వైభవంగా తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు
గత 21 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్’ గత సంవత్సరం నుంచి తెలుగు బిజినెస్‌మెన్‌లను అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశ్యంతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుగు టైమ్స్ ఎడిటర్, సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. మొదటిసారి అవార్డుల వేడుకను శాన్‌ఫ్రాన్సిస్కోలోని మిల్‌పిటాస్‌లో జరిగింది. ఇప్పుడు రెండవసారి తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న డల్లాస్‌లో జరిగింది.
జూన్ 16వ తేదీన జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు ఎంట్రప్రెన్యూరర్‌లు హాజరయ్యారు. ఈ వేడుకలను అమెరికా, ఇండియా జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ ఎడిటర్, సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలుగు టైమ్స్ పత్రికను ప్రారంభించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని అందరికీ వివరించారు. గత 21 సంవత్సరాలు తెలుగు టైమ్స్ ఏ విధంగా కమ్యూనిటీకి చేరువైందో తెలియజేశారు. తెలుగు టైమ్స్ పత్రిక, పోర్టల్, యాప్, య్యూ టూబ్‌లతో నేడు అమెరికాలోని తెలుగువారిని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు చేరువైందని చెప్పారు.
ఈ అవార్డు వేడుకల్లో తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, తెలుగు టైమ్స్‌తో, చెన్నూరి వెంకట సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. తరువాత వేడుకలకు హాజరైన ప్లానో మేయర్ జాన్ బి. మున్స్‌తోపాటు ఇర్వింగ్, ఫ్రిస్కో సిటీ నుండి వచ్చిన అధికారులను ఆహ్వానించి వారిని పరిచయం చేశారు. రఘు చిట్టిమళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ, అండ్ సి మాజీ సలహాదారు జె.ఎ చౌదరిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జె.ఎ. చౌదరి ఇలాంటి వేడుకలు ఎన్నారై వ్యాపారవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన భారత కాన్సుల్ జనరల్, డి.సి. మంజునాథ్‌ను నీల్ గొనుగొంట్ల వేదికపైకి ఆహ్వానించారు. బిజినెస్ రంగంలో తెలుగువాళ్ళు చేస్తున్న కృషిని భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ ప్రశంసించారు. విప్రోలో ఎంటర్‌ప్రైజ్ ఫ్యూచరింగ్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు నాగేంద్ర బండారు కీ నోట్ స్పీకర్‌గా హాజరై మాట్లాడారు. గ్రోత్ ఈక్విటీ హెడ్ రాజా దొడ్డాల, గౌరవ అతిథిగా హాజరై వేడుకకు నిండుదనం తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై వక్తల ప్రసంగాలు వచ్చినవారని ఆకట్టుకున్నాయి. ఈ చర్చాకార్యక్రమాలకు మోడరేటర్‌గా ఇంటెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ సిఇఓ సతీష్ మండువ వ్యవహరించారు. యుఎస్ ఇండియా ఛాంబర్‌ఆఫ్ కామర్స్ (డిఎఫ్‌డబ్ల్యు)కు చెందిన నీలిమ గొనుగుంట్ల, నాట్స్ మాజీ ప్రెసిడెంట్ బాపయ్య నూతి, నాటా మాజీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. నాగేంద్ర బండారు స్పాన్సర్లకు, పార్టనర్‌లకు మెమోంటోలను అందజేశారు. సురేష్ మండువ, సతీష్ బండారు (టాంటెక్స్), శ్రీధర్ బెండపూడి (ఐటీ బ్లూబర్డ్), శేషు కల్రా (సాఫ్ట్ కీస్ ఇంక్), వెంకటేశ్వర చిన్ని (పెలికాన్ వ్యాలీ), కృష్ణ కోరాడ (అప్లాజ్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు టైమ్స్ డైరెక్టర్ సివిబి కృష్ణ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. శ్రావ్య వేములపాటి చెన్నూరి తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. రామ్ సుశాంత్ చెన్నూరి, ప్రశాంత్ చెన్నూరి, అచ్చుత్ చెన్నూరి ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
అవార్డు గ్రహీతల వివరాలు
ఐటీ సర్వీసెస్ - శ్రీకాంత్ గడ్డం, ప్రెసిడెంట్, ఇఆర్‌పిఎ (కొలంబస్, ఒహాయో)
వెంచర్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ - దయాకర్ పుష్కర్, సిఇఓ-డల్లాస్ వెంచర్ క్యాపిటల్ (డల్లాస్)
హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ విభాగం - డా. యోగి చిమట, డల్లాస్ రెనాల్ గ్రూపు (డల్లాస్)
సినిమా అండ్ ఎంటర్ టైన్ మెంట్ - అనిల్ సుంకర, నిర్మాత, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, డల్లాస్
కమ్యూనిటీ సర్వీసెస్ - బాల ఇందుర్తి, ప్రెసిడెంట్, శంకర నేత్రాలయ (యుఎస్‌ఎ)
లీగల్ సర్వీసెస్ - గీత దమ్మన, అటార్నీ దమ్మన లా (డల్లాస్)
ఐటీ ప్రొడక్ట్ అండ్ డెవలప్‌మెంట్ - కిరణ్ పాశం, ప్రెసిడెంట్-ప్లాష్ బిఐ, అట్లాంటా
హోటల్-రెస్టారెంట్ - రమేష్ గాదిరాజు, ఎ2బి స్వీట్స్ అండ్ రెస్టారెంట్స్
రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ - విజయ్ బొర్రా, డిఎఫ్‌డబ్ల్యు ల్యాండ్
ఐటీ స్టాపింగ్ - మహేశ్వర్ కాసా, ప్రెసిడెంట్, కెకె సాఫ్ట్‌వేర్ అసోసియేట్స్