అదోని బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని, ఉద్యోగులు కోరుతున్నట్లుగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, సకాలంలో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని, సర్వీసు, విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న వారికీ న్యాయం చేస్తూ, సమానపనికి సమాన వేతనాలు చెల్లిస్తామని, పెన్షనర్ల కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్ చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అదే విధంగా పోలీసు బాస్‌లకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని, పోలీసులకు వీక్ ఆఫ్ అమలు చేస్తామని, హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.
రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపైనా చిరు వ్యాపారం చేసుకుంటూ ఎందరో జీవిస్తున్నారని, అలాగే ఎందరో వృత్తిదారులు ఫుట్‌పాత్‌లను నమ్ముకుంటూ బతుకుతున్నారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. వారంతా పెట్టుబడిగా రూ.1000, రూ.2 వేలను కూడా రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీతో తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. అందుకే వారి కష్టాలు తీరుస్తూ, చేయూతనిచ్చే విధంగా వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తామని జననేత ప్రకటించారు.
కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
అదోనిలో సమస్యలు
అదోని నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, పట్టణంలో నాలుగు రోజులకోసారి నీరిస్తున్నారని, ఇక గ్రామాల్లో వారానికోసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. 5 ఏళ్లుగా పరిస్థితి ఇదీ అని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.
మహానేత–అదోని
ఇదే అదోనిలో గతంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను మహానేత వైయస్సార్ కట్టాడని, అదే విధంగా అదోనిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు చేపట్టి, మూడు బిట్లు పూర్తి చేయగా, మిగిలిన బిట్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
సౌకర్యాలు లేవు
అదోని రెవెన్యూ డివిజన్ అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని, ఉన్న ఒక ఎయిడెడ్ కళాశాలలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో పిల్లలకు చదువు ఎండమావిలా మారిందని చెప్పారు.
ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో 14 మంది వైద్యులకు బదులు, కేవలం 5గురు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు.
తుంగభద్ర లోలెవెల్ కాలువ
తుంగభద్ర లోలెవెల్ కాలువ ఆధునీకరణ కోసం రూ.175 కోట్లు కేటాయించిన మహానేత వైయస్సార్, అప్పట్లోనే రూ.75 కోట్ల పనులు పూర్తి చేయగా, ఆ మిగిలిన పనులను చంద్రబాబు చేపట్టలేదని చెప్పారు. దీంతో ఈ ఏడాది తుంగభద్రలో నీరున్నా రబీలో సాగు లేదని గుర్తు చేశారు.
మైనారిటీలకు ఈద్గా సమస్య ఉందని, అయినా దాన్ని పరిష్కరించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని ఆక్షేపించారు.
గుండ్రేవుల రిజర్వాయర్
తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే, 2.65 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, రెండు జిల్లాలలో 650 గ్రామాలకు మేలు జరుగుతుందని, ఇంకా లక్షల మందికి తాగు నీరివ్వొచ్చని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టును అస్సలు పట్టించుకోలేదని అన్నారు.
హామీ ఇచ్చినా..
2014, ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రకటించినా, ఈ 5 ఏళ్లు దాన్ని పట్టించుకోలేదని చెప్పారు.
కానీ, ఎన్నికలు రావడంతో గత నెల ఇక్కడికి వచ్చి ప్రాజెక్టు పనులకు టెంకాయ కొట్టాడని ఆక్షేపించారు.
దగా, వంచన
చంద్రబాబు ప్రతి అడుగులో మోసం, దగా, వంచన కనిపిస్తాయని, సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఎందుకు వెనుకాడుతాడని అన్నారు.
గిట్టుబాటు ధర లేదు
దేశంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువని, కానీ గత 5 ఏళ్లుగా ఆ ఉల్లికి ధర రాక, పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని చెప్పారు. ఇక్కడ కిలో ఉల్లికి కనీసం రూ.1.50 గిట్టుబాటు కాకున్నా, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.23 కి అమ్ముతున్నారని, ఆ విధంగా దళారుల దోపిడి సాగుతోందని తెలిపారు. దళారీలను కట్టడి చేయాల్సిన చంద్రబాబు స్వయంగా వారికి నాయకుడిగా మారారని ఆరోపించారు.
ఉల్లి, టమోటాతో పాటు, పత్తి ధరలు కూడా అలాగే దారుణంగా ఉన్నాయని వివరించారు.
‘నేను ఉన్నాను’
ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలన అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్ల మధ్య సాగిందన్న జననేత, తాను 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టం చూశానని, బాధలు విన్నానని, అందరితో మమేకం అయ్యానని.. అందుకే ‘నేను ఉన్నాను’ అని హామీ ఇస్తున్నానని చెప్పారు.
వారి గురించే నా ఆలోచన
రాష్ట్ర జనాభాలో దాదాపు 80 శాతం మందికి తెల్ల కార్డులు ఉన్నాయని, వారంతా దిగువ మధ్య తరగతి, పేదవాళ్లు అని, తగిన ఆదాయం లేక, రేపు ఏం జరుగుతుందో తెలియక వారు బతుకుతున్నారని ఆవేదన చెందారు. తన సుదీర్ఘ పాదయాత్రలో వారందరి బాధలు చూశానని, పేదలను ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే తన యాత్ర కొనసాగిందని వెల్లడించారు.
చిరు వ్యాపారులు–కులవృత్తిదారులు
ఫుట్‌పాత్‌ల మీద సరుకులు, తోపుడు బండ్ల మీద కూరగాయలు, సామాన్లు అమ్ముకుంటున్న వారిని, రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద దోసెలు వేస్తూ, టీ కాస్తూ వాటిని అమ్ముకుంటున్న వారిని పాదయాత్రలో చూశానని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. వారు పెట్టుబడి కోసం రూ.1000, రూ.2000ను రూ.4 లేదా రూ.5 వడ్డీకి తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు.
