న్యూయార్క్ లో వైభవంగా టిఎల్ సిఎ ఉగాది
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీటవేస్తూ, తెలుగు పండుగల ఆనందోత్సవాల స్ఫూర్తిని కొనసాగిస్తూ మిన్నంటిన ఉత్సాహంతో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 17, 2016న స్థానిక గణేష్ టెంపుల్ ఆడిటోరియం, ప్లషింగ్, న్యూయార్క్ నగరంలో ఘనంగా జరిగాయి. సంస్థ ఆవిర్భవించి 45 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా జరుపుకున్న ఈ ఉత్సవాలకు తెలుగువాళ్ళు సకుటుంబంగా తరలి వచ్చి తెలుగువారి మధ్య ప్రేమానురాగాలను, ఐకమత్యాన్ని మరోమారు చాటారు. అధ్యక్షులు సత్య చల్లపల్లి, ఆయన బృందం అహర్నిశలూ శ్రమించి ఈ ఉగాది వేడుకలను ఆహుతులు అబ్బురపరిచేలా నిర్వహించి టి.ఎల్.సి.ఏ సంస్థ విశిష్టతను చాటారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు టాలీవుడ్ సినీ హీరో నిఖిల్, కథానాయిక మధుశాలిని, మరో నాయిక సన కూడా పాల్గొన్నారు.
హాయి హాయిగా ఆమనిసాగే మది ఉయ్యాలగా జంపాలగా అంటూ సాగిన ఈ ఉగాది సంస్కృతిక కార్యక్రమాలకు సంస్థ కార్యదర్శి తాపీ ధర్మారావు తొలి పలుకులతో శ్రీకారం చుట్టారు. విభిన్నమైన వినూత్నమైన కార్యక్రమాలతో అంబరాన్నంటిన ఈ ఉగాది వేడుకలలో దాదాపు 800 మంది ఉత్సాహంతో పాల్గొని ఉగాది వేడుకలను తిలకించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు దాదాపు 9 గంటలపాటు నిర్విరామంగా సాగాయి. తదనంతర కార్యక్రమాలు జయప్రకాష్ ఇంజూపురి ఆధ్వర్యంలో వినూత్నంగా టి.ఎల్.సి.ఏ కార్యవర్గం ముక్తకంఠంతో గానం చేసిన వందేమాతర గీతంతో ప్రారంభమైంది. ధూమ్ ధాం గా జరిగిన వైవిధ్యభరితమైన ప్రదర్శనల్లో చిన్నారుల నృత్యాలు, ఆటపాటలు, నాటికలు, కనులవిందు చేసాయి. విరామంలో సంఘ సభ్యులు రమకుమారి వనమ, ఉమారెడ్డి టీం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి అందించి, పసందైన ఉగాది విందు భోజనంతో ఆహుతులకు సేదతీర్చారు.
వేదపండితుల పంచాంగ పఠనం, ఆశీర్వచనాలతో ప్రారంభమైన వసంతకాల సాయంత్రం సభలో అధ్యక్షులు సత్య చల్లపల్లి దంపతులు అర్చక స్వాములైన పండితులను సత్కరించి వారి మంగళ ఆశీర్వాదాలతో ముఖ్య కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. జనసంద్రమైన సభలో ముందుగా ప్రారంభించిన అభినవ అశ్వద్ధామ, శ్రీ లింగంగుంట సుబ్బారావు విలువిద్యా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆహతులను మంత్రముగ్ధులను చేసింది. మధ్యలో కాసేపు ప్రముఖ గాయనీ గాయకులు రెనినా, దినకర్, గంట హరి పాడిన మధుర గీతాలు అందరినీ అలరించాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉమ పుటాని ఆధ్వర్యంలో దాదాపు 32 మంది చిన్నారులు ఒక జట్టుగా, కలసికట్టుగా ప్రదర్శించిన ఉగాది పండుగ ప్రత్యేక నృత్యరూపకం ఆహుతులకు ఆద్యంతం వినోదం పంచింది. మిమిక్రీ కళాకారుడు సిల్విస్టర్ తనదైన శైలితో ప్రదర్శించిన హాస్య రసవత్తర సన్నివేశాల అనుకరణ కార్యక్రమం ఆహుతులకు నవ్వులను పంచింది. ఇలా సంగీతం, నృత్యం, హాస్యం మరెన్నో విభిన్నమైన వినూత్నంగా ఎంపిక చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహ్లాదంగా కొనసాగాయి.
