అమెరికా రాజకీయాల్లో తెలుగువాళ్ళు కనిపించాలి- యార్లగడ్డ
అమెరికాలో పుట్టి ఇక్కడే స్థిరపడిపోయిన ఎంతోమంది తెలుగువాళ్ళు అన్నీ రంగాల్లో రాణించినట్లుగానే అమెరికా రాజకీయాల్లో కూడా రాణించేందుకు ముందుకురావాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. తానా మహాసభల ముగింపురోజున తానా - కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్, దర్శకుడు కే. రాఘవేంద్రరావు, ఎంపి మురళీమోహన్ ఆయనకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ ఉద్వేగంతో ప్రసంగించారు. మాతృభూమి రుణం తీర్చుకోవాలంటూ మాతృరాష్ట్ర ప్రభుత్వాలు కోరడం తప్పేమి కాదు. అదే సమయంలో ఇక్కడే పుట్టి పెరిగిన మనవాళ్ళు ఇప్పటికీ రెండవ శ్రేణి పౌరులుగానే ఉంటున్నారు. అలా కాకుండా ఇక్కడి రాజకీయాల్లో ఎదిగేందుకు తమ సంపదను, తెలివితేటలను ఉపయోగించాలని యార్లగడ్డ కోరారు. తన మనవరాలు తాను పుట్టిన ఆసుపత్రి చూపిస్తూ తాను అమెరికన్‌నని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు వారిని భారతీయులుగా మనం చెప్పడం సరికాదు. వారికి తెలుగు భాష, సంస్కృతీ సంప్రదాయాలను సమానంగా నేర్పిస్తూ అమెరికాపట్ల వారికి ఉన్న వాత్సల్యాన్ని గుర్తించి వారు ఇక్కడే ఎదిగేందుకు తోడ్పడాలన్నారు.
డొనాల్డ్ ట్రంప్, ఒబామా పూర్వీకులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని, వారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పడు, రాజకీయాన్ని బాగా వంటబట్టించుకున్న తెలుగువాళ్ళు ఎందుకు అధ్యక్షుడిగా ఎదగలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు. జయరామ్ కోమటి కమ్యూనిటీ నాయకునిగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందాలనుకున్నారు. కాని ఇక్కడే ఎందుకు కాంగ్రెస్ సెనెటర్‌గా ఎదిగేందుకు కృషి చేయడం లేదని, ఇలాంటి నాయకులు ఇక్కడి రాజకీయాల్లో అడుగుపెట్టాలని తాను కోరుతున్నానని చెప్పారు. తెలుగువాళ్ళయిన చివుకుల ఉపేంద్ర, అరుణ మిల్లర్‌తోపాటు, రాజా కృష్ణమూర్తి, సుబ్బారావు కొల్లా వంటి వాళ్ళు ఇక్కడి రాజకీయరంగంలో ముందంజ వేస్తున్నారని, వారిని చూసి ఇతరులు కూడా ప్రేరణ పొందాలన్నారు.
సెయింట్‌లూయిస్ నగరంలో ఎన్టీఆర్‌కు పునర్జన్మ ఇచ్చిన నగరమని, 1993లో ఎన్టీఆర్ ఇక్కడే 12 రోజులు ఉన్నారని, ఆయన జన్మదినంనాడు, ఆయనకు ఇష్టమైన నగరంలో తానా కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు.