ఆటా వేడుకల్లో ఘనంగా జరిగిన టీటీడి కళ్యాణం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా నిర్వహించారు. తితిదే వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కార్యవర్గ సభ్యులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూలను అందజేశారు.
ఆటా వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యాయి. త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి అవధానం అలరించింది. రావు తల్లాప్రగడ, తనికెళ్ల భరణి, కూచిభొట్ల ఆనంద్, తుమ్మలపల్లి వాణీకుమారి, రెజీనా, వేముల లెనిన్, కొల్లారపు ప్రకాశరావు, రవి, మాధురి చింతపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలో తొలిసారిగా సమగ్ర శతావధాన కార్యక్రమాన్ని సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని కూచిభొట్ల ఆనంద్ పేర్కొన్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వద్దిపర్తిని సత్కరించారు. సయ్యంది పాదం కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆరోగ్య సేవా కార్యక్రమాలపై ఆటాలో కార్యక్రమం 17వ ఆటా మహాసభల్లో నిర్వహించిన ఆరోగ్య కార్యక్రమాన్ని అపోలో వైస్ చైర్ పర్సన్ కామినేని ఉపాసన తన ప్రసంగంతో ప్రారంభించారు. జన్మభూమి అభివృద్ధిలో, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎన్నారైలు భాగస్వామ్యులు కావాలని కోరారు.
అలరించిన సద్గురు ప్రసంగం
ఆటాలో ముఖ్య కార్యక్రమాల్లో ఒకటైన సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రసంగం అందరినీ ఎంతగానో అలరించింది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే నష్టాలను నిర్వహించడానికి మట్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటా ఆధ్వర్యంలో డీసీలో ప్రవాస తెలుగువారితో కలిసే అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Click here for Srinivasa Kalyanam PhotoGallery
Click here for Day 3 Event Gallery