వారితో పాటు, కుల వృత్తుల వారు, రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, చెప్పులు కుట్టుకునే వారు కావచ్చు.. అందరికి ఒకే మాట చెబుతున్నానని అన్నారు.
గుర్తింపు కార్డులు–రుణం
‘మీ సమస్యలు చూశాను. దగ్గర నుంచి విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందుకే మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాను. రోడ్డు పక్క చిరు వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాము’ అని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు.
దారి పొడవునా కష్టాలు, బాధలు వింటూ నడిచానని, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని చూశానని, నవరత్నాలు ద్వారా వారందరికీ మేలు చేస్తానని వెల్లడించారు.
ఉద్యోగులకు మేలు
అదోనిలో ఉద్యోగులు ఎక్కువన్న జననేత, అందుకే ప్రతి ఉద్యోగికి భరోసా ఇస్తున్నానంటూ పలు అంశాలు ప్రకటించారు.
– అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు.
– ఉద్యోగులు కోరుకున్న విధంగా 27శాతం ఐఆర్.
– సకాలంలో పీఆర్సీ ఏర్పాటు. సిఫార్సుల అమలు.
– సర్వీసు, విద్యార్హతను పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
– ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ మేలు. సమానపనికి సమాన వేతనాలు.
– పెన్షనర్ల కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్ ఏర్పాటు. వారికి అన్ని విధాల తోడు.
– ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణం.
– పోలీసు బాస్‌లకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతాము.
– కింద స్థాయి నుంచి ప్రజల్లో పని చేస్తున్న హోమ్ గార్డులకు మెరుగైన జీతాలు.
– పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు (వీక్ ఆఫ్) ఇస్తాము.
– దీని వల్ల అవసరమైతే కొత్తగా సిబ్బంది నియామకం.
– అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కూడా మేలు.
అని శ్రీ వైయస్ జగన్ వివరించారు. ఆ విధంగా ప్రతి ఉద్యోగికి, కార్మికుడికి మేలు చేస్తామని వెల్లడించారు.
వారందరితో యుద్ధం
ఎన్నికలు రావడంతో చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం, చూపని సినిమా ఉండదన్న జననేత, కాబట్టి ఈ ఎన్నికలు ధర్మం–అధర్మం మధ్య జరుగుతున్నాయని చెప్పారు. అందుకే తమ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో చేస్తున్నామని వివరించారు.
డబ్బుల మూటలు
ఈ ఎన్నికల్లో చంద్రబాబు చేయని కుట్ర ఉండదని, అందులో భాగంగానే గ్రామాలకు మూటలకొద్దీ డబ్బులు పంపిస్తాడని, ప్రతి చేతిలో రూ.3 వేలు పెట్టి, ఈ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తాడని ఆరోపించారు.
అందుకే ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరినీ కలిసి చంద్రబాబు మోసాలు వివరించాలని, పార్టీ అధికారం చేపడితే ఏం చేస్తుందన్నది వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ చెప్పండి
‘అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, 20 రోజులు ఓపిక పట్టి అన్నను సీఎం చేసుకుంటే.. ఆ తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అదే విధంగా మన పిల్లలు ఎక్కడ, ఏ కోర్సు చదివినా, ఎంత ఫీజు అయినా సరే అన్న చెల్లిస్తాడని, ఎన్ని లక్షలైనా సరే కడతాడని చెప్పండి. ఇంకా వారికి హాస్టల్, మెస్ ఛార్జీల కింద ఏటా రూ.20 వేలు ఇస్తాడని కూడా వివరించండి’.
‘పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించండి. అందుకే రూ.3 వేలకు ఆశ పడకుండా, 20 రోజులు ఆగి అన్నను సీఎం చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా వారికే నాలుగు విడతల్లో ఇస్తాడని చెప్పండి. అంతే కాకుండా గతంలో మాదిరిగా సున్నా వడ్డీ రుణాలు కూడా వస్తాయని చెప్పండి’.
‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉనన వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, అన్నను సీఎం చేసుకుంటే, వచ్చే నాలుగేళ్లలో వైయస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి’.
‘ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా చేసిన మోసం, సున్నా వడ్డీ రుణాలు అందకపోవడం, ఏ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడాన్ని వివరించండి. అందుకే అన్నను సీఎం చేసుకుంటే ఏటా మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయ పెట్టుబడిగా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాడని వివరించండి’.
‘ప్రతి అవ్వా, తాత దగ్గరకు వెళ్లండి. వారికి వస్తున్న పింఛన్ వివరాలు ఆరా తీయండి. అప్పుడు వారిని అడగండి. అవ్వా.. ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న రూ.2 వేల పింఛను ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు ఆ పింఛను ఇచ్చే వాడా? అని ప్రశ్నించండి. అందుకే అన్నను సీఎం చేసుకుంటే ఆ పింఛన్‌ను క్రమంగా పెంచి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’ అని శ్రీ వైయస్ జగన్ కోరారు.
నవరత్నాలు
అందరికీ మేలు చేసే ఈ పధకాలను ఇంటింటా ప్రచారం చేయాలని, వాటి ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయని కూడా చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
అదోని నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.సాయిప్రసాద్‌రెడ్డితో పాటు, పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్‌కుమార్ (చేనేత కులానికి చెందిన బీసీ నాయకుడు)ను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.