కోకాపేటలో విజన్ సిటీ
హైదరాహాద్‌లో మరో సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేట హెచ్‌ఎండీఏ భూముల్లో 'విజన్ సిటీ' పేరుతో అత్యాధునిక నగరాన్ని నిర్మిస్తోంది. 118 నుంచి 150 అడుగుల విశాలమైన రోడ్లతో 146 ఎకరాల బాహుబలి లేఅవుట్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ఏర్పాటవుతోంది. వట్టినాగులపల్లి, ఖానాపూర్, కోకాపేట ప్రాంతాల్లో బయో కన్జర్వేషన్ జోన్‌లో గల భూములను కూడా మల్టీపర్పస్ జోన్‌లోకి మార్చేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట మినీ నగరాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగమే కోకాపేటలోని విజన్ సిటీ. కోకాపేటలో హెచ్‌ఎండీఏకు 533 ఎకరాలుండగా, ప్రస్తుతానికి 146 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిపకు ప్రణాళికలు రచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ అత్యాధునికమైన మౌలిక వసతులతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిపను ఐటీ, ఇతరతర ఆఫీసులకు ఆనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. నడిచి ఆఫీసుకు వెళ్లడం లక్ష్యంగా ఈ టౌన్‌షిప్ రూపకల్పన ఉంది.
విజన్ సిటీలోని 146 ఎకరాల లేఅవుట్‌లో స్థలాలన్నీ రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు ప్లాట్లు ఉంటాయి. వివిధ అవసరాల కోసం కొంత భూమిని ఖాళీగా ఉంచుతారు. మరికొంత పార్కులకు కేటాయిస్తారు. భారీ లేఅవుట్‌లో కేవలం 30 నుంచి 40 ప్లాట్లు వస్తాయని అంచనా. విక్రయించడానికి అనువైన స్థలాలను సెక్టార్-1, 2, 3లుగా విభజించారు. దసరా నాటికి ప్లాట్లకు హద్దు రాళ్లను నిర?యించి, రోడ్లను మట్టితో చదునుచేసి పెట్టనున్నారు. హద్దురాళ్లన్నీ పూర్తవ్వగానే విజన్ సిటీలోని స్థలాలను హెచ్‌ఎండీఏ అధికారులు ఈ-వేలం వేయనున్నారు. సెక్టార్-1లో 8 ప్లాట్లు, సెక్టార్-2లో నాలుగు ప్లాట్లు, సెక్టార్-3లో ఏడు ప్లాట్లు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. స్థలాల విక్రయాల ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందించిన్నట్లు తెలిసింది.
విజన్‌సిటీకి వెళ్లే ప్రధాన రోడ్లను వెడల్పు చేయడంతో పాటు కొత్తగా రోడ్లను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనలకు ఇటీవలే హెచ్‌ఎండీఏ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కోకాపేట, ఖానాపూర్, వట్టినాగులపల్లిలో గల 100 అడుగుల రోడ్లను 150 అడుగులకు విస్తరిస్తారు. ఖానాపూర్ గ్రామం ద్వారా వెళ్తూ ఓఆర్‌ఆర్, శంకర్‌పల్లి మెయిన్ రోడ్డు మధ్య కలిపే రోడ్డును 118 అడుగులకు విస్తరిస్తారు. కోకాపేట గ్రామ సరిహద్దు పొడవునా శంకర్‌పల్లి గ్రామంతో ఓఆర్‌ఆర్‌ను కలుపుతూ కొత్తగా 118 మీటర్ల రోడ్డును ప్రతిపాదించారు. కోకాపేటలోని వివిధ సర్వే నెంబర్లలో ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ ద్వారా నిర్థారించిన రోడ్లను తొలగించి ఇతర సర్వే నెంబర్లలో అనువుగా ఉండే విధంగా సరికొత్త రోడ్లను ప్రతిపాదించారు.
మూడు గ్రామాల పరిధిలో నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లను తొలగిస్తుండగా, తొమ్మిది రోడ్లను సరికొత్తగా కోకాపేట, ఖానాపూర్, వట్టినాగులపల్లిలో 118-150 అడుగుల మేర వెడల్పు ఉండేలా ప్రతిపాదనలు చేశారు. కోకాపేట, ఖానాపూర్, వట్టినాగులపల్లిలో ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ ద్వారా నిర్థారించిన 80, 100 అడుగుల రోడ్లను కూడా 118-150 అడుగుల రోడ్లుగా విస్తరిస్తున్నారు. కోకాపేటలో బయో బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోని భూములను బహుళ వినియోగ జోన్ కిందకు మార్పులు చేస్తున్నారు. కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లోని 234 ఎకరాలను బహుళ వినియోగ జోన్ కిందకు మార్పులు చేయడానికి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు చేసింది.