ASBL Koncept Ambience

ప్రపంచ మహాసభల వేదిక పేర్లు ఖరారు

ప్రపంచ మహాసభల వేదిక పేర్లు ఖరారు

తెలంగాణలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ మహాసభలకోసం ఏర్పాటు చేసిన వేదికలకు ప్రముఖ కవుల పేర్లను పెట్టారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరగనున్న ఈ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియానికి బసవ పురాణం, పండితారాధ్య చరితము, శివతత్వం వంటి ద్విపద కావ్యాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన పాల్కురికి సోమన ప్రాంగణంగా నామకరణం చేశారు. ప్రధాన వేదికకు మహాకవి బమ్మెర పోతన పేరు పెట్టారు. అలాగే స్టేడియానికి నాలుగు వైపులా 8 ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ ద్వారాలకు వరుసగా తెలుగు సాహితీ మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి, సినారె, జాషువా, వేమన పేర్లు పెట్టారు. ఎల్బీ స్టేడియంలోని ఇండోర్‌ స్టేడియానికి మహాకవి శ్రీశ్రీ, వానమామలై వేదికలుగా నామకరణం చేశారు. రవీంద్రభారతిలో ఐసీసీఆర్‌ ఆర్గ్‌ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. దీనికి కాపు రాజయ్య, పీటీ రెడ్డి ఆర్ట్‌ గ్యాలరీలుగా నామకరణం చేశారు.

పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలిత కళాతోరణానికి చిందు ఎల్లమ్మ ప్రాంగణంగా, వేదికకు మిద్దె రాములు వేదికగా నామకరణం చేశారు. అలాగే బాలలు, మహిళల సాహిత్యానికి చర్చావేదిక అయిన ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియానికి యశోదారెడ్డి ద్వారం అని, ఒద్దిరాజు సోదరుల వేదిక అని పేరు పెట్టారు. తెలుగు వర్సిటీకి తెలంగాణ జానపద సాహిత్యంపైన, ముఖ్యంగా మౌఖిక సాహిత్యంపైన పరిశోధనలు చేసిన ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రాంగణం అని, వేదికకు సామల సదాశివ వేదిక అని నామకరణం చేశారు.

రవీంద్రభారతికి కాకతీయుల కాలంలో నృత్యరత్నావళి వంటి గొప్ప కావ్యాన్ని రాసిన జాయపసేనాని ప్రాంగణం అని, ప్రధాన వేదికకు నటరాజ రామకృష్ణ వేదిక అని నామకరణం చేశారు. రవీంద్రభారతి మినీహాల్‌కు ఇరివెంటి కృష్ణమూర్తి వేదికగా, దేవులపల్లి రామానుజరావు ప్రాంగణంగా పేర్లు పెట్టారు. తెలంగాణ సారస్వత పరిషత్‌కు మరిగంటి సింగనాచార్యుల ప్రాంగణంగా, శతావధాని కృష్ణమాచార్యుల వేదికగా నామకరణం చేశారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌కు అలిశెట్టి ప్రభాకర్‌ ప్రాంగణంగా, పేర్వారం జగన్నాథం వేదికగా పేర్లు పెట్టారు.

 

Tags :