అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
అమ్మ భాషను అందలమెక్కించాలి తెలుగు వెలుగును ప్రపంచానికి ఘనంగా చాటాలన్న సమున్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ సంబరం అంబరమంటింది. అతిథులు, ఆహ్వానితులతో పాల్కురికి సోమన ప్రాంగణం పులకరించింది. బమ్మెర పోతన వేదిక పరవశించింది. ఉప రాష్ట్రపతి, రెండు రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, కళాకారులు, జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, ఉపకులపతులు, ఉపాధ్యాయులు, పండిత, పామరులు, తెలంగాణలోని మారుమూల గ్రామం నుంచి దేశ విదేశాల ప్రతినిధులు హాజరైన ప్రారంభ వేడుక భాషాభిమానానికి ఎల్లలు లేవని సగర్వంగా చాటింది. తెలంగాణ ప్రభుత్వం, సాహిత్య అకాడమీల ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని లాల్‌బహదూర్ క్రీడామైదానంలో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.