విజయగర్జనకు మళ్లీ బ్రేక్... ఇక ఇప్పట్లో లేనట్లే
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతల పెట్టిన విజయ గర్జన సభ మరోసారి వాయిదా పడింది. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగ్‌రోడ్డు పక్కన ఈ నెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీక్షాదివస్ (నవంబర్ 29)న తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కేసీఆర్ సూచించారు. వారి వినతి మేరకు నవంబర్ 29న నిర్వహించాలని నిర్ణయించారు. ఓ వైపు సభ కోసం ఏర్పాట్లు చకచకా కొనసాగుతుండగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌తో మరోసారి టీఆర్‌ఎస్ సభ వాయిదా పడింది. డిసెంబర్ 14 వరకు ఎన్నికల కోడ్ ఉండనుండగా, పదిహేను లక్షల మంది హాజరయ్యే సభకు జనసమీకరణ చేయాలంటే ఓ నెలరోజుల వ్యవధి అవసరం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మాసంలో లేదా ఏప్రిల్ 27న పార్టీ బర్త్‌డేను పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది. సభా వాయిదాపై నిర్ణయం తీసుకున్నందున ఎపుడు నిర్వహించాలనే అంశంపై ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.