ASBL Koncept Ambience

న్యూయార్క్‌లో ఘనంగా టీఎల్‌సిఎ సంక్రాంతి వేడుకలు

న్యూయార్క్‌లో ఘనంగా టీఎల్‌సిఎ సంక్రాంతి వేడుకలు

న్యూయార్క్‌లో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు బాబు కుదరపల్లి, ఉపాధ్యక్షులు ఉదయ్‌ కుమార్‌ దొమ్మరాజు ఆధ్వర్యంలో జనవరి 25, 2020న ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. దాదాపు 600 మంది సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిరంజీవులు హానిక, ఈక్ష, ప్రియల ప్రార్థనాగీతంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

జయప్రకాశ్‌ ఎంజపురి, కిరణ్‌ కుమార్‌ పర్వతాల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలు చిన్న పిల్లల ఫ్యాషన్‌ షో తో మొదలుపెట్టి, దాదాపు రెండున్నర గంటల పాటు విభిన్న ప్రదర్శనలతో సభికులందరి హృదయాలు దోచుకున్నాయి. నెహ్రు కట్టారు, శ్రీమతి మాధవి కోరుకొండ, టీఎల్‌సీఎ యువత స్వచ్ఛందంగా ముఖ ద్వారం వద్ద నిల్చుని, వచ్చిన అతిథులందరిని సాదరంగా ఆహ్వానించి రాఫెల్‌ టిక్కెట్‌ను అందజేశారు. మద్దిపట్ల ఫౌండేషన్‌ వారి సహాయంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఉచిత ప్రవేశము కల్పించడముతో పాటు టీవీ, ల్యాప్‌టాప్‌ వంటి మొత్తం 5 రాఫెల్స్‌ని సభ్యులకు అందచేయ గలిగాము. సాంస్కృతిక కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా వయోభేదం లేకుండా 4 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయసువారి వరకు అత్ముత్సాహంతో పాల్గొని, సంప్రదాయ నృత్యాలు, సినిమా డాన్సులు, జానపద నృత్యాలు, అన్నమయ్య కీర్తనలు వంటి ఎన్నెన్నో ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. కొంతమంది చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొనటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉత్సాహంగా వచ్చి తమ నృత్య ప్రదర్శనలతో అతిథులను ఆనందింపచేసారు. అజిత్‌ తెంబూర్ని, శ్రీనివాస్‌ శనిగేపల్లి పరివేక్షణలో కమ్మని అచ్చ తెలుగు వంటకాలతో అతిథులందరికీ విందు బోజనం పెట్టారు. మన సంక్రాంతి స్పెషల్‌ నేతి అరిసెలు, దోస అవకాయ పచ్చడి వంటి వంటకాలను అందరు పదే పదే మెచ్చుకున్నారు. ఎంతోమంది సభ్యులు, ముఖ్యంగా యువత నడుంకట్టి అందరికి ప్రేమతో వడ్డించిన తీరు అందరిని ఆకట్టుకొంది.

భోజనానంతరం వేదపండితులు, శ్రీయుతులు హనుమంతరావు వేదమంత్రాలతో మన కార్యక్రమం రెండవ భాగం ప్రారంభమైంది. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సీనియర్స్‌ కోలాటం అందరినీ ఉత్సాహపరచగా, శ్రీమతి సాధనా పరానీ కొరియోగ్రాఫ్‌ చేసిన ఒకే నృత్య నాటకంలో ద్రౌపదీ వస్త్రావహరణం, హిరణ్యకశివుని వధ, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించి ప్రేక్షకులను రంజింప చేసారు.

బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ అధ్యక్షుడు డా|| పూర్ణ అట్లూరి, టీఎల్‌సీఎ 2020 కార్యవర్గంలో నియమితులైన నూతన సభ్యులను సభకి పరిచయం చేసారు. అందులో జయప్రకాశ్‌ ఎంజపురి కార్యదర్శిగాను, నెహ్రు కటారు కోశాధికారిగాను, కిరణ్‌ కుమార్‌ పర్వతాల సహాయ కార్యదర్శిగాను, శ్రీమతి లక్ష్మి మండవ, అజిత్‌ తెంబూర్షి, శ్రీనివాస్‌ శనిగేపల్లి, శ్రీమతి మాధవి కోరుకొండ కార్యవర్గ సభ్యులుగాను నియమితులయ్యారు. అధ్యక్షులు శ్రీ బాబు కుదరవల్లి నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి, వారిని అభినందించారు. తదుపరి అధ్యక్షులు బాబు కుదరవల్లి తన ప్రసంగంలో టీఎల్‌సీఏ సంస్థని పటిష్ట పరచటమే కాకుండా, తెలుగు వారిని, వారి సంప్రదాయాలను అందరికీ పరిచయం చేయటమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. కార్యవర్గ సహాయంతో ఎన్నో నూతన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు, అందులో ముఖ్యంగా మహిళలకు, యువతకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. తెలుగు సంస్కృతిని, భాషా వైభవాన్ని ఎలుగెత్తి చాటే తన ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం కోసం ఆర్థిక సహాయం అందించిన డా. శుభ అట్లూరి, పూర్ణ అట్లూరి, డా. రాఘవరావు పోలవరపు, శ్రీమతి ప్రభావతి-డా. కృష్ణ గుజవర్తి, శ్రీమతి జ్యోతి- కృష్ణ మద్దిపాటి, శ్రీమతి రత్నమాల-డా. మోహన్‌, శ్రీమతి లక్ష్మీ-డా. నాగేశ్వరరావు మండవ, డా. రాధ-రావు వోలేటి, డా. జానకి-డా. జగ్గారావు అల్లూరి, శ్రీమతి కళ్యాణి - డా. ప్రసాద్‌ అంకినీడు, శ్రీమతి రమ-ప్రసాద్‌ కంభంపాటి, శ్రీమతి సీత-సుబ్బు గరికిపాటి, డా. జ్యోతి జాస్తి సుమంత్‌ రామిసెట్టి, రంజిత్‌, కిషోర్‌ తదితరులకు, స్వచ్ఛంద సేవలందించిన సభ్యులకు, వివిధ జాతీయ తెలుగు సంఘాలనుంచి విచ్చేసిన కార్యనిర్వహక సభ్యులకు ఇండియా హోమ్‌ యాజమాన్యానికి, అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.

బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ కార్యదర్శి కృష్ణ మద్దిపట్ల తమ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. డా|| పూర్ణ అట్లూరి అధ్యక్షులు గాను, శ్రీ వెంకటేష్‌ ముత్యాల గారిని సహాయ అధ్యక్షులుగాను, కృష్ణ మద్దిపట్లని కార్యదర్శిగాను. డా|| ప్రసాద్‌ అంకినీడును కోశాధికారి గాను ప్రకటించారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ అధ్యక్షులు డా|| పూర్ణ అట్లూరి మాట్లాడుతూ టీఎల్‌సీఏ సభ్యులందరు ఒక సొంత భవనం నిర్మించుకోవటం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌ లో పాల్గొన్న చిన్నారులకు, రంగవల్లి లో విజేతలకు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యులు బహుమతులు అంద చేసారు. ఈ కాంపిటీషన్స్‌కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమతి లక్ష్మి మండవకి డా|| నాగేశ్వర రావు మండవ గారికి, శ్రీమతి ఉమా పోలిరెడ్డి గారికి, శ్రీమతి వాణి బీసం గారికి, కుమారి నవ్య వోలేటీ గారికి, శ్రీమతి అనురాధ పారేపల్లి గారికి సంఘం తరుపున ధన్యవాదాముల తెలిపారు.

సినీ నేపథ్య గాయనీ గాయకులు అంజనా సౌమ్య, సింహ పాడిన పాటలు అందరినీ మైమరపింపజేశాయి. కొత్త, పాత పాటల సమ్మేళంతో వారు అందరినీ అకట్టుకున్నారు. సింహ పుణ్యభూమి నా దేశం, జాతీయగీతం జనగణమన అలాపనతో ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ముగింపు పలికారు.

 

Tags :