గిద్దలూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో విప్లవం తీసుకువస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను ఒకేసారి విడుదల (భర్తీకి నోటిఫికేషన్ జారీ) చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలౖపై ఏటా జనవరి 1న క్యాలెండర్ ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం చేస్తామని, జిల్లా కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు వృత్తి నైపుణ్యంలో ప్రత్యేక శిక్షణనిస్తామని, తద్వారా పారిశ్రామిక రంగానికి కూడా మేలు చేస్తామని ఆయన వెల్లడించారు.
వీటితో పాటు, ఆర్టీసీ నిర్వహించే అద్దె బస్సులు, శాఖల్లో అద్దెకు తీసుకునే వాహనాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని, వారు అందుకోసం వాహనాలు కొనుగోలు చేస్తే రాయితీలు ఇస్తామని తెలిపారు. వీటన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని జననేత చెప్పారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.
గిద్దలూరు–సమస్యలు
గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తాగు నీటి సమస్య నెలకొందని, దాదాపు 230 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని, వాటికి కూడా 9 నెలలుగా రూ.10 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేశారని శ్రీ వైయస్ జగన్ తెలిపారు.
ఇక నియోజకవర్గంలోని 56 మండలాలకు గానూ 48 మండలాల నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండి జబ్బులు వస్తున్నాయి. ప్రజలు శారీరక వికలాంగులు అవుతున్నారని, ఇంకొందరు చనిపోతున్నారని ఆయన చెప్పారు.
ప్రాజెక్టులు–మహానేత
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే, ఇలాంటి సమస్య ఉండదని తెలిసినా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని జననేత ఆక్షేపించారు.
ఇదే నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరందించే పూలసిద్ధయ్య ప్రాజక్టు (వెలుగొండ ప్రాజెక్టు)లోని రెండు సొరంగాలలో తొలి సొరంగం 18 కి.మీ కాగా, దానిలో 15 కి.మీ, రెండో సొరంగంలోని 18 కి.మీ లలో 10 కి.మీ పనులు నాడు మహానేత వైయస్సార్ హయాంలోనే పూరై్తనా, మిగిలిన పనులు ఇప్పటికీ సాగుతున్నాయని గుర్తు చేశారు. ఇంత దారుణపాలన ఇంకెక్కడా ఉండదని పేర్కొన్నారు. గిద్దలూరుతో పాటు, 14 గ్రామాలకు నీరందించేందుకు మరో ప్రాజెక్టు చేపట్టిన మహానేత తన హయాంలోనే 50 శాతం పనులు పూర్తి చేయగా, మిగిలిన పనులు ఇంకా సాగుతున్నాయని చెప్పారు.
పంటలు–గిట్టుబాటు
ఒకవైపు నీరు లేదని, మరోవైపు బోరు బావులు వేల అడుగులు తవ్వాల్సి వస్తోందని జననేత గుర్తు చేశారు. అయినా ఫ్లోరైడ్ నీరు పడుతోందని, ఇన్ని ప్రతికూల పరిస్థితులలో పంటలు పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని తెలిపారు.
పత్తి మద్దతు ధర రూ.5,450 కాగా రూ,4,000. మిర్చి కనీస మద్దతు ధర రూ.10 వేలు కాగా, రూ.5,500, శనగ మద్దతు ధర రూ.5,200 కాగా, రూ.4 వేలు, కంది కనీస మద్దతు ధర రూ.5,675 కాగా, రూ.4,500 మాత్రమే రైతులకు దక్కుతోందని వివరించారు.
పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ, పొగాకుకు కనీసం రూ.220 వస్తే ఖర్చులు కలిసి వస్తాయని, కానీ ఇప్పుడు రూ.165 కూడా రావడం లేదని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం అవసరమా? అని ప్రశ్నించారు.
ధనిక సీఎం–పేద రైతులు
ఈ 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన గురించి ప్రస్తావించిన జననేత, ఆయన దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. మరోవైపు మరోవైపు మన రైతులు దేశంలోనే అత్యంత పేదలు అని, మన రైతులకు దేశంలోనే అత్యధిక రుణాలున్నాయని నాబార్డు నివేదికలో తేలిందని గుర్తు చేశారు.
మహిళలు–అప్పులు
పొదుపు సంఘాల మహిళల అప్పులు రూ.14,200 కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు చేరాయని, వాటిపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ) సమావేశంలో కూడా అధికారులు ప్రస్తావించారని తెలిపారు.
ఎవరు బాగుంటే?
అదే విధంగా ఈ 5 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందన్న జననేత.. రైతులు, అక్కా చెల్లెమ్మలు, యువత.. ఎవరైనా బాగు పడ్డారా? అని ప్రశ్నించారు. మరి బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా? లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా? అని అడిగారు.
జాబు రావాలంటే?
గతంలో జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని.. కానీ ఇవాళ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిందని.. జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా మారిందని చెప్పారు.
నిరుద్యోగ భృతి
చంద్రబాబు ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా యువకులు జాబు కోసం పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లున్నాయని.. ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పించకపోతే, నెలకు రూ.2 వేల భృతి ఇస్తానని చెప్పి, ఆ మొత్తం ఇవ్వకుండా ప్రతి ఇంటికి ఈ 5 ఏళ్లలో రూ.1.20 లక్షలు ఎగ్గొట్టారని వివరించారు.
