తెలుగుటైమ్స్ బిజినెస్ అవార్డులు ప్రోత్సాహానిస్తాయి... శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్
అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా 2 దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్’ పత్రిక ఇప్పుడు ఎన్నారై బిజినెస్ కమ్యూనిటీని ప్రోత్సహించేందుకు బిజినెస్ అవార్డులను ఇచ్చేందుకు ముందుకురావడం సంతోషదాయకమని శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ అన్నారు. ఏప్రిల్ 28, 2023న కాన్సుల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తెలుగుటైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (www.businessawards.telugutimes.net) వెబ్‌సైట్‌ను ప్రారంభించి మాట్లాడారు.
‘అమెరికాలో భారతీయ సమాజం అన్ని రంగాలలో బాగా రాణిస్తోంది. ఇక్కడ ఉన్న తెలుగువారు తమ ఉద్యోగాలతోపాటు, బిజినెస్ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. వారు తమ బిజినెస్‌ల ద్వారా భారతదేశానికి కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి అవార్డులు వారి వ్యాపార ప్రతిభను తెలియజేయడంతోపాటు, వారిని ఇతరులతో మరింత మెరుగ్గా పోటీపడేలా చేస్తాయని అంటూ, ఇలాంటి అవార్డులు యువ పారిశ్రామికవేత్తలకు మరియు స్టార్ట్ అప్ వ్యాపారాలు నిర్వహించే ఔత్సాహికులకు చాలా అవసరమని అన్నారు.
20 సంవత్సరాలుగా మీడియా సంస్థ/వార్తాపత్రికను నిర్వహించడం చాలా కష్టమని అంటూ, అదీ అమెరికాలో తెలుగు పత్రికను నిరంతరాయంగా నిర్వహిస్తున్న తెలుగు టైమ్స్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ఇవ్వాలన్న వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, ఈ అవార్డుల కేటగిరీలను చూసినప్పుడూ చాలామంది ఇందులో పాల్గొనేలా ఉందని చెప్పారు. తెలుగు టైమ్స్ ప్రతిపాదించిన బిజినెస్ అవార్డ్స్ యాక్టివిటీలో పారిశ్రామికవేత్తలందరూ తప్పకుండా పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023ని యుఎస్‌లోని తెలుగు బిజినెస్ కమ్యూనిటీ కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌ను డెవలప్ చేయడం ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలుగు టైమ్స్ ఎడిటర్, కంపెనీ సీఈఓ సుబ్బా రావు చెన్నూరి వివరించారు. ఈ సంవత్సరం 1. ఐటీ టెక్నాలజీ 2. ఐటీ సిబ్బంది 3. ఐటీ స్టార్ట్ అప్ 4. రియల్ ఎస్టేట్-కన్ స్ట్రక్షన్స్ 5. బ్యాంకింగ్/ ఇన్సూరెన్స్/ ఫైనాన్షియల్ సర్వీసెస్/ ట్యాక్స్ 6. హాస్పిటల్స్/హెల్త్ కేర్ 7. హోటల్స్/రెస్టారెంట్స్ 8. మాన్యుఫ్యాక్చరింగ్ 9. ఎంటర్‌టైన్‌మెంట్ 10. ఇతరులు, చిన్న వ్యాపారులు అంటే టర్న్ ఓవర్ 5 మిలియన్ ల డాలర్ ల వరకు మీడియం వ్యాపారులు అంటే 5 మిలియన్ ల నుంచి 20 మిలియన్ ల వరకు ఉన్నవారు ఇందులో ఉంటారు. అలాగే ఈ బిజినెస్ అవార్డుల ఎంపిక ప్రక్రియను కూడా సుబ్బారావు వివరిస్తూ, ప్రింట్, టీవీ, ఆన్‌లైన్ (కమ్యూనిటీ పోర్టల్స్), అవుట్‌డోర్ మీడియా ద్వారా బి) నామినేషన్ ల ద్వారా సి) నిపుణులైన సలహాదారుల బృందం ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుందన్నారు.
ఈ అవార్డుల వేడుకకు మీడియా పార్ట్‌నర్‌గా టీవీ 9 వ్యవహరిస్తోందని, అవార్డుల వివరాలను, అవార్డుల ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ కూడా టీవీ 9లో ఉంటుందన్నారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సలహాదారు శ్రీమతి విజయ ఆసూరి మాట్లాడుతూ, తెలుగు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ఖచ్చితంగా అభివృద్ధికి ఒక పెద్ద మెట్టు అని బాటా కార్యకలాపాలతో అనుబంధించడం సంతోషంగా ఉందని అన్నారు.
డాక్టర్ రమేష్ కొండా మాట్లాడుతూ, ఫాల్కన్ ఎక్స్ అనేది అనేక స్టార్టప్‌లకు యాక్సిలరేటర్‌గా పని చేస్తుందని మరియు తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023తో వెన్యూ పార్టనర్‌గా ఉంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
బాటా మరో సలహాదారు శ్రీ కరుణ్ వెలిగేటి, రైట్స్ సంస్థ సిఇఓ మనోహర్ బండ్ల, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రామ్ మిరయాల, తెలుగుటైమ్స్ డైరెక్టర్ జానకిరామ్ ప్రశాంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు టైమ్స్ గత 20 సంవత్సరాలుగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ప్రింట్ మీడియా రూపంలో, వెబ్ పోర్టల్ రూపంలో, టీవీ ఛానల్ రూపంలో వెలువడుతోంది.
ఇతర వివరాల కోసం చూడండి...
www.businessawards.telugutimes.net