ఘనంగా ముగిసిన టిటిఎ గ్రాండ్ ఫినాలే
తెలుగు రాష్ట్రాల్లో సేవాడేస్ పేరుతో 2వారాలకుపైగా సేవలందించి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చివరిరోజు వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పెద్దఎత్తున నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రప్రభుత్వంలో డిఫెన్స్ అడ్వయిజర్‌గా ఉన్న డిఆర్‌డిఓ మాజీ చీఫ్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో సైంటిస్ట్ శ్రీమతి ఉమాదేవి తదితరులు ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. టిటిఎ ఫౌండర్ డా. పైళ్ళ మల్లారెడ్డి, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, టిటిఎ సేవా డేస్ బృందం, ఇతర టిటిఎ నాయకులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిఎ ప్రెసిడెంట్ వంశీరెడ్డి మాట్లాడుతూ, టిటిఎ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు.
ఫౌండర్, పారిశ్రామికవేత్త పైళ్ళ మల్లారెడ్డి మాట్లాడుతూ, అమెరికాలో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేయడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి తమవంతుగా టిటిఎ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్య అతిధి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తి కాబోతున్నాయని, ఆ సమయానికి దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ పక్కా ప్రణాళికతో సాగుతున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను ప్రదర్శించారు. మధుప్రియ, పరంపర వాళ్ళ బృందం డ్యాన్స్‌లు, ఇమిటేషన్ రాజు మిమిక్రీ, బోనాల జాతర వంటి కార్యక్రమాలను ప్రదర్శించారు. చివరన విశ్వగురు రామాచారి బృందం చే సంగీత విభావరి జరిగింది.
ప్రెసిడెంట్ ఎలక్ట్ ఎం.నవీన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు డా. నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి, కోశాధికారి పెద్దిరెడ్డి, ఇండియా కో-ఆర్డినేటర్ డా. ద్వారకానాధ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.