ASBL Koncept Ambience

మోదీ కార్యక్రమానికి ట్రంప్ రావడం పెద్ద విషయమే

మోదీ కార్యక్రమానికి ట్రంప్ రావడం పెద్ద విషయమే

హ్యూస్టన్‌లో జరిగే హోదీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రావడంపై పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో విదేశీ వ్యవహారాలలో భారత్‌, దక్షిణాసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన నిషా బిస్వాల్‌ మాట్లాడుతూ, ఇది అమెరికాలో భారతీయ అమెరికన్‌ సమాజ ప్రాముఖ్యతను చూపుతోందని అన్నారు. ట్రంప్‌ ఈ సభకు వెళ్లాలనుకోవడం గొప్ప పరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ, ట్రంప్‌ మధ్య బంధం ఇప్పుడు వ్యక్తిగత, రాజకీయాల స్థాయి దాటి ముందుకెళ్లిందని నిషా అన్నారు.

'హౌడీ మోదీ' ఈవెంట్‌ నిర్వాహకులు డెమొక్రటిక్‌ పార్టీ ప్రముఖులు స్టెనీ హోయర్‌ వంటివారు, పలువురు ఇతర కాంగ్రెస్‌ నేతలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను కూడా పిలిచి ఇది ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక వ్యవహారంలా మార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు హ్యూస్టన్‌ను వేదికగా చేసుకున్నారు. భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న నాలుగో అతిపెద్ద నగరం హ్యూస్టన్‌. అమెరికాతో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి భారత్‌కు ఇదో అవకాశం కూడా.

మరోవైపు గత ఏడాదిన్నర కాలంలో భారత్‌, అమెరికాల మధ్య పొడచూపిన వాణిజ్య విభేదాలను రూపుమాపుకొనేందుకూ ఈ సభ సహకరిస్తుందని.. ఉమ్మడి ప్రకటన ఏమైనా ఉండొచ్చనడానికి ఇది సంకేతమని అంచనా వేస్తున్నారు. 'ఒకవేళ అదే జరిగితే ట్రంప్‌ అది తాను సాధించిన విజయంగా చెప్పుకొంటారు' అని వాషింగ్టన్స్‌ బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న తాన్వి మదాన్‌ అన్నారు.

ఇక ట్రంప్‌ వైపు నుంచి చూస్తే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా అమెరికాలోని భారతీయులు వ్యవహరించేలా చేసుకునేందుకూ ఇది మార్గం వేస్తుంది. అనుకున్న దాని కంటే భారీగా సభకు హాజరవుతారని ట్రంప్‌ అంటున్నారు. అమెరికాలో భారతీయుల జనాభా 32 లక్షలు.. ఆ దేశ జనాభాలో భారతీయులు ఒక శాతం ఉన్నారు. అంతేకాదు.. అమెరికాలోని సంపన్న వర్గాల్లో భారతీయులూ ఒకరు.

అమెరికాలోని భారతీయుల్లో అత్యధికులు డెమొక్రటిక్‌ పార్టీ సానుభూతిపరులు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికులు హిల్లరీ క్లింటన్‌కు ఓటేశారని 'ఆసియన్‌ అమెరికన్‌ లీగల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌' చెబుతోంది. మోదీ జాతీయవాద దక్పథం, భారతదేశాన్ని ప్రపంచదేశాల మధ్య సగర్వంగా నిలపుతానంటూ ఆయన చేసే ప్రతిజ్ఞల కారణంగా అమెరికాలోని భారతీయుల్లో ఆయనకు విశేషాదరణ లభిస్తోంది.

 

Tags :