ఒంగోలు ప్రచార సభలో వైయస్ జగన్
‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ గత ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసిన చంద్రబాబు అధికారం చేపట్టారని, కానీ ఆయన అయిదేళ్ల పాలన చూశాక, ఇవాళ ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అన్నట్లుగా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఈ 5 ఏళ్లలో 30 వేల ఆదర్శౖ రెతుల ఉద్యోగాలు, గృహ నిర్మాణ శాఖలో 3500 మంది, 1000 గోపాలమిత్రల ఉద్యోగాలు, ఆయుష్ విభాగంలో 800 ఉద్యోగాలు, సాక్షర భారత్‌లో 30 వేల ఉద్యోగాలు, మధ్యాహ్న భోజన పథకంలో 14 ఏళ్లుగా పని చేస్తున్న 85 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా అనేక మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం ఏకంగా రూ.1800 కోట్లు బకాయి పడిందని జననేత తెలిపారు. ఇదీ చంద్రబాబు పాలన అని ఆయన అభివర్ణించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. భగ్గున మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలి రావడంతో పట్టణం ఒక జనసంద్రంగా మారింది.
ఒంగోలు–వైయస్సార్
చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ఒంగోలులో ఏ పనీ చేయలేదన్న శ్రీ వైయస్ జగన్, అదే మహానేత వైయస్సార్ హయాంలో ఇక్కడ జరిగిన పనులు గుర్తు చేసుకోవాలని అన్నారు. 10 వేల మందికి ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు, మరో 10 వేల మందికి ఆయన ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని తెలిపారు.
పేదల ఫ్లాట్లు–మోసం
ఇప్పుడు చంద్రబాబు పేదల ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నారని, వారికి 300 అడుగులతో ఫ్లాట్లు కట్టిస్తున్నారని, అందులో అంతులేని మోసం జరుగుతోందని జననేత చెప్పారు. ఆ ఫ్లాట్లకు స్థలం, ఇసుక ఉచితం కాగా, వాటిలో గ్రానైట్, లిఫ్ట్ ఉండదని.. అందువల్ల వాటి నిర్మాణానికి అడుగుకు కనీసం రూ.1000 కూడా కాదని తెలిపారు.
కానీ అవే ఫ్లాట్లను అడుగుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 లక్షలకు పేదలకు అమ్ముతున్నారని, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల వంతున మొత్తం రూ.3 లక్షలు పోతే, మిగిలిన రూ.3 లక్షలను ఆ పేదలు నెలకు