కొలంబస్ లో టాకో సంక్రాంతి సంబరాలు
సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో)వారు కొలంబస్, ఒహాయో వేదికగా ఫిబ్రవరి 4, 2017న సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. దాదాపు పన్నెండు వందల మంది తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాష పట్ల, భారత సంస్కృతి పట్ట తమ ఇష్టాన్ని చాటి చెప్పారు. ప్రెసిడెంట్ శ్రీ నాగేశ్వరావు మన్నె, వైస్ ప్రెసిడెంట్ రవి వంగూరి, కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి పూదోట ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా కొద్ది రోజుల ముందే ముగ్గుల పోటీలు, పతంగుల పోటీలు, చిత్రలేఖణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు 250 మంది ఫిబ్రవరి 4న జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో అలరించారు. తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టిన నాయకుల చారిత్రాత్మకమైన ప్రదేశాల చిత్రాలను స్వాగత తోరణాలుగా అలంకరించారు. అంతేకాకుండా మన సంస్కృతిని గుర్తు చేస్త ఏర్పాటు చేసిన సంక్రాంతి థీమ్, పిల్లలకు భోగిపళ్లు, హరిదాసు, సోది పాప లాంటి పలు కార్యక్రమాలు పూర్తి సంక్రాంతి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సుప్రసిద్ద సినీ గాన రచయిత చంద్రబోస్ గారు ఈ సంబరాల్లో పాల్గొని మనసుని మైమరపించే మాటలు పాటలు అనే ప్రత్యేక కార్యక్రమం తో ఆకట్టుకున్నారు. అమెరికాలో నిర్వహించిన పాడుతూ లో పాల్గొని విజేతలుగా నిలిచిన చిన్నారులు తమ గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసారు. పలువురు ఎన్‌ఆర్‌ఐలు చేసిన అష్ట లక్ష్మి, డాన్స్ ప్యూజన్ లాంటి విభిన్నమైన ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి.
ఈ సందర్భంగా సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం ప్రెసిడెంట్ మన్నె నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలను గ్రామాల్లోని రైతన్న లకు, సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న సైనికులకు అంకింతం ఇస్తున్నట్లు తెలిపారు. 2017 టిఎసిఒ అజెండాను తెలియజేస్తూ ఈ సంవత్సరం చదువు లో అత్యంత ప్రతిభ చూపుతున్న చిన్నారులకు 'విద్యార్థి రత్న' అనే కొత్త అవార్డు తో సత్కరిస్తామని తెలిపారు.
బోన్ మారో దానం చేయడం ద్వారా ఒక కాన్సర్ పేషెంట్ ప్రాణాలను నిలబెట్టిన దాత కు ఈ సందర్భంగా సేవా రత్న బిరుదుతో సత్కరించారు. అదే రోజు ఫిబ్రవరి 4 అంతర్జాతీయ కాన్సర్ డే కావడం కాకతాళీయం. 24 మందికి పైగా ఉన్న కార్యవర్గంతో పాటు 60 మంది స్వచ్ఛంద సేవకులతో సంక్రాంతి సంబరాలను దిగ్విజయంగా నిర్వహించారు. స్థానిక మానస్ రెస్టారెంట్ వారు షడ్రుచులతో అందించిన భోజనం తో పాటు, ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరిసెలు, తాపేశ్వరం కాజాలు తిని, కార్యక్రమానికి హాజరైన వారందరూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
జగన్నాథ్ చలసాని, ప్రసాద్ కందూరి, వేణు బత్తుల, శ్రీనివాసు పొలిన, సుబ్రహ్మణ్యం, ప్రతిమ సురవరపు, అపర్ణ కొనాకి, మహేంద్రన్ వన్నమ్, వినోద్ కౌశిక, విజయ్ కాకర్ల, వెంకట్ కె. నరేష్ గడ్డం, హనుమాన్ కె తదితరులతోపాటు ట్రస్టీలు మురళీ పుట్టి, అశోక్ కామిననే, శ్రీధర్ వాగీష్న, రాధిక, సతీష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.