అధ్యక్షులు సత్య చల్లపల్లి గారు ప్రసంగిస్తూ ఈ 45 ఏళ్ల టి.ఎల్.సి.ఏ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు సంస్థకు అందించిన సేవలను కొనియాడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖ తెలుగు సంస్థలు తానా, ఆటా, నాట్స్, టాటా ప్రతినిధులను వేదికపైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విచ్చేసిన వారిలో శ్రీ దశరథరామి రెడ్డి, మాజీ అధ్యక్షులు తానా, జయ్ తాళ్లూరి తానా, రాజేంద్ర జిన్నా ఆటా, మోహన్ కృష్ణ మన్నవ, అధ్యక్షులు నాట్స్, అశోక్ అట్టాడ నాటా, రంజీత్, ఫణిభూషణ్, టాటా నుండి పాల్గొని తమ ఉగాది సందేశాన్ని అందించారు. ఇంతమందిని ఒకే వేదిక పైకి చేర్చిన అధ్యక్షులు సత్య చల్లపల్లిని అందరూ కరతాళధ్వనులతో ప్రశంసించారు. వీరితో పాటు ఎస్‌బిఐ, ఎఐఆర్, ఇండియా న్యూయార్క్ అధికారులు తమ ఉగాది శుభాకాంక్షలు అందించారు.
తదనంతర కార్యక్రమంలో ముఖ్యయ అతిధిగా విచ్చేసిన యువ సినీ నటుడు నిఖిల్, అందాలనటి మధుశాలిని, నటి సన, గాయనీ గాయకులు రెనినా, దినకర్, గంట హరి, మిమిక్రీ కళాకారుడు సిల్విస్టర్‌ను టిఎల్‌సిఎ బోర్డ్ ట్రస్టీ అధ్యక్షులు పోలవరపు రాఘవరావు, ఈ ఉగాది కార్యక్రమ నిర్వహణకు సహకారం అందించిన టిఎల్‌సిఎ బోర్డ్ ట్రస్టీ సభ్యులు కృష్ణారెడ్డి గుజవర్తి దంపతులు, మరియు టిఎల్‌సిఎ బోర్డ్ ట్రస్టీ సభ్యులు మోహన్ బాదే దంపతులు, సంఘసేవకుడు ఐ.వి. రెడ్డి జ్ఞాపికలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ నటుడు నిఖిల్, మధుశాలిని, నటి సన టిఎల్‌సిఎ బోర్డ్ ట్రస్టీ ముఖ్య సభ్యులకు, దాతలకు జ్ఞాపికలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఉగాది ప్రత్యేక సంచిక 2016 తెలుగు వెలుగు సావనీర్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరింప జేసి ఆహుతులకు ప్రతులను అందించారు. అధ్యక్షులు సత్య చల్లపల్లి ప్రసంగిస్తూ ప్రకటనకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసి సావనీర్ ప్రచురణ భాద్యతలు నిర్వహించిన హరిశంకర్, తాపీ ధర్మరావు, శ్రీనివాస్ గూడూరు అశోక్ చింతకుంట టీమ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మద్దిపట్ల ఫౌండేషన్ వారు ప్రకటించిన ఉగాది ప్రత్యేక బహుమతులు 32, 40 టీవీ లు విజేతలకు అందించారు. అలాగే సుధా మన్నవ, శైలజ చల్లపల్లి, వితరణతో విచ్చేసిన ప్రతి కుటుంబానికి ఉగాది బహుమతి అందజేసారు.
అధ్యక్షులు సత్య చల్లపల్లి చివరగా వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో అండగానిలచిన సంస్థ కార్యవర్గం, మరియు తోటి సహచార సభ్యుల కృషిని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాల ఎంపికకు కృషిచేసిన ఉపకోశాధికారి జయప్రకాశ్ ఇంజూపురి, కీలకమైన ఈవెంట్ ప్లానింగ్ నిర్వహించిన ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గూడూరు, కార్యక్రమాల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించిన కోశాధికారి అకోక్ చింతకుంట, ప్రచార బాధ్యతలు నిర్వహించిన హరిశంకర్ రసపుత్ర, సహాయ కార్యదర్శి బాబు కుదరవల్లి, టి.ఎల్.సి.ఏ కార్యవర్గ సభ్యులు జ్యోతి జాస్తి, శిరీష తునుగుంట్ల, ప్రసాద్ కోయి. ఉమారెడ్డిలకు టి.ఎల్.సి.ఏ అధ్యక్షులు సత్య చల్లపల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.