ఉద్యోగ ఖాళీలు
రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్ కమిటీ ప్రకటించిందని, ఆ తర్వాత పదవీ విరమణలతో మరో 90 వేల ఖాళీలు పెరిగి మొత్తం దాదాపు 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయినా భర్తీ లేదని ఆక్షేపించారు.
ఒకవైపు ఉద్యోగాల భర్తీ లేకపోగా, మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారంటూ, ఆ గణాంకాలు వివరించారు.
ఉద్యోగాలు–తొలగింపు
– 30 వేల మంది ఆదర్శ రైతులు
– గృహ నిర్మాణ శాఖలో 3500 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు
– 1000 మంది గోపాలమిత్రలు
– ఆయుష్‌లో 800 ఉద్యోగాలు
– సాక్షర భారత్‌లో 30 వేల ఉద్యోగాలు
– మధ్యాహ్న భోజన పథకంలో 14 ఏళ్ల నుంచి పని చేస్తున్న 85 వేల మంది అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు
వీరందరినీ తొలగించారని, మరోవైపు జీతాలు పెంచాలని హోం గార్డులు, వీఏఓలు, ఆశా వర్కర్లు, వెలుగు ఉద్యోగులు అడిగితే కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు.
‘నేను ఉన్నాను’
చంద్రబాబు నాయుడు అన్యాయమైన పాలన ఎలా ఉందన్న విషయం, తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు వచ్చి చెప్పారని తెలిపారు. తాము ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని కూడా ప్రశ్నించారని, ఆ పిల్లలకు తాను ఒకటే చెబుతున్నానని, అందరి కష్టాలు చూశానని, బాధలు విన్నానని, అందుకే భరోసా ఇస్తున్నానంటూ.. ‘నేను ఉన్నాను’ అని చెప్పారు.
ఇక తమ ప్రభుత్వం ఏర్పడిత ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ఏమేం చేస్తామన్నది కూడా జననేత వివరించారు.
ఉద్యోగాలు–ఉపాధి కల్పన
– ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 ఉద్యోగాల భర్తీకి ఒకేసారి విడుదల.
– ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన.
– ప్రతి గ్రామంలో 10 మందితో సచివాలయం ఏర్పాటు. ఆ విధంగా చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు.
ఏ పని కావాలన్నా ఆ సచివాలయాలు చేస్తాయి. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే వాటిని పరిష్కరిస్తాయి.
– ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం. ఆ 50 ఇళ్ల వారికి ఏం కావాలన్నా, ఆ వాలంటీర్ చేసి పెడతాడు. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేస్తారు.
– పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. అందు కోసం అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం. అప్పటికే ఉన్న పరిశ్రమలతో పాటు, కొత్తగా ఏర్పాటయ్యే వాటికి కూడా దాన్ని వర్తింపచేస్తాము.
– జిల్లా కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు. పరిశ్రమలకు కూడా మేలు చేసే విధంగా ప్రతి జిల్లా కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ జిల్లాలో పరిశ్రమలు, వాటి అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ.
– ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌లు, ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు, వివిధ శాఖల్లో అద్దె వాహనాల్లో యువతకు ప్రాధాన్యం. వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ. ఈ కాంట్రాక్ట్‌లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు.
– ప్రత్యేక హోదా సాధన. మొత్తం ఎంపీలను గెలిపించుకుంటే, కేంద్రంలో కీలకంగా నిలవవచ్చు.
అందుకే ఎవరు హోదా ఇస్తే వారికే మద్దతు ఇచ్చి, ఆ విధంగా హోదాను సాధిస్తాము. దాని వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు ఏర్పడతాయి. దీంతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. తద్వారా ఉద్యోగాల విప్లవం వస్తుంది.
ఎన్నికలు–కుతంత్రాలు
మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, చంద్రబాబు పాలనలో ప్రతి రోజూ కుట్రలు, కుతంత్రాలు చూస్తున్నామన్న జనేనేత, ఇవాళ తమ యుధ్దం కేవలం చంద్రబాబు నాయుడుతో మాత్రమే కాదని, ఆయనకు అమ్ముడుపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, ఇంకా చాలా మందితో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏం జరగకపోయినా జరిగినట్లు చూపడం, అబద్దాలు నిజం చేసే ప్రయత్నం.. ఇవన్నీ ఆ మీడియా చేస్తోందని ఆక్షేపించారు.
ఎన్నికలు ఎన్నికలు మరింత దగ్గర పడగానే కుట్రలు ఇంకా ఎక్కువవుతాయని, గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపించి, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెట్టి, వారిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
గ్రామాలకు తరలండి
అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలకు వెళ్లాలని, ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతు దగ్గరకు పోయి చంద్రబాబు మోసాలు వివరించండి.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్.. ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటినా ప్రభుత్వం మాత్రం ముష్టిగా రూ.35 వేలు మాత్రమే ఇస్తోందని గుర్తు చేయండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి’.
‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో ఆ అక్కా చెల్లెమ్మకే ఇస్తాడని చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.
‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.
‘గ్రామాల్లో ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కకపోవడాన్ని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో అన్న మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి’.
‘గ్రామంలో ప్రతి అవ్వ, తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న కానీ చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్ ఇచ్చేవాడా?’ అని అడగండి.
‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీకు ఇచ్చే పెన్షన్ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.
‘ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. అందుకే రాజన్న రాజ్యంలో మాదిరిగా జగనన్న పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. అని శ్రీ వైయస్ జగన్ కోరారు.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా వెంకటరాంబాబుతో పాటు, పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.