జన్మభూమి కోసం ఉప్పుటూరి రామ్‌చౌదరి రూ.25 లక్షల విరాళం
అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మభూమి కార్యక్రమం కోసం ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి రూ.25 లక్షల విరాళం అందజేశారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన రామ్‌చౌదరి షికాగోలో చంద్రబాబును కలిశారు. షికాగోలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉప్పటూరి చినరాములు సేవా ఫౌండేషన్ తరపున 2011 నుంచి మండలంలోని 17 గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.20 లక్షల విలువైన సిమ్మెంట్ బస్తాలను లబ్దిదారులకు అందజేసినట్లు వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు, టార్టాయిస్‌లు, దోమతెరలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడికి చర్యలు తీసుకోవడంతో పాటు మంచినీటి కూలర్లను కూడా అందించినట్లు తెలిపారు.