ASBL Koncept Ambience

జినోమ్‌ వ్యాలీలో వివింట్‌ ఫార్మా కంపెనీ పరిశ్రమ

జినోమ్‌ వ్యాలీలో వివింట్‌ ఫార్మా కంపెనీ పరిశ్రమ

సిఎం బృందంతో కంపెనీ ప్రతినిధుల సమావేశం

తెలంగాణలో పెట్టుబడులకు పేరొందిన కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పందాలను చేసుకుంది. వివింట్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్‌ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

ముఖ్యమంత్రి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు నేతృత్వంలో అధికారుల బృందంతో వివింట్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో వివింట్‌ కంపెనీ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం ఉంది. దాని విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్‌ ఫార్మా ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్‌ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

 

 

Tags :