తెలంగాణలో టీటీఏ సేవాడేస్.. డిసెంబర్ 11 నుంచి 23 వరకు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాతృభూమికి సేవ చేయడానికి నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాలు ఈ సంవత్సరం డిసెంబరు 11 నుండి డిసెంబర్ 23, 2023 వరకు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా 5కె వాక్, వైద్య శిబిరాలు, విద్యా సదస్సులు, బిజినెస్ సెమినార్‌లు, యువజన కార్యక్రమాలు, పాఠశాలల అభివృద్ధి, వికలాంగులకు చేయూత వంటి కార్యక్రమాలను ఈ సేవాడేస్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, కో ఆర్డినేటర్ సురేశ్ రెడ్డి వెంకన్ననగరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
డిసెంబర్ 16న హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో హెల్త్ ఫర్ ఆల్ పేరుతో 5 కె వాక్, రన్ కార్యక్రమాన్ని టిటిఎ వైభవంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విశ్వగురు రామాచారి, వైబ్రెంట్ హోస్ట్ శ్యామల తదితరులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాకేత్ కొమండూరి, మధు ప్రియ, రమ్య బెహరా, సోనీ కొమండూరి, రాగం షాలిని, రాజు, కార్తీక్ అవసరాల, వాగ్దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాటలను పాడనున్నారు. పరంపర బృందంచే శాస్త్రీయ నృత్యాలు, మిమిక్రీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ప్రదర్శనలు, పాశ్చాత్య మరియు జానపద నృత్యాలు, జానపద సంబరాలు వంటివి ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో ఉంటాయి.
ఈ వేడుకలు టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట నేతృత్వంలో జరగనున్నాయి. ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి, ట్రెజరర్ సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. దివాకర్ జంధ్యం, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్లా, జాయింట్ ట్రెజరర్ మనోహర్ బోద్కె, నేషనల్ కో ఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనరపు తదితరులు ఈ కార్యక్రమాల విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.