కమనీయంగా టిఎల్ సిఏ విళంబి ఉగాది సంబరాలు
మన తెలుగు వారి తొలి పండుగ ఉగాది. తెలుగు లోని తీయదనాన్ని -సంబరాలలో ఉండే సంతోషాన్ని 47 సంవత్సరాలుగా న్యూయార్క్ నగరంలోని మన తెలుగు తరాలకు అందజేస్తున్న తెలుగు సంస్థ టి ఎల్ సి ఏ, ఈసారి కూడా విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను అధ్యక్షులు డా.ధర్మారావు తాపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. 2018 ఉగాది మరియు శ్రీరామనవమి సంబరాలను మార్చి 31న న్యూయార్క్‌లోని ప్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో 9 గంటల పాటు ఎంతో ఆహ్లాదరకంగా జరిపింది.
హాల్ బయట కోశాధికారి జయప్రకాశ్ ఇంజపురి, రమాకుమారి వనమా అతిథులకు ఆహ్వానం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని కార్యదర్శి బాబు కుదరవల్లి ప్రారంభించగా, సాంస్కృతిక కార్యవర్గం ప్రసాద్ కోయి, జ్యోతి జాస్తి, నెహ్రు కటారు ఆధ్వర్యంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కర్నాటక సంగీత గానాలు, శాస్త్రీయ నృత్యాలను సాధన పరాన్జీ కోరియోగ్రఫీతో శివపాద మంజీర నాదం, దివికేగిన మన ప్రియతమ నాయిక శ్రీదేవి స్మ్రృతిగా మాధవి కోరుకొండ కోరియోగ్రఫీతో చిత్రలహరి సినిమా పాటల నృత్యాలు వంటివి అందరినీ అలరించాయి. కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులందరికీ పార్టిసిపేషన్ ట్రోఫీ ఇవ్వడం పిల్లలకు పెద్దలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
శిరీష తునుగుంట్ల, సురేష్ బాబు తమ్మినేని, నెహ్రు కటారు ఆధ్వర్యంలో మన తెలుగు సాంప్రదాయ వంటలతో రమాకుమారి వనమా ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడితో ఏర్పాటు చేసిన ఉగాది విందు విచ్చేసిన అతిధుల ప్రశంసలను అందుకుంది.
విందు తరువాత పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలను ప్రారంభించారు. సాధన పరాన్జీ విద్యార్థినిలు సాహిత్యశ్రీ తాప, శ్రేష్ఠ పరాన్జీలు చేసిన మహాశక్తి శాస్త్రీయ నృత్యప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. డా. జ్యోతి జాస్తి నేత్రృత్వంలో 61 మందితో నిర్వహించిన మన తెలుగు వారి చేనేత వస్త్రధారణ ఫ్యాషన్ షో కనుల పండువగా జరిగి కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.
జయప్రకాశ్ ఇంజపురి, ఉమారాణి పోలిరెడ్డి, నెహ్రు కటారు, అశోక్ చింతకుంట మరియు వారి కార్యవర్గం ఎంతో శ్రమించి తయారు చేసిన ఉగాది సంచికను ప్రముఖ ప్రఖ్యాత సినిమా రచయిత, నటుడు తనికెళ్ళ భరణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. తనికెళ్ళ భరణి ప్రసంగం, ఆట కదరా శివ పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సింగర్స్ యజిన్ నిజార్, ఉష గార్ల కొత్త, పాత సినీ పాటల కార్యక్రమము ఎంతో మధురముగా జరిగింది. బి ఓ టి అధ్యక్షులు డా.పూర్ణ అట్లూరి కూడా ప్రసంగించారు.
బి ఓ టి కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమానికి విరాళములు అందజేసిన దాతలకు, రాఫెల్ బహుమతి విరాళంగా అందించిన మద్దిపట్ల ఫౌండేషన్ వారికి, కార్యక్రమము లో సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్‌కి అధ్యక్షులు డా.ధర్మరావు తాపీ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమమలు జయప్రదంగా జరగడానికి పూర్వ అధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు అన్ని విధాలా సహకరించారు.
కార్యవర్గం అంతా కలిసి ఎంతో కష్టపడి తెలుగు వారమంతా ఒకటే అనే విశిష్టతను పిల్లలకు పెద్దలకు అందజేయాలని అనే తపనతో ఏర్పాటు చేసిన ఈ ఉగాది కార్యక్రమం ఎంతో అద్భుతంగా సాగి జనగణమన జాతీయగీతంతో ముగిసింది.