అమరావతి నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది : వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమరావతి శంకుస్ధాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం విజయదశమి రోజున జరగడం శుభసూచకం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రావడం ఎంతైన ఆనందకర విషయమని తెలిపారు. అమరావతికి మద్దతుగా ప్రధాని మోడీ పార్లమెంటు నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు సేకరించి తెచ్చినట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన అమరావతి ఆంధ్రులకు నూతన రాజధానిగా రూపుదిద్దుకోవడం శుభపరిణామని అన్నారు. విభజన సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. అందరి మద్దతుతో రూపుదిద్దుకుంటున్న అమరావతి నగరం ప్రపంచ పటంలో అజరామరంగా వెలుగొందుతుందని ఆకాంక్షించారు.
అమరావతి వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా మెలగి ఒకరికొకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వైపు చూస్తున్నాయని అన్నారు. అమరావతి దేశంలోనే అపురూపంగా దిద్దుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ పరిపాలనలో భారతదేశం ప్రపంచ శక్తి రూపుదిద్దుకుంటోదన్నారు. మోడీ ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.