టిఎల్‌సిఎ కు 50 ఏళ్ళు
అమెరికాలో ఉన్న తెలుగువారు ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసిమెలిసి వేడుకలను చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో న్యూయార్క్‌లో ఉన్న కొందరు తెలుగు ప్రముఖులు మొట్టమొదటగా అమెరికాలో ఓ తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం. గ్రేటర్ న్యూయార్క్‌లోని తెలుగువారికోసం ఈ సంఘాన్ని స్థాపించారు. న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్‌లలో ఉన్న తెలుగువారిని కలుపుకుని వేడుకలు చేయాలని నిర్ణయించారు. 1969లో ఈ సంఘం ఊపిరిపోసుకుంది. 1971లో ఈ సంఘాన్ని రిజిష్టర్ చేశారు. తొలితరం తెలుగు సంస్థలలో ఒకటిగా టిఎల్‌సిఎ గుర్తింపు పొందింది. సంస్థ పేరులోనే తాము చేయదలచుకున్నదేమిటో సంస్థ నిర్వాహకులు చాటి చెప్పారు.
తెలుగు సంస్కృతీ పరిరక్షణ, విస్తృతపరచడం అన్న లక్ష్యంతో సంస్థ ఏర్పడింది. తెలుగు సాహిత్యంలో కొత్త ప్రక్రియలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా రంగాల్లో యువతకు, చిన్నారులకు పెద్దపీట వేయాలని తీర్మానించింది. తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాలను అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్ళడం, తెలుగులో సాంకేతిక సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం, తెలుగు వారి గురించి ఇతరులలో ఒక అవగాహనను పెంపొందించడంతో పాటు వారి సహాయ సహకారాలను ప్రోత్సహించడం, అవసరమైన విద్యార్ధులకు తగిన ఉపకార వేతనాలు అందించడం, ధార్మిక, విద్యా, శాస్త్ర రంగాలలో కృషి చేస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించడం వంటివి టిఎల్‌సిఎ ముఖ్య లక్ష్యాలు.
న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్‌లలో ఉన్న తెలుగువారితో కలిసి వేడుకలను చేయడం ప్రారంభించింది. సభ్యుల సమష్టికృషితో సంస్థ ఎదుగుతూ నేడు ప్రముఖమైన సంస్థగా మారింది. తొలి జాతీయ సంఘం తానా ఏర్పాటులో టిఎల్‌సిఎ పాత్ర కూడా ఉంది. 1993లో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో టిఎల్‌సిఎ సభ్యులే చురుకైన పాత్రను పోషించారు. 1996లో పాతికేళ్ళు పూర్తి చేసుకుని సిల్వర్‌జూబ్లి వేడుకలను ఘనంగా జరుపుకుంది. క్వీన్స్‌లో జరిగిన ఈ సిల్వర్‌జూబ్లి ఉత్సవంలో మాజీ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. 2006లో 35వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా చేశారు. నేడు గోల్డెన్ జూబ్లి ఉత్సవాలను ఈ సంఘం నిర్వహించుకుంటోంది.
అమెరికాలో నేడు తెలుగువారి సంఖ్య లక్షల్లో ఉన్నా, తొలితరంవాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ సంఖ్య వందల్లోనే ఉండేది. ఈ వందలాదిమందిలో ఎక్కువమంది ప్రొఫెషనల్స్ కావడం వల్ల ఎవరికివాళ్ళు ఇంట్లోనే మన పండుగలను, ఇతర వేడుకలను చేసుకునేవారు. క్రమక్రమంగా ఈ ప్రొఫెషనల్స్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దాంతో అమెరికాలో ఉన్న తెలుగువారంతా ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసిమెలిసి వేడుకలను చేసుకోవాలన్న ఉద్దేశ్యం ఏర్పడిరది. న్యూయార్క్‌లో ఉన్న కొందరు తెలుగు ప్రముఖులు తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం. గ్రేటర్ న్యూయార్క్‌లోని తెలుగువారికోసం ఈ సంఘాన్ని స్థాపించారు. న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్‌లలో ఉన్న తెలుగువారిని కలుపుకుని వేడుకలు చేయాలని నిర్ణయించారు. 1969లో ఈ సంఘం ఊపిరిపోసుకుంది. 1971లో ఈ సంఘాన్ని రిజిష్టర్ చేశారు. తొలితరం తెలుగు సంస్థలలో ఒకటిగా టిఎల్‌సిఎ గుర్తింపు పొందింది. సంస్థ పేరులోనే తాము చేయదలచుకున్నదేమిటో నిర్వాహకులు చాటి చెప్పారు.
