తానా మహాసభలకు ఉపరాష్ట్రపతి రాక- సతీష్ వేమన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వాషింగ్టన్ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న 22వ తానా మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులను ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. జులై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా మహాసభల ఏర్పాట్లను ఆయన వివరిస్తూ, తానా సభలకు రావాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందజేశామని తెలిపారు.
అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచం నలుమూలల నుండి ఈ మహాసభలకు దాదాపు 20000కు పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, చైతన్యస్రవంతి కార్యక్రమాలను, తానా భవన్ నిర్మాణం వంటి విషయాలను ఆయన పత్రికా ప్రతినిధులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమన సతీష్‌తో పాటు తానా ప్రతినిధులు రవి మందలపు, భక్తభల్లా, శివ పోలవరపు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్‌మీట్‌కు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో సతీష్ వేమన తదితరులు మాట్లాడారు.
తానా మహాసభలకు ఇండియా కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న ప్రసాద్ గారపాటి, సుబ్బారావు చెన్నూరి తదితరులు కూడా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, మహాసభల వివరాలను తెలియజేశారు.