ASBL Koncept Ambience

నందికొట్కూరు బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

నందికొట్కూరు బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏం జరిగిందనేది ఒక్కసారి చూస్తే.. ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా నిల్చారని, మరోవైపు మన రైతులు అత్యంత పేదవారయ్యారని, వారికి దేశంలోనే అత్యధిక రుణాలున్నాయని సాక్షాత్తూ నాబార్డు నివేదికలో పేర్కొన్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. పొదుపు సంఘాల మహిళల అప్పులు దారుణంగా పెరిగాయని, నిరుద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని, 5 ఏళ్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని ఆయన తెలిపారు. ఇక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాలేదన్న జననేత, ఈ 57 నెలలుగా అన్ని రకాలుగా అన్యాయం చేసిన చంద్రబాబు, చివరి 3 నెలలు మాత్రం కొన్ని పథకాల చేపట్టి, వాటన్నింటినీ 5 ఏళ్లుగా అమలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

మహానేత–సాగునీరు

నందికొట్కూరు పక్కనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఉన్నా, అది కట్టాలని గతంలో ఎవ్వరూ ఆలోచన చేయలేదని, కానీ మహానేత వైయస్సార్‌ ఆ ప్రాజెక్టు చేపట్టి దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారని, 12 పంపుల ద్వారా నీటి సరఫరా తలపెట్టారని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. అయితే ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మిగిలిన 20 శాతం పనులు పూర్తి కాలేదని, ఇప్పటికి కేవలం 4 పంపులు ఏర్పాటు చేయగా, వాటిలో రెండే పని చేస్తున్నాయని తెలిపారు. 

కేసీ కెనాల్‌ కింద మార్చి నెల వరకు రెండో పంటకు నీరివ్వాల్సి ఉన్నా, ఇప్పటికీ మొదటి పంటకు నీరివ్వలేదని గుర్తు చేశారు.

అదే విధంగా బనకచెర్ల వద్ద రెగ్యులేటర్‌ విస్తరణ చేపట్టి, పోతిరెడ్డిపాడు కట్టి, అక్కణ్నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు తరలించాలని ఎందరు అనుకున్నా ఆ పని చేయలేదని, కానీ మహానేత వైయస్సార్‌ ఆ ప్రాజెక్టు చేపట్టి, దాదాపు 80 శాతం పూర్తి చేశారని తెలిపారు. కాగా మిగిలిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు.

హంద్రీనీవా నుంచి మిడ్తూరు, జూపాడబంగ్లా మండలాల చెరువులకు నీరిస్తామని సీఎం హోదాలో చంద్రబాబు మాట ఇచ్చినా, ఆ పనులు జరగలేదంటూ, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు కూడా అమలవడం లేదనీ, ఇదీ ఇక్కడి పాలన అని గుర్తు చేశారు. 

గిట్టుబాటు ధరలు లేవు

చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని..  వరి కనీస మద్దతు ధర రూ.1550 కాగా, రైతులకు కనీసం రూ.1200 కూడా రావడం లేదని, మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.1700 కాగా, రైతులకు రూ.1200 కూడా దక్కడం లేదని, శనగ కనీస మద్దతు ధర రూ.5200 కాగా రైతులకు రూ.3500 కూడా రావడం లేదని వివరించారు. 

అమలు కాని హామీలు

జూపాడుబంగ్లా మండలాన్ని మెగా అల్ట్రా ఫుడ్‌ పార్కుగా అభివృద్ధి చేస్తామన్నారని, నందికొట్కూరు ఆస్పత్రిని 30 పడకల నంచి 100 పడకల స్థాయికి పెంచుతామన్న హామీలు కూడా అమలు కాలేదని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. 

5 ఏళ్లలో ఏం జరిగింది?

ఏ విషయంలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ, ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందన్నది ప్రస్తావించారు.

– చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎంగా ఉన్నారు.
– మరోవైపు మన రైతులు దేశంలోనే అత్యంత పేదవారుగా నిల్చారు.
– వారికి దేశంలోనే అత్యధిక  రుణాలున్నాయని సాక్షాత్తూ నాబార్డు తన నివేదికలో పేర్కొంది.
– పొదుపు సంఘాల మహిళల అప్పులు రూ.14,200 కోట్ల నుంచి ఈ 5 ఏళ్లలో రూ.26 వేల కోట్లకు పెరిగాయి.
– ఈ మాదిరిగా అప్పుల భారం పెరిగిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ) సమావేశంలోనే చెప్పారు.
– నిరుద్యోగుల సంఖ్య ఈ 5 ఏళ్లలో దాదాపు రెట్టింపైంది. ఎక్కడ చూసినా ఉద్యోగాల కోసం చూస్తున్న యువత కనిపిస్తున్నారు. 

ఎవరు బాగుంటే?..

అలా అన్నింటినీ స్పష్టంగా వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ‘బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా? లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా?’ అని ప్రశ్నించారు.

కానీ ఎల్లో మీడియాలో మాత్రం ‘బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లు అని రాస్తున్నారు’ అని చెప్పారు. నిజానికి ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా మారిందని అన్నారు. 

నిరుద్యోగ భృతి

డిగ్రీలు పూరై్తన తర్వాత ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస పోతోందని జననేత పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లలో ప్రతి ఇంటికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామన్నారని, అలా ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, కానీ ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని చెప్పారు.

కానీ చంద్రబాబు కొడుక్కి మాత్రం ఉద్యోగం వచ్చిందని, తొలుత లోకేష్‌ను ఎమ్మెల్సీ చేశారని, ఆ తర్వాత మంత్రిని చేశారని వివరించారు.

ఉద్యోగాలు పోయాయి

చంద్రబాబు సీఎం అయ్యాక కొత్త ఉద్యోగాలు రాకపోగా, చాలా ఉద్యోగాలు పోయాయని.. గోవిందా గోవిందా అంటూ వాటన్నింటిని వివరించారు.

– 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..
– గృహ నిర్మాణ శాఖలో 3500 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు  వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాలు గోవిందా..
– 1000 మంది గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా..
– ఆయుష్‌లో 800 మంది ఉద్యోగాలు గోవిందా..
– సాక్షర భారత్‌లో 30 వేల మంది ఉద్యోగాలు గోవిందా..
– మధ్యాహ్న భోజన పథకంలో 80 వేల మంది అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. 

ఇలా ఉద్యోగాలు అన్నీ గోవిందా కాగా, మిగిలిన వారు జీతాలు పెంచమంటే పోలీసులతో దాడి చేయించారని గుర్తు చేశారు.

నిరుద్యోగ భృతి మోసం

ఈ 57 నెలలు అన్యాయాలన్నీ చేసి, చివరి మూడు నెలలు మాత్రం నిరుద్యోగ భృతి ఇస్తున్నారని.. అది కూడా కేవలం 3 లక్షల మందికి.. అదీ నెలకు కేవలం రూ.1000 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కానీ ఎంతో మేలు చేసినట్లు సినిమా చూపిస్తున్నారని, అదే 5 ఏళ్లుగా చేసినట్లు బిల్డప్‌ ఇస్తున్నారని అన్నారు. 

ఉద్యోగ ఖాళీలు

రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల ఖాళీలు ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ తేల్చిందని, దీంతో నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు కోచింగ్‌ తీసుకున్నారని జననేత తెలిపారు. కాగా, ఆ తర్వాత రిటైర్మెంట్లతో మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలకు చేరినా, ఉద్యోగాల భర్తీ మాత్రం లేదని ఆక్షేపించారు.

నేను ఉన్నాను

సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో అన్ని వర్గాల వారి కష్టాలు, బాధలు చూశానని, అందుకే హామీ ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని జననేత చెప్పారు.

రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే.. ఉద్యోగాల కల్పనకు ఏమేం చేస్తామన్నది కూడా ఆయన వివరించారు.

– ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ.
– అందు కోసం ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల.
– ప్రతి గ్రామంలో 10 మందితో సచివాలయం ఏర్పాటు.
– దాని వల్ల ప్రతి ఊరిలో చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు.
– దీంతో పాటు గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌.
– వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం.

గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేసే వాలంటీర్లు, ఆ 50 ఇళ్ల వారికి ఏ పని కావాలన్నా చూసుకుంటారు. ఇల్లు కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, నవరత్నాలు పథకాలు కావాలన్నా.. ఏది కావాలన్నా ఆ వాలంటీర్లు చేసి పెడతారు.

– పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా, అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం.
– పరిశ్రమలకు కూడా మేలు చేసేలా ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు.

ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలు, వాటి అవసరాలకు అనుగుణంగా ఆయా సెంటర్లలో యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణనిస్తారు.

–  ఆర్టీసీ నిర్వహించే ప్రైవేటు బస్సులతో పాటు, వివిధ శాఖల్లో అద్దెకు తీసుకునే వాహనాల్లో నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇస్తాం.
– అందు కోసం వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ.
– వాటన్నింటిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు 50 శాతం.
– పార్టీ అత్యధికంగా ఎంపీ సీట్లు గెల్చుకుంటే ప్రత్యేక హోదా సా«ధిస్తాము.

ఎవరు హోదా ఇస్తే వారికే మద్దతు ఇస్తామని, ఆ హోదా వస్తేనే పెట్టుబడులు వస్తాయని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. 

విశ్వసనీయత రావాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, విశ్వసనీయత రావాలని, అందుకు అందరూ పెద్దపీట వేయాలని కోరారు. మాట మీద నిలబడని నాయకుడు పదవి వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారుతుందని, విశ్వసనీయత వస్తుందని స్పష్టం చేశారు.

కుట్రలు–కుతంత్రాలు

ఎన్నికలు మరో 13 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి కాబట్టి, చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం, చూపని డ్రామా, సినిమా ఉండదని.. ఉన్నది లేనట్లు.. లేదని ఉన్నట్లు చూపుతారని అన్నారు. 

ఎన్నికలు ఇంకా దగ్గర పడడంతో ఈ కుట్రలు మరింత ఎక్కువవుతాయని, ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెట్టి, ఆ విధంగా అందరిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

గ్రామాలకు తరలండి

అందుకని ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలకు వెళ్లాలని, అక్కడ ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలవాలని, చంద్రబాబు మోసాలను వివరించాలని కోరారు. 

ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌.. ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమ పథకంతో చేస్తున్న డ్రామాను నమ్మొద్దని చెప్పండి’. 

‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోనే పెడతారని చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని కలవండి. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఆగి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా మీ చేతుల్లో పెడతాడని చెప్పండి’.

‘ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా చేసిన మోసం వివరించండి. అలాగే ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కకపోవడాన్ని కూడా చెప్పండి. అందుకే 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఏటా మే మాసంలో వ్యవసాయ పెట్టుబడి కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వాటికి గ్యారెంటీ ఇస్తాడని కూడా చెప్పండి’.

‘ప్రతి అవ్వ, తాత దగ్గరకు వెళ్లండి. వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. ఆ అవ్వ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న కానీ చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని, ఆ తర్వాత మీ మనవడు మీకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని చెప్పండి. అందుకే రాజన్న మాదిరిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పండి, అక్షరాలా ఏటా 5 లక్షల వంతున మొత్తం 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. 

పార్టీ అభ్యర్థుల పరిచయం

నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్థర్‌తో పాటు, పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

సిద్ధార్థ్‌..

చివరగా.. సిద్ధార్థ్‌ గురించి ప్రస్తావించిన జననేత.. ‘యువకుడు, ఉత్సాహవంతుడు. రాబోయే రోజుల్లో సిద్ధార్థ్‌ను గుండెల్లో పెట్టుకుంటాను. రాజకీయంగా ఎదిగేలా చూస్తాను’ అని హామీ ఇచ్చారు.

ఇంకా దశాబ్దాలుగా యుద్ధం చేసిన వారంతా ఇప్పుడు ఏకమయ్యారని,  తమకు చిన్న చిన్న వాళ్లు తోడుగా ఉన్నారని, సిద్ధార్థ్‌ వంటి యువకులు అండగా ఉన్నారని, తమది పార్టీ పేదల పార్టీ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.  

 

 

Tags :