ASBL Koncept Ambience

భాష, సంస్కృతికి తానా చేస్తున్న కృషి అభినందనీయం - వెంకయ్యనాయుడు

భాష, సంస్కృతికి తానా చేస్తున్న కృషి అభినందనీయం - వెంకయ్యనాయుడు

తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) చేస్తున్న కృషి అభినందనీయమని అంటూ భాష, సంస్కృతులు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయని.. వీటికి విడదీసి చూడలేమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల’ను ఆన్‍లైన్‍ ద్వారా శుక్రవారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలనడం కంటే.. ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక తిరునాళ్లు’ అనడం సముచితంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. చిన్నప్పుడు ఊళ్లలో జరిగే తిరునాళ్లతో మన సంస్కృతిని తెలుసుకునే అవకాశముండేదని.. అదే రీతిలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం.. భవిష్యత్‍ తరాలు తెలుగుభాష, సంస్కృతి ప్రాశస్త్యాన్ని తెలుసుకుని, వీటిని నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి కాబట్టి ఈ ఉత్సవాలను తిరునాళ్లు అంటే బాగుంటుందన్నారు.

భాష, సంస్కృతుల అభివృద్ధికి తానాతో సహా పలు తెలుగు సంఘాలు కలిసి చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 8 అంశాల్లో 23 రకాల పోటీలు (సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం) నిర్వహించటం, మన సంస్కృతిని ప్రతిబింబించేలా వాటికి పేర్లు పెట్టడం చాలా చక్కని ఆలోచనన్నారు. రాష్ట్రం, దేశం అనే తేడా లేకుండా ఎల్లలు దాటి తెలుగు వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న అనేక తెలుగు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన పరిణామమని ఉపరాష్ట్రపతి అన్నారు. కరోనా నేపథ్యంలో  ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని.. సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దైనందిన జీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని, తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఈ ఇబ్బందితో ఆందోళన చెందవద్దని.. కరోనా సమస్యను  అధిగమించవచ్చని ఆయన సూచించారు. మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణే భాష. వివిధ చారిత్రక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వల్ల వ్యక్తీకరణ అనేక రకాలుగా జరుగుతుంది. భాషలో కేవలం వ్యక్తీకరణే గాక, మన సంస్కృతి కూడా దాగి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి తల్లిభాషను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు, తర్వాతి తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు.

మన భాష అంటే మాట్లాడే నాలుగు మాటలు మాత్రమే కాదని.. మన సంస్కృతిని నింపుకున్న మాతృభాష ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలన్నారు. ‘వ్యక్తిని మోక్షం దిశగా నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గం మతం. ఆ లక్ష్యం దిశగా మనిషిని ముందుకు తీసుకు వెళ్ళే జీవన విధానానికి సాధనంగా నిలిచే ఆచరణాత్మక మార్గదర్శి సంస్కృతి. భాష.. ఈ సంస్కృతిలోని అంతర్భాగం. అందుకే భాషను, సంస్కృతిని విడదీసి చూడలేము’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి నాగరికత గొప్పదనం వారి భాష ద్వారానే వ్యక్తమవుతుందన్న ఉపరాష్ట్రపతి.. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, సాహిత్యం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార లావాదేవీలన్నీ భాష లేకుండా  పెంపొందలేవన్నారు. ‘భాష సమాజాన్ని సృష్టించి.. జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి మార్గం వేస్తుంది’ అని ఆయన తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని.. దీనికోసం ముందుగా తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్‍ గురించి ఆలోచించాలన్నారు. ‘ఇతర భాషలు నేర్చుకోవడం, ప్రావిణ్యత సాధించడం తప్పు కాదు. ఎవరైనా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఆ విషయంలో ఆకాశమే హద్దు. కానీ మాతృభాషను, మాతృమూర్తిని మరచిపోకూడదు. అందుకే భాషాభివృద్ధి కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత, అన్నింటికీ మించి ఎవరికి వారే అమ్మ లాంటి మాతృభాష కోసం ముందుకు కదిలి కాపాడుకోవలసిన బాధ్యత’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.

అంతకుముందు తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి తొలుత అందరికీ స్వాగతం పలికి తానా తెలుగు భాషకు చేస్తున్న సేవను, కృషిని, ఇతర కార్యక్రమాలను వివరించారు  "తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం, తెలుగు  వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం కోసం ఈ సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నాం. 390 బేబీనార్లలో, 450 జడ్జిలతో, 550 వాలంటీర్లతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 18 వేల మూడు వందల మంది పోటీలలో పాల్గొంటున్నారు. సౌందర్య లహరి, తెలుగు వెలుగు,రాగమంజరి, నాదామృతం, అందెల రవళి, కళాకృతి, రంగస్థలం, భువన విజయం, వంటి 8 విభాగాల్లో పోటీ పడుతూ  ప్రతిభాపాటవాలను ప్రదర్శించబోతున్నారు.  1993 లో అమెరికాలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాము. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరనూ  కలుసుకొనే  అదృష్టం అంతర్జాలం ద్వారా  మాకు కలిగింది. ఈ ఉత్సవం ద్వారా వచ్చిన డబ్బు కు రెట్టింపు డబ్బు చేర్చి చేనేత కార్మికుల కు ఆశు మిషన్లు అందిస్తాము.  అమెరికాలోని ప్రవాసాంధ్రుల పిల్లల కోసం  "పాఠశాల"ను నిర్వహిస్తున్నాము. ఇదే పాఠశాల వ్యవస్టను  ప్రపంచవ్యాప్తంగా విస్తరిం పజేయబోతున్నాము.  అలాగే అమెరికాలో ప్రవాసాంధ్రులకు ఏ ప్రమాదం కలిగినా, మరణాలు సంభవించినా  ఆదుకోవడానికి సేవలందించడానికి  " తానా టీమ్ స్క్వేర్" సేవలందిస్తుంది. ఈ సేవలను కూడా  ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నాము.   ప్రపంచంలోని తెలుగు కవులను, కళాకారులను ప్రోత్సహించేందుకు "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ను ఏర్పాటు చేశాము. మన బలం తెలుగు మన కులం తెలుగు" అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం కోసం అహొరాత్రులు  కృషిచేసిన శిరీష తూనుగుంట్ల, భార్గవ్  శ్రీనివాస్ రెడ్డి గార్ల ను అభినందించారు. టీవీ9, సాంకేతిక సహకారం అందించిన. బైట్ గ్రాఫ్ వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా ఓడినా అది నిమిత్తమాత్రమే. చివరికి గెలిచేది  తెలుగు భాష. నిలిచేది  తెలుగు సంస్కృతి" అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు సీఎం రమేశ్‍, గల్లా జయదేవ్‍, లావు కృష్ణదేవరాయ..  తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‍, అధికార భాషాసంఘం చైర్మన్‍ డాక్టర్‍ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‍, ఆంధప్రదేశ్‍ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‍, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‍ శ్రీనివాస్‍ రావుగారితోపాటు పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. తానా నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Tags :