జగన్ స్వయం కృతాపరాధమే నంద్యాలలో ఓటమి
జగన్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
జగన్ రాజకీయాలలో ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని నంద్యాల ఉప ఎన్నిక తేటతెల్లం చేసింది. వైసిపి రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రాణించలేకపోతున్నారు. 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ... సమయం మొత్తాన్ని చంద్రబాబును తిట్టడానికే జగన్ కేటాయించారు. వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. రాజకీయాలలో సంయమనం, మనోనిబ్బరం, లౌక్యం ఎంతో అవసరం. పెద్దవారిని గౌరవించాలి. ఇవి జగన్‌కు లోపించాయి. జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం 15 సంవత్సరాలు ఎదురు చూసారు.
1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.
రాశేఖరరెడ్డికి ఉన్న ఓర్పు, సహనం జగన్ లో మచ్చుకైనా లేదు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబును నరికినా పాపం లేదు అని బహిరంగ సభలో చెప్పడాన్ని నంద్యాల ప్రజలే కాదు యావత్ దేశమంతటా ఈ వ్యాఖ్యలపై ముక్కు మీద వేలు వేసుకున్నారు. జగన్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాదని ఈ పరిణామాలు చెబుతున్నాయి. తన తండ్రి మరణించిన తరుణంలో రాష్ర్ట ప్రజలంతా ఆయన మృత దేహం ఎక్కడ ఉందో అని ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం, ప్రజలు ఆందోళన పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేపట్టడం అందరినీ ఆశ్చర్చచకితులను చేసింది. పైగా ఈ చర్యలు సోనియా గాంధీను సైతం చిరాకును కలిగించాయి.
కేంద్ర మంత్రి వర్గంలో జగన్‌కు సహాయ మంత్రి ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం జగన్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన తన పదవీ కాంక్షను వదులుకోలేదు. నేటికీ పార్టీలో సీనియర్లను సరిగా గౌరవించరన్న అపప్రద ఉంది. లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికలలో నరసాపురం సీటు ప్రముఖ పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామకృష్ణం రాజుకు జగన్ పార్టీ టికెట్ ఇచ్చి ఉంటే ఆ ఎంపి తో పాటు నాలుగైదు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ పార్టీకు వచ్చి ఉండేవి. రెండేళ్లపాటు కనుమూరి రఘు నియోజకవర్గంలో పర్యటించి దాదాపు రూ. 60 కోట్లు వరకూ సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో ఆయన, ఆయన అనుచరవర్గం బిజెపిను గెలిపించింది.
ఇటువంటి స్వయం కృతాపరాధాలు జగన్ ఎన్నో చేయడం జరిగింది. ఆయన కోటరీ కూడా ఆయన విధంగానే ఆలోచిస్తొంది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఎత్తులు ఆంధ్రప్రదేశ్‌లో సాగవు. ఎందుకంటే ఆంద్రులు చాలా తెలివి గలవారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.