ఘనంగా జరిగిన టిఫాస్ ఉగాది ఉత్సవాలు
తెలుగు కళాసమితి (టిఫాస్), న్యూజెర్సి ఆధ్వర్యంలో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 28వ తేదీన వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించారు. దత్త గ్రూపు ఆధ్వర్యంలో భగవద్గీత ఆలాపన, స్వరవాణి మ్యూజిక్ స్కూల్, మువ్వ డ్యాన్స్ స్కూల్, ఉషశ్రీ ప్రతాప గ్రూపు, త్రిమూర్తి డ్యాన్స్ గ్రూపు వంటి సంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ విద్యార్థుల ఉగాది పాట ఆకట్టుకుంది. శ్రీదేవి ట్రిబ్యూట్ పేరుతో చంద్రిక గ్రూపు చేసిన డ్యాన్స్, ఉగాది డ్యాన్స్ వంటివి కూడా ఆహుతులను అలరించాయి.
ఈ వేడుకల్లోనే కొత్త టిఫాస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌ను అందరికీ పరిచయం చేశారు. నటకిరీటీ రాజేంద్రప్రసాద్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేశారు. మల్లిఖార్జున్, గోపికాపూర్ణిమల సంగీత విభావరి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. గురు ఆలంపల్లితోపాటు సత్యనేమన, రేణు తాడేపల్లి, శ్రీ జాగర్లమూడి, సుధాకర్ రాయపూడి, ఆనంద్ పాలూరి, మధు అన్న, వసంత గడంసెట్టి, వంశీ, మురళీ మేడిచర్ల, సుధాకర్ ఉప్పల, మధు, జ్యోతి గంది తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.