దేశ రాజధానిలో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సదస్సు
తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి కై ప్రపంచ తెలుగు మహా సభలకు తెలుగు వారందరూ తరలిరావాలని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పిలుపునిచ్చారు.
డిసెంబర్ 15 నుంచి 19 వరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహా సభలకు విజయవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల పేరుతో దేశంలోని వివిద రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరిని ఏకంచేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి అధ్యక్షతన ఢిల్లీ తెలంగాణ భవన్ లో ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక సమావేశం జరిగింది. దేశ రాజధానిలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశాల్లో తెలుగు సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, మేధావులు, విద్యావంతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సన్నాహక సమావేశంలో భాగంగా ప్రపంచ తెలుగు మహా సభలను విజయవంతం చేసే దిశలో కరీంనగర్, రామగుండం మేయర్లు, తెలుగు సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పలు సూచనలు, సలహాలను సేకరించారు. తెలుగు భాష ఔనత్యం, భాషా పరిరక్షణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని మేధావులు స్వాగతించారు. ప్రపంచ నలుమూలల తెలుగు జాతి కీర్తిపతాకాలను ఎగురవేస్తున్న వారిని ప్రపంచ తెలుగు మహా సభల పేరుతో ప్రభుత్వం గౌరవించడం గొప్పవిషయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తెలుగుదనం, తెలుగు ప్రఖ్యాతి, ఔనత్యాన్ని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలతో తమవంతు సహకారాన్ని అందిస్తామని ఢిల్లీలోని తెలుగు సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా పలు విలువైన సూచనలు, సలహాలను ప్రశ్నోత్తరాల ద్వారా ఢిల్లీ లోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఢిల్లీలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి మీడియాతో మాట్లాడుతూ...విభిన్న భాషల మణిహారమైన భారత దేశంలో తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అమ్మలాంటి కమ్మనైన భాష తెలుగు భాష అని అన్నారు. తెలుగు లో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచిందన్నారు. తెలుగు భాష ప్రాశస్థ్యాన్ని విశ్వవాప్యం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృఢసంకల్పంతో కృషి చేస్తోందని ప్రత్యేక ప్రతినిధి స్పష్టం చేశారు. తెలంగాణ లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలుగు భాష పరిరక్షణకై ప్రభుత్వం చేస్తోన్న కృషి తోడుగా ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు భాష ప్రియులు, మేధావులు, భాషా పరిరక్షకులు ప్రపంచ తెలుగు మహా సభలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రత్యేకతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అతిథి మర్యాదలు చేస్తోందని, ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే ప్రతినిధులకు ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయాలు కల్పింస్తోందని ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి తెలిపారు. సన్నాహక సమావేశంలో భాగంగా ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యే ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమంలో పలువురు తెలుగు భాష ప్రేమకులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
అనంతరం కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ... సిక్కుగా పుట్లినా.. తాను నచ్చిన, మెచ్చిన భాష తెలుగు భాష అని అన్నారు. అమ్మ అనే పదం నాభి నుంచి వస్తోందని, అమ్మలాంటి కమ్మనైన భాష తెలుగు అని మేయర్ పేర్కొన్నారు. ఇలాంటి తెలుగు బాషా వైభవానికి కృషి చేస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి పరిఢవిల్లుతోన్న ఈ తరుణంలో తెలుగు భాష గొప్పతనాన్ని చాటాల్సిన అవసరం ఉందని మేయర అభిప్రాయపడ్డారు. కనీసం రోజులు ఒక్క గంట అయినా పిల్లలతో, కుటుంబ సభ్యులతో తెలుగులోనే ముచ్చటించాలని ఆయన సూచించారు.
అనంతరం రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.... ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన తెలుగు భాష కమ్మదనం వినిపిస్తోందని, తెలుగు ఖ్యాతి కనిపిస్తోందని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు, బొట్లు అన్ని మేళవింపుగా కన్పించే అందమైన రూపం తెలుగు అని మేయర్ వివరించారు. తెలుగు వారు గర్వపడేలా ప్రపంచ తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహా సభల నేపథ్యంలో హైదరాబాద్ ను తెలుగు భాష పుట్టినిల్లుగా ముస్తాబు చేస్తున్నారని మేయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
అనంతరం ఆంధ్ర భవన్ పరిపాలన అధికారి కె. లింగరాజు మాట్లాడుతూ... తెలుగు అక్షరమాలలో ప్రతి అక్షరానికి తియ్యదనం ఉందని అన్నారు. తెలుగు భాషకు భౌగోళిక సరిహద్దులు లేవని అన్నారు. తెలంగాణ లో పరిడవిల్లిన తెలుగు భాష సాహితి వెలుగుల్ని చాటి చెప్పాలన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఢిల్లీలోని వివిధ తెలుగు సంఘాలు , మేథావులు, విద్యావంతులు భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సన్నాహక కార్యక్రమంలో తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, సహాయక కమిషనర్ రామ్మోహన్, డా.సీత, కోటి రెడ్డి, పార్వతి రెడ్డి, ఆంధ్ర అసోసియేషన్ నుంచి సుబ్రమణ్యం, ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి చంద్రశేఖర్, తెలుగు వెల్పేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నుంచి సుశీల, నోయిడా తెలుగు సేవా సమితి నుంచి డా. చంద్ర శేఖర్, శీరిష తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి నరేశ్ కోడెం, వివేక్ రెడ్డి, శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ చంద్రశేఖర్, సమైక్య వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మురళీ కృష్ణ, ఆంధ్ర ఎడ్యూకేషన్ స్కూల్స్ నుంచి శ్రీమతి లక్ష్మీ, శైలెజా లు పాల్గొన్నారు.
జారీ చేసిన వారుః పౌర సంబంధాల అధికారి, తెలంగాణ రాష్ట్ర సమాచార కేంద్రం, న్యూఢిల్లీ.