ASBL Koncept Ambience

అంగరంగ వైభవంగా జరిగిన "తాజా" ఉగాది సంబరాలు !!

అంగరంగ వైభవంగా జరిగిన "తాజా" ఉగాది సంబరాలు !!

జాక్సన్విల్లే తెలుగు సంఘం(తాజా) ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 15, 2023వ తేదీన వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలను జాక్సన్విల్లేలోనే అతిపెద్ద దైన త్రాషేర్ హార్న్ సమావేశ ప్రాంగణములో 2000కు పైగా  అతిధుల ఆనందోత్సాహాల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ ఉగాది సంబరాలు నిర్వహించిన ప్రాంగణం అంతా తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా స్వాగత తోరణాలతో అత్యద్భుతంగా అలంకరించారు. అతిధులందరూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తులతో ఉగాది వేడుకలో పాల్గొని, పండుగ వాతావరణాన్ని నెలకొల్పినారు.  

"తాజా" అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ అత్యంత ఆహ్లాదకరంగా జరిగినాయి. స్థానిక వేద పండితులు శ్రీ శ్రీనాధ్ కదంబి గారి అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలన చేసి, వారి ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు, రాత్రి 8:00 గంటల వరకు నిరంతరాయంగా రమణీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. విందు, వినోదం, నృత్యం, నాట్యం, సంగీతం, సాహిత్యం , సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత సుందరంగా జరిగాయి.

53 సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు పెద్దలు వయోబేధం లేకుండా 640 మంది ఆనందోత్సాహాలతో తమ యొక్క ప్రతిభను ప్రదర్శించారు.  కళాతపస్వి స్వర్గీయ కె. విశ్వనాధ్ గారికి అంజలి ఘటిస్తూ రూపొందించిన "స్వరాభిషేఖం" మరియు "సిరి సిరి మువ్వలు" అనే కార్యక్రామాల ద్వారా  అతిధులందరు దిగ్గజ దర్శకుడిని స్మరించుకున్నారు.

తాజా సభ్యులలో విశేష ప్రతిభను కనబరిచిన వారికి మరియు సమాజసేవ చేసిన వారికి జ్ఞాపికలను బహూకరించడం జరిగినది.

సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించి, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఒక మధురానిభూతిని మిగిల్చింది.

భారత కళారత్న, నృత్య భూషణ బిరుదాంకితులు నటరాజ పురస్కార గ్రహీతలు, OFFJAZZ France ఫెలోషిప్ అందుకున్న శ్రీ కృష్ణమూర్తి రాజు గారిని ఇతోధికంగా సన్మానించడం జరిగినది. ఇదే సందర్భంలో శ్రీ కృష్ణమూర్తి రాజు  కుమార్తె శ్రీమతి పద్మజ నిడిమోరు గారు ప్రదర్శించిన "వరాహ" నృత్య రూపకం అతిధులను మైమరపింపచేసింది.

తెలుగువారి అభిరుచులకు తగ్గట్లుగా పసందైన విందు భోజనాలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం అందించారు. షడ్రుచుల ఉగాదికి, పంచభక్ష పరమాన్నాలతో 18 రకాల విందుభోజనంను రాత్రి భోజనంలో ఏర్పాటు చేసినారు.

జాక్సన్విల్లే మరియు సెంట్ జాన్స్ జంట నగరాలలో నివసిస్తున్న తెలుగు వారు వారి కుటుంబ సభ్యులతో మరియు బంధుమిత్రులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2000 కు మించిన అతిధులు ఉల్లాసంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి తాజా కార్యవర్గ సభ్యులు అంకితభావంతో పనిచేసినారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే సంకల్పంతో, అమెరికాలో పుట్టి పెరిగిన యువతీ యువకులను "తాజా యూత్ కమిటి" ద్వారా ఉగాది వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం  చేశారు.

అధ్యక్షోపన్యాసం చేసిన తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు గారు జాక్సన్విల్లే మరియు సెంట్ జాన్స్ జంట నగరాలలో నివసిస్తున్న ప్రతి తెలుగు కుటుంబాన్ని "తాజా" కుటుంబంలోకి  ఆహ్వానిస్తూ, ఈ శోభకృత్ నామ సంవత్సరమంతా కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలు అందరి జీవితాలలో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సబ్యులకు ధన్యవాదములు తెలియచేసినారు.

 

Click here for Event Gallery

 

 

Tags :