న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్‌లలో ఉన్న తెలుగువారితో కలిసి వేడుకలను చేయడం ప్రారంభించింది. సభ్యుల సమష్టికృషితో సంస్థ క్రమక్రమంగా ప్రముఖమైన సంస్థగా, ప్రాచీనమైన సంఘంగా గుర్తింపును తెచ్చుకుంది. ఒక సంస్థ విజయం సభ్యులకు అది అందించే సేవలపైనే ఆధారపడి ఉంటుంది. స్థానిక తెలుగు సభ్యులకు అండగా నిలవడమే ఈ సంస్థ నిరంతర అభివృద్ధికి ప్రధానం. ఈ పాతికేళ్లలో టీఎల్‌సీఏ సాధించిన కొన్ని మైలురాళ్లను ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్నో కనిపిస్తాయి. ఎక్కువ మంది సభ్యులు సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడంలో సంస్థ విజయాన్ని సాధించింది. గతంలో స్థానిక స్కూల్ ఆడిటోరియాల్లో నిర్వహించిన సంస్థ కార్యక్రమాలను, ప్రొఫెషనల్ ఆడిటోరియం (ఫ్లషింగ్ హిందూ టెంపుల్ ఆడిటోరియం)కు మార్చడం వంటివి సంస్థ ఎదుగుదలకు దోహదపడిరది. టిఎల్‌సిఎ కార్యక్రమాల్లో భారత రాజకీయ, సినీ ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. యువత, చిన్నారులు సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడం పెరిగింది.కొన్నేళ్లుగా దీనిపై నాయకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల నేడు స్టేజిపై వివిధ ప్రదర్శనల్లో 40 మందికిపైగా చిన్నారులు కనిపిస్తున్నారు. ప్రతి ఏటా ఆటలు, నృత్యం, పాటలు పాడటం తదితర పోటీలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. వీటిలో చిన్నారులు పాల్గొంటున్నారు.
తాజాగా జరిగిన పోటీల్లో (2021) నాలుగేళ్లు కూడా నిండని పసివాళ్లు తెలుగు పద్యాలను వల్లెవేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. తెలుగు భాష మీద పెద్దగా పట్టు లేకపోయినా యువత టీఎల్‌సీఏ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఈ బ్యానర్ కింద సొంత ప్రోగ్రామ్‌లు చేయడం మైలురాళ్ళలో ఒకటిగా పేర్కొనవచ్చు. స్కిట్లు, ఫ్యాషన్ షోల వంటి అనేక కార్యక్రమాలను టీఎల్‌సీఏ వార్షిక కేలండర్‌తో సంబంధం లేకుండా ఈ యువసభ్యులు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. దాంతోపాటు టీఎల్‌సీఏకు ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని ట్రస్టీలు ఆలోచిస్తున్నారు. దీనికోసం కొంత మొత్తాన్ని సేకరించారు కూడా. ఈ ఏడాది చివరిలోపే టీఎల్‌సీఏకు ప్రత్యేక భవనం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ, వారి కార్యకలాపాలు చాలా మెరుగవుతాయి. తెలుగు సంఘాల్లో అన్నింటికన్నా ముందు ప్రారంభమైన టీఎల్‌సీఏ ఎన్నో ఒడిదుడుకు లన్నీ తట్టుకొని నేడు 50 వసంతాలు పూర్తి చేసుకుని భవిష్యత్తుకు ఢోలా లేదనేలా పటిష్టమైంది.
