తానాలో శ్రీ కృష్ణ రాయబారం... మంత్రముగ్దుల్ని చేసిన వర్జీనియా మనబడి పిల్లలు
శ్రీ కృష్ణుడు పాండవులకు మరియు కౌరవులకు సంధి ఒనర్చుటకు పాండవ రాయబారిగా హస్తినకు వెళ్ళు ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టమును ఇటీవల జరిగిన తానా మహాసభల్లో వర్జీనియాకు చెందిన మనబడి పిల్లలు అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నాటకానికి కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వం వహించారు. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు వర్జీనియాలో మనబడి ద్వారా తెలుగు నేర్చుకుని, తెలుగు మాటే కాదు, పాట, పద్యముతో పాటు నాటకాన్ని కూడా అత్యద్భుతంగా 2023 తానా మహా సభలలో ముఖ్య వేదిక పై ప్రదర్శన చేసి, ప్రేక్షకులను అలరించి మన్ననలను పొందారు.
తెలుగు వారికే సొంతము అయినదియు, మరుగున పడుతున్న ఈ పద్య నాటక కళను చూసి, ప్రోత్సహించండి - ఈ చిన్నారులను దీవించండి. ఈ పద్య నాటకాన్ని చూసి మా లాగానే మీరు కూడా మైమరుస్తారని ఒక చిన్న ఆశ అని నిర్వాహకుల వినతికి మంచి స్పందనే కనిపించింది. కృష్ణుడిగా సాయి శరణ్య భాగవతుల, ధర్మరాజుగా శ్రీకర్ కొవ్వాలి, భీముడిగా ఆదర్శ్ మెహెర్ ముండ్రాతి, ద్రౌపదిగా లాస్య భాగవతుల, అర్జునుడిగా వేద్ జూపల్లి, నకులుడిగా వైష్ణవి పరిమి, సహదేవుడిగా శ్రీహిత వెజ్జు వెంకట తమ తమ పాత్రల లో బహు చక్కని వాచకం మరియు అభినయం తో ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఈ పద్య నాటకాన్ని లైవ్ లో చూసిన ప్రతి చిన్న మరియు పెద్ద వారు ఈలలతో అరుపులతో పిల్లల పద్యాలను మరియు అభినయాన్ని కరతాళధ్వనులతో ప్రశంసించారు.
రంగస్థల కళ పై మక్కువ తో ఈ పిల్లలకు ఎంతో ఓపికతో నేర్పించి తద్వారా భావి తరాలకు అందించటానికి కృషి చేస్తున్న గురువు ‘‘కళారత్న’’ గుమ్మడి గోపాల కృష్ణకు మరియు వీరిని సంపూర్ణంగా ప్రోత్సహించిన డా. మూల్పూరి వెంకట్రావుకి అందరి తరఫు నుండి హృదయ పూర్వక ధన్యవాదాలు...చివరగా అందరిని సమన్వయ పరుచుకుని ఈ పద్య నాటకం ఇంత విజయవంతంగా ప్రదర్శించబడడానికి కారకులైన చాంట్లి మనబడి సెంటెర్ కో-ఆర్డినేటర్ రాజ్ కొవ్వాలికి మరియు వర్జీనియా మనబడి పిల్లలు తానా లో ప్రదర్శించిన శ్రీ కృష్ణ రాయబారం పద్య నాటకం: ఉప ప్లావ్యము ఘట్టము సంపూర్ణంగా ప్రోత్సహించిన సిలికానాంధ్ర మనబడి యాజమాన్యానికి ఆనంద్ కూచిబొట్లకు, రాజు చమర్తికి పిల్లల తల్లితండ్రులు, ఇతరులు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు.