వ్యూహాత్మకంగా ట్రంప్ ప్రసంగం
హ్యూస్టన్‌లో జరిగిన హోడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఓవైపు మోదీని ప్రశంసిస్తూనే మరోవైపు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిన అవశ్యకతను తెలియజేశారు.
భారత సంతతి అమెరికన్లు ఈ దేశ ప్రగతికి విశేషంగా కషి చేస్తున్నారని, తమ హయాంలో అమెరికాలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో నిరుద్యోగం తగ్గిందని, అక్రమ వలసలను అరికట్టామని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారతదేశానికి నరేంద్ర మోదీ రెండోసారి నాయకత్వం వహించి దేశాన్ని సమగ్ర దిశలో తీసుకువెళ్లుతున్నారని కొనియాడారు అక్రమ వలసదారులను అనుమతించేది లేదని అయితే చట్టబద్ధంగా ఇక్కడికి వచ్చే వారికి అమెరికా ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా ఉద్యోగాలు పొందే వారికి సరైన అవకాశాలు ఉండనే ఉంటాయని తెలిపారు. భారత్, అమెరికా స్వప్నాలు సాకారం చేసేందుకు కషి చేస్తున్న మోడీకి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఏడాదిలో కోటి 40లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని, ఒహియో రాష్ట్రంలో భారత్‌కు చెందిన జెఎస్‌డబ్లు కంపెనీ ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందని, తద్వారా ఎన్నడూ లేనంతగా భారత్ అమెరికాలో పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.