ASBL Koncept Ambience

తెలంగాణలో తెలుగు మనుగడకి ఇక ధోకా లేదు - వంగూరి చిట్టెన్ రాజు

తెలంగాణలో తెలుగు మనుగడకి ఇక ధోకా లేదు - వంగూరి చిట్టెన్ రాజు

ప్రపంచ తెలుగు మహాసభలపై వంగూరి చిట్టెన్ రాజు వ్యాఖ్యానం…డిశంబర్ 15...తెలుగు భాషా, సాహిత్య చరిత్రలో ఒక మైలు రాయి అనీ, బహుశా కనీసం తెలంగాణా లో కవులకి, రచయితలకి, సాహితీవేత్తలకి ఖచ్చితంగా ప్రాధాన్యత పెరిగి తీరుతుంది అని నాకు అనిపించింది.

ఇవాళ సాయంత్రం జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవాలకి నేను 4 గంటలకే అక్కడికి వెళ్లి ముందు వరసలో చతికిల పడ్డాను కాబట్టి ఎక్కడో దూరం నుంచి కాకుండా మొదటి వరసలోనే కూచుని ఆనందించే అపురూపమైన అవకాశం నాకు కలిగింది. ఆ ప్రాంగణం పేరు “అత్యంత ముఖ్యులు, పద్మ గ్రహీతలు, నాయకులు”..వీరి కోసం కేటాయించబడింది. మంత్రివర్గానికి వేరే ప్రాంగణం ఉన్నా తెలంగాణా పరిశ్రమలు & IT మంత్రి KTR నాకు పది సీట్ల అవతలే కూచున్నారు. ఇతర ప్రముఖులలో నాకు తెలిసిన అవధాని నాగఫణి శర్మ గారు, కొలకలూరి ఇనాక్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి, నటుడు బాబూ మోహన్..ఇలా ఎందరెందరో.....

ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా, తదితర దేశాల నుంచి వచ్చిన రచయితలు, ప్రముఖులకోసం ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేశారు అని తెలుసు కానీ....ఆ గందర గోళం లో వాళ్లందరూ ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఈ ప్రముఖుల ప్రాంగణం లో నేనొక్కడినే అమెరికా వాడిని. పైగా నాకు నమోదు సంచీ కూడా అందలేదు..అంచేత అందులో ఉండే badge కానీ, కార్యక్రమ కరదీపిక కానీ నా దగ్గర ఏమీ లేవు. రేపటికైనా వస్తాయో లేదో తెలియదు...ఏదో తొండి చేసి లోపలకి దూరిపోయాను....ఎంతయినా ఆహ్వానిత అతిథిని కదా!

ఇవన్నీ ఎలా ఉన్నా ...పాల్కురికి సోమన ప్రాగణం లో బమ్మెర పోతన వేదిక మీద జరిగిన ఈ ప్రధాన వేదిక మీద ప్రారంభ సభ సమర్థవంతంగా నిర్వహించిన ఒక పెద్దాయన (పేరు తెలియదు)...జరగబోయే కార్యక్రమాలు వివరిస్తూ...విదేశీ ప్రతినిధుల గోష్టిలో నారాయణ స్వామి వెంకటయోగి అధ్యక్షులు, కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథి, అమెరికా నుంచి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు గౌరవ అతిథిగా వ్యవహరిస్తారు అని సుమారు 40 వేల మంది సభలో ప్రకటించగానే భలే భయం వేసింది. ఇక మిత్రులు కె.వి. రమణాచారి గారు ప్రధాన సభా నిర్వాహకులు.

అన్నింటికన్నా ముందుగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తన చిన్న నాటి తెలుగు పంతులు గారైన మృత్యుంజయ శర్మ గారికి సత్కరించి గురు వందనం తో సభ ప్రారంభించడం ఎంతో హృద్యంగా ఉంది. ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానీ మా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రపంచ సాహితీ సదస్సులు అన్నీ తెలుగు ఉపాధ్యాయుల సత్కారంతోనే ప్రారంభం అవుతాయి.

మిగతా ప్రసంగాలు అన్నీ ఎలా ఉన్నా..కేసీఆర్ ప్రసంగం మటుకు ప్రసంగం కాదు. వ్యక్తిగత తపన. తెలుగు భాష మీద రాజకీయ పరంగా కాక , కేవలం ఒక భాషాభిమానిగా, సాహిత్యాభిమానిగా ఒక వ్యక్తిగా....తన చిన్న నాటి అనుభవాలని ఏకరువు పెడుతూ, తెలుగు భాష, తెలుగు పద్యం తనని ఎలా తీర్చిదిద్దాయో కృతజ్ఞతా పూర్వకంగా నెమరు వేసుకుంటూ, అటు వేమన, సుమతి, పోతన పద్యాలని అలవోకగా ఉటంకిస్తూ సాగిన కేసీఆర్ ప్రసంగం నిజంగా ప్రశంసనీయం.

కనీసం తెలంగాణలో తెలుగు మనుగడకి ఇక ధోకా లేదు అనే అభిప్రాయం నాకు కలిగింది. ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు, తెలంగాణా గవర్నర్ నరసింహన్ గార్ల ప్రసంగాలు చాలా సార్లే విన్నాను. ఇంకా వింటూనే ఉంటాను....ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నాయకులు భాషాసాహిత్యాల విషయంలో చిలక పలుకులు చాలానే పలుకుతారు...కేసీఆర్ చేతలలో చూపిస్తున్నారు....తెలంగాణా ప్రాముఖ్యత చాటిచెప్పడం కోసం...తెలంగాణా లో తెలుగు చరిత్ర కి తగిన గుర్తింపు కోసం....

తెలుగు నాణానికి ఇప్పుడు ఒక వేపు కాస్త మెరుపు పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండో వేపు మసి బారిపోయి ఉంది. రెండు వేపులా పూర్తి నగిషీ పెడితేనే అది తళతళ లాడుతూ ఉంటుంది... ఏమంటారు?

 

Tags :