలని ప్రజాకూటమి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక శివార్లలోని తొమ్మిది స్థానాల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశముండగా, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి స్థానాలను టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే మహాకూటమిలోని పార్టీలకు చెందిన అదినాయకులు సూచనప్రాయంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఇప్పటికే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు, ఖైరతాబాద్ తెలుగు యువత నేత లంకెల దీపక్‌రెడ్డి, సికిందరాబాద్ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ముషీరాబాద్ సీటును కాంగ్రెస్‌కు వదిలేయాలని ఆ పార్టీ నేతలు టీడీపీ నేతలకు సూచిస్తున్నట్లు సమాచారం. కానీ ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావుకు ఈ సారి అవకాశం ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కంటోన్మెంట్ స్థానాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనపై కూడా తర్జనభర్జన జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారిస్తున్న ఎంఎన్. శ్రీనివాస్ రావు.. ఎస్సీ సామాజికవర్గానికి చెంది ఉండటంతో ఎస్సీలకు రిజర్వు చేసిన కంటోన్మెంట్ నుంచి బరిలో దింపాలని కాంగ్రెస్ సూచించినా, టీడీపీ అంగీకరించటం లేదనే చర్చ లేకపోలేదు.