యాదాద్రిలో ఉత్సవాలకు అంకురార్పణ
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా సువర్ణ మూర్తులను అధిష్టింప జేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వయంభువుల అనుమతి నిమిత్తం ఉదయం 9:35 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ ఈవో గీత ప్రధానాలయంలోకి వెళ్లారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామి వారికి అభిషేకానికి కాళేశ్వరం గోదావరి జలాలను వినియోగించారు. కాళేశ్వరం 15వ ప్యాకేజీలో నిర్మించిన ఆఫ్టేక్ 2 నుంచి గోదావరి జలాలు యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికారు. గోదావరి శుద్ధ జలాలను రాగి చెంబుతో తీసుకువచ్చి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.