కార్యక్రమాలు
టిఎల్‌సిఎ ఆధ్వర్యంలో తెలుగువారి పెద్ద పండుగలైన ఉగాది, దీపావళి, సంక్రాంతి వేడుకలతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే పెరెడ్‌లో పాల్గొని దేశభక్తిని చాటుతూ నేటి తరం చిన్నారులకు మన దేశం గురించి తెలియజేస్తున్నారు. మరోవైపు సంఘం ఆధ్వర్యంలో చిన్నారుల కళా నైపుణ్యం పదిమందికి వెలికితీసేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణాష్టమి, శ్రీరామనవమి వంటి పండుగలను కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు కమ్యూనిటీకోసం ఉచిత వైద్యశిబిరాలను కూడా టిఎల్‌సిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. మదర్స్ డే, ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి ఆదర్శవంతులైన తల్లితండ్రులను సత్కరిస్తున్నారు. చిన్నారులకు పోటీలను నిర్వహించి వారిలోని ప్రతిభను సంఘం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. పిక్నిక్ కార్యక్రమాలను నిర్వహించి ఉల్లాసాన్ని కలిగించేలా పోటీలను ఏర్పాటు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను టిఎల్‌సిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్నారు. ఆటల కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ఉపన్యా సాలు, సెమినార్‌లు ఇలా ఎన్నో విషయాలపై టిఎల్‌సిఎ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో వర్చువల్‌గా కార్యక్రమాలను నిర్వహించి ఇతర నగరాల్లోని తెలుగువారిని కూడా భాగస్వామ్యం చేసింది.
ఎంతోమంది ప్రముఖులతో...
టిఎల్‌సిఎ నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో సినీ, రాజకీయ, ఇతర రంగాలవారు ఎంతోమంది పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు, మర్రి చెన్నారెడ్డి, సాహితీ వేత్త డా. సి. నారాయణరెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావును, ఘంటసాల వెంకటేశ్వరరావును, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను, సాలూరి రాజేశ్వర రావు, హీరోయిన్ జయప్రద తదితరులను ఘనంగా సన్మానించి తన సంస్థ గొప్పదనాన్ని చాటి చెప్పింది. పద్మశ్రీ బాపు, కూచిపూడి కళాకారులు రాధ, రాజారెడ్డి, అన్నమాచార్య గాయని శ్రీమతి శోభారాజు, సినీరచయిత జొన్నవిత్తుల, దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, అలీ, సుమన్, సినీహీరోయిన్‌లు ఎందరో టిఎల్‌సిఎ వేడుకల్లో పాల్గొన్నారు.
టిఎల్‌సిఎ అధ్యక్షులు...
టిఎల్‌సిఎ తొలి అధ్యక్షునిగా 1971-72లో జి.ఎ. నరసింహరావు, 1973లో రాధాకృష్ణమూర్తి దశిక, 1974లో శివరామరెడ్డి బండారు, 1975-76లో సుబ్బారావు కాకర్ల, 1976 -77లో రవీంద్రనాథ్ గుత్తికొండ, 1977-79లో కృష్ణశాస్త్రి వావిలాల, 1978-79లో తిరుమలరావు తిపిర్నేని, 1979-80లో కె. మధుసూధన్ రెడ్డి, 1980-81లో రాధాకృష్ణ మూర్తి, 1981-82లో దశరథరామిరెడ్డి గడ్డం, 1982-83 సత్యనారాయణ మేకల, 1983-84లో రామకృష్ణారెడ్డి ఇసనాక, 1984-85లో చంద్రశేఖర్ రాయపేట్, 1985-86లో జి. రామ్మూర్తి, 1986-87లో బలరామ్ పమ్మి, 1987-88 నారాయణ పిరమర్ల, 1988-90 నిర్మలా శాస్త్రి, 1990-92లో కృష్ణ పోలవరపు, 1992-93లో ఙానసుందర్ రెడ్డి, 1993-94లో చెంచురామయ్య చిమ్మిరి, 1998-01లో జానకిరావు, 2001-03లో నెహ్రూ చెరుకుపల్లి, 2003-04లో మహేష్ సలాడి, 2004-06 అంజు కొండబోలు, 2006-08 ప్రసాద్ కంభంపాటి, 2008-09 హైమారెడ్డి, 2009-10 వెంకటేష్ ముత్యాల, 2010-11 శివకుమార్ ముతకి, 2011-12 విక్రమ్ జంగం, 2012-13 నాగేంద్ర గుప్తా వేలూరు, 2013-14 కృష్ణశ్రీ గంధం, 2014 రావు వోలేటి, 2015 రాజి కుంచం, 2016 సత్య చల్లపల్లి, 2017 శ్రీనివాస్ గూడూరు, 2018 ధర్మారావు తాపి, 2019 అశోక్‌కుమార్ చింతకుంట, 2020 బాబు కుదరవల్లి, 2021 ఉదయ్‌కుమార్ దొమ్మరాజు.