ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తే మంచిది...పోలా భాస్కర్
పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం(ఎస్‌వి టెంపుల్)లో సెప్టెంబర్ 29 నుంచి 2 రోజులపాటు జరగనున్న ఆగమ సదస్సు నేడు వైభవంగా ప్రారంభమైంది. పిట్స్‌బర్గ్ ఆలయ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ విజయ శేఖర్ రెడ్డి లాంఛనంగా సదస్సును ప్రారంభించారు. టీటీడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి పోలా భాస్కర్, ఐఎఎస్, డిప్యూటీ ఇఓ శ్రీమతి గౌతమి, టీటీడి పండితులు శ్రీనివాసాచార్యులు, పురుషోత్తమాచార్యులు వేదికపై ఆసీనులయ్యారు. ఎస్‌వి టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ సుబ్బారెడ్డి, శ్రీను శ్రీనివాసన్ కూడా వేదికపై కూర్చున్నవారిలో ఉన్నారు. వేద ఆశీర్వచనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 15 దేవాలయాలు, రిజిష్టర్డ్ చేసుకున్న 25 మంది ఈ సదస్సుకు వచ్చారు. ఎస్‌వి టెంపుల్ ప్రధాన పూజారి వెంకటాచారి పిట్స్‌బర్గ్ టెంపుల్ గురించి వివరించారు. శ్రీమతి గౌతమి మాట్లాడుతూ, ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యాలను, రెండురోజులపాటు జరగనున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.
పోలా భాస్కర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడి ద్వారా ప్రపంచంలోని హిందూ దేవాలయాలకు ఆగమశాస్త్ర విషయంలో సూచనలు, సలహాలు, శిక్షణను ఇవ్వాల్సిందిగా ఆదేశించారని, అందుకు అనుగుణంగా టీటీడి ఇఓ అనిల్‌కుమార్ కూడా ఇలాంటి సదస్సులను వివిధ చోట్ల ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఆగమశాస్త్రం ప్రకారం ఏమేమి జరగాలి, ఎలా జరగాలి అన్న విషయాలను చెబుతున్నాము. ఏ దేవాలయం ఏ ఏ విషయాలు ఎంతవరకు చేస్తున్నారో చూసుకుని, వీలుని బట్టి వీటిని అనుసరించాలని కోరారు. తిరుపతిలోనే ఆగమశాస్త్ర నిర్వహణలో తేడాలు ఉన్నాయి. టీటీడి కేవలం సూచనలు మాత్రమే ఇస్తుంది. ఆయా దేవాలయాలు వారి వారి స్థాయి, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆగమశాస్త్రాన్ని అనుసరించవచ్చని చెప్పారు. టీటీడి గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. హిందూ దేవాలయాలను ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తున్నారని, పూజలు ఇతర కార్యక్రమాలను కూడా ఆగమశాస్త్రం ప్రకారం చేయడమే మంచిదన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులతోపాటు ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా పాల్గొన్నారు.