సంస్కృతిని కొనసాగించాలి రేపటి తరం పాటించేలా చూడాలి...
తెలుగుటైమ్స్ ఇంటర్వ్యూ లో టిఎల్ సిఎ ప్రెసిడెంట్ ఉదయ్ దొమ్మరాజు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం.. అమెరికాలో ప్రాచీనమైన సంఘాల్లో ఒకటి. తెలుగు సంఘాల్లో మొట్టమొదటిది. గ్రేటర్ న్యూయార్క్, న్యూజెర్సి, కనెక్టికట్ ప్రాంతాల్లోని తెలుగువారికోసం ఏర్పడిన టిఎల్‌సిఎ నేడు గోల్డెన్‌జూబ్లి ఉత్సవాలను చేసుకుంటోంది. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రెసిడెంట్‌గా ఉన్న ఉదయ్ దొమ్మరాజును తెలుగు టైమ్స్ న్యూస్ ఎడిటర్ గోవిందరాజన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు.
మీ గురించి చెప్పండి?
మాది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుజిల్లా పిచ్చాటూరు. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. ఎస్.వి.యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలి సివిల్ ఇంజనీరం చదివాను. చెన్నై అన్నాయూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తరువాత అమెరికా వచ్చే అవకాశం లభించడంతో న్యూయార్క్‌కు వచ్చాను. దాదాపు 20 సంవత్సరాలకుపైగా నేను ఇక్కడే ఉంటున్నాను. అటు న్యూయార్క్ స్టేట్‌లో ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి పలువురికి ఉద్యోగ అవకాశం కల్పించాను. నా కుమారుడు ఈశ్వర్‌కు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో నిర్మాతగా మారి 4 లెటర్స్ పేరుతో ఓ సినిమాను కూడా నిర్మించాను. ఆ సినిమా విజయాన్ని సాధించింది. కమ్యూనిటీకి సేవ చేయాలన్న తలంపుతో టిఎల్‌సిఎలో చేరి నేడు ఆ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉంటూ మన సంస్కృతి, మన భాష పరిరక్షణకు కృషి చేస్తున్నాను.
ప్రెసిడెంట్‌గా మీరు చేసిన కార్యక్రమా లేమిటి?
50 ఏళ్ళ క్రితం ఎన్నో విలువలతో మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ సంస్థ నేటికీ తెలుగు వారికి నిరాటంకంగా సేవ చేస్తుండంటే అందుకు కారణం విలువలను పాటిస్తూ రావడమే. ఎక్కడా రాజీ పడకుండా సంస్థ ఉన్నతికి నాతోపాటు ఇంతకుముందు పనిచేసిన పెద్దలంతా ఉన్నత విలువలతో సంస్థని నడిపారు. నా హయాంలో కూడా నేను కూడా పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే మరోవైపు నేటితరానికి ఉపయోగపడేలా వాటికి సాంకేతికను జోడించి నిర్వహించాను. తెలుగు భాష, సాహిత్యం వైభవాన్ని ప్రదర్శించడంతో పాటు వాటిని వచ్చే తరం కూడా పాటించేలా చేయడానికి నావంతుగా కృషి చేశాను. నేను ప్రెసిడెంట్ అయిన తరువాత కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సమయంలో కార్యక్రమాలను బహిరంగంగా చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిస్థితులను పాజిటివ్‌గా మలచుకుని ఇంట్లో నుంచే ఎన్నో కార్యక్రమాలను చేయవచ్చని నిరూపించాను. వర్చువల్‌గా సంస్థ తరపున సంక్రాంతి, ఉగాది, దీనివల్ల ఫిజికల్‌గా చేసేదానికన్నా తక్కువ సమయంలో ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఈ వర్చువల్ కోవిడ్ మన జీవనవిధానాన్ని మార్చింది. ఇంట్లో ఉంటూ అనేక కార్యక్రమాలను చేయవచ్చని అర్థమైంది. పాజిటీవ్‌గా ఆలోచించి నేను కార్యక్రమాలను చేయడం ప్రారంభించాను. ఫిజకల్‌గా చేసే దానికన్నా కోవిడ్ సమయంలో ఎన్నో కార్యక్రమాలను వర్చువల్‌గా చేసి విజయాన్ని సాధించాము. భక్తమార్కండేయ శివరాత్రి హరికథ, సంక్రాంతి, ఉగాది కార్యక్రమాలను చేశాము. తెలుగు ఫ్లాష్ కార్డ్స్ పంపిణీ, కాలేజీ విద్యార్థులకోసం సెమినార్‌లు, ఇమ్మిగ్రేషన్ ఇతర విషయాలపై సెమినార్‌లు వంటివి కూడా ఏర్పాటు చేసి నిర్వహించాము. మాతృ దినోత్సవాన్ని అంతర్జాల వేదికగా చేశాము. అమెరికాలోని ప్రవాస తెలుగువారే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో వున్న తెలుగువారు సైతం ఆయా కార్యక్రమాలు చూసి ఆనందించే సౌకర్యాన్ని ఈ అంతర్జాల కార్యక్రమాలు కల్పించాయి. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక, ఆహార, ఆర్థిక, సాహిత్య కార్యక్రమాలు, యూత్ కోసం బ్యాక్యార్డ్ సినిమా జోన్స్, బీచ్ బోర్డ్ వాక్, టి.ఎల్.సి.ఏ. ఏన్యువల్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లాంటి ఎన్నో చేయడం జరిగింది. అనేకమంది తెలుగువారి రాకతో వార్షిక పిక్నిక్‌ని ఆడంబరంగా దిగ్విజయంగా నిర్వహించాం.
తెలుగు భాష పరిరక్షణకు చేస్తున్న కృషి ఏమిటి?
తెలుగు భాష, సంస్కృతి, మనకి రెండు కళ్ళులాంటివి. మన సంస్కృతిని, వ్యక్తీకరించేందుకు భాష ఎంతో అవసరం. మన ఉనికిని ప్రపంచానికి చాటేదే మన భాష అందుకే మీ పిల్లలు కూడా తెలుగులో మాట్లాడేలా చూడండి. మన పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవడానికి అనుకూలంగా మేము తెలుగు అక్షరాలు, తెలుగు పదాలతో కూడిన బొమ్మల సముదాయంతోటి తెలుగు ప్లాష్ కార్డ్స్‌ని ముద్రించి అందరికీ అందజేయడం జరిగింది.
కోవిడ్ సమయంలో చేసిన సహాయ కార్యక్రమాలు వివరిస్తారా?
కోవిడ్ సమయంలో టిఎల్‌సిఎ తరపున ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. మాస్క్‌ల పంపిణీ, తెలుగు రాష్ట్రాల్లో సహాయ కార్యక్రమాలు, అలాగే కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన జానపద కళాకారులను ఆదుకునేలా ఉగాది, సంక్రాంతి పండగలలో వారినీ భాగస్వాములను చేసి, వారికి ఆర్థికంగా అండగా నిలిచాము. ప్రాచీన జానపద కళాలు సంస్కృతిని, కాపాడేందుకు కృషి చేశాము.
యువతకు మీరిచ్చే సందేశమేమిటి?
మన కళలకు సంప్రదాయమే పట్టుకొమ్మ. సాంప్రదాయన్ని జనింపజేసేదే భాష, భాషని ఆధారంగా చేసుకుని జాతి జాగృతం అవుతుంది. మాతృభాషా, సంస్కృతి, సంప్రదాయ, కళా, సాహితీరంగాలకు సదాచారాలను కొనసాగించుకోవడానికి మనం సమిష్టిగా వుండటానికి టి.ఎల్.సి.ఏ లాంటి సంఘంలో యువత సభ్యులుగా చేరాలి. మూడు తరాల ప్రతినిధులను చూసిన టి.ఎల్.సి.ఏ మరిన్ని సంవత్సరాలు సజీవంగా ఉన్నతాశయాలతో ముందుకు నడవాలంటే యువత బాధ్యత తీసుకుని సంఘంలో భాగస్వాములై తెలుగుదనం పురోభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను.
టిఎల్‌సిఎ గోల్డెన్ జూబ్లి విశేషాలు వివరిస్తారా?
50 ఏళ్ల సుధీర్ఘ సేవా ప్రస్థానంలో తూర్పు పడమరల వారధిగా ఉత్తర అమెరికాలో ప్రవాస తెలుగు వారి సారధిగా టిఎల్‌సిఎ ఉంది. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ వారినంత ఒక్కతాటిపైనా తీసుకురావాలనే సదుద్దేశంతో అమెరికాలో మొట్టమొదటగా ఏర్పడినా మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం. తెలుగు సంస్కృతీ, సంప్రదాయం, సాహిత్య వైభవాన్ని కొనసాగిస్తూ మన విలువలు, సంస్కారాన్ని భావితరాల వారికి అందించాలన్న ఆశయంతో ముందుకెళుతోంది. 50 సంవత్సరాల గోల్జెన్ జూబ్లి వేడుకలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, పోటీలను ఏర్పాటు చేశాము. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సుమంగళి, శ్రీకాంత్ సందుగు, కుమారి మౌనిమ పాటల కార్యక్రమం, టిఎల్‌సిఎ స్వర్ణోత్సవ వేడుకల స్వాగత గీతం, టిఎల్‌సిఎ మహిళల నృత్య కోలాహలం, స్థానిక చిన్నారుల, జానపద, సినీ నృత్య కార్యక్రమం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ఇలా ఎన్నో కార్యక్రమాలను గోల్డెన్ జూబ్లి వేడుకల్లో ప్రదర్శించనున్నాము.