చంద్రబాబు గెలుపు కోసం.. ఆ నలుగురు పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నలుగురు పాదయాత్ర చేపట్టారు. జనగాం నుంచి తిరుపతికి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సంకల్పించుకున్నారు. సేవ్ నేషన్.. సేవ్ డెమొక్రసీ నినాదం, సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో నిరసన తెలుపుతున్న చిత్రాన్ని ముద్రించిన బ్యానర్‌ను పట్టుకుని ప్రధాన రహదారి మీదుగా వెళుతూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇంతకూ ఆ నలుగురు ఎవరంటే.. తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్యా నరేష్, ఎస్టీ విభాగం నాయకులు గోవిందు విజయ్, భూక్యా నాగేష్, బాలావత్ మధునాయక్‌లు. ఈ నెల 11న జనగాంలో యాత్ర ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి పాదయాత్రగా బయలుదేరామని భూక్యా నరేష్ తెలిపారు.