తానాలో ఎన్నికలు ఏప్రిల్ నెలలో పూర్తి అయ్యే అవకాశాలు లేనట్టేనా?!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023 ఎన్నికలకు సంబంధించి కోర్టులో నానుతున్న వ్యవహారాలతో ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని అందరు ఎదురు చూస్తున్నారు కదా.. ఈ రోజు తో ( 10 ఏప్రిల్) కోర్టులో ఆర్బిట్రేషన్‌కు సంబంధించి ఫైనల్ హియరింగ్ పూర్తయింది. వాదనలు విన్న లేడీ జడ్జి దీనిపై తీర్పును 30రోజుల్లోగా వెలువరించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఆమె ఇచ్చే జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుందోనని ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
ఒకవేళ ఆమె పాత ఓటింగ్ లిస్ట్‌కే ఆమోదముద్ర వేస్తే దాని ప్రకారం ఎన్నికలను నిర్వహించుకోవచ్చు. లేదా కోర్టుకు అప్పీలు చేసినవారికి మాత్రం ఓటింగ్ రైట్స్ ఇవ్వమని అంటే దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. లేదా కొత్తగా చేరిన 30వేలమందికి ఇవ్వాలని అంటే అప్పుడు ఎన్నికల ప్రాసెస్ మరింత లేటవుతుంది. లేదా తానా బైలాస్ ప్రకారం వారికి ఓటు హక్కు ఇవ్వలేని పరిస్థితి ఉందని భావిస్తే ఈ కేసును కొట్టేయవచ్చు. ఈ జడ్జిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మేరీలాండ్ కోర్టు స్టే ఆర్డర్‌ను ఎత్తేయాల్సి ఉంటుంది.
ఈ జడ్జిమెంట్ వచ్చిన తరువాత బోర్డ్ సమావేశమై ఎన్నికలకు, ఓటింగ్ లిస్ట్‌లకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాల్సిందిగా ఎన్నికల నిర్వహణ కమిటీని కోరవచ్చు. ఎన్నికల నిర్వహణ కమిటీ దీనిపై సమావేశమై తుది ఓటర్ లిస్ట్‌ను ఆమోదించి అందరికీ పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగడానికి సాధ్యమైనంతవరకు నెలరోజులైన పట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించిన గడువు ప్రకారం ఎన్నికలు ఏప్రిల్ నెలలోగా జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే తానా బైలాస్ ప్రకారం ఎన్నికలకు సంబంధించి వ్యవహారాలను ఏప్రిల్ నెలాఖరులోగా ప్రకటించాల్సి ఉంటుంది. లేకుంటే బోర్డ్ సమావేశమై 2/3 వంతు మెజారిటీతో ఎన్నికల వ్యవహారాలను పొడిగించుకోవచ్చు. 3 వర్గాలు ఉన్న తానాలో బోర్డ్‌లో 2 / 3 వంతు మెజారిటీతో ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకునే చాలామంది తానాలో ఇప్పుట్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాల్లో పడ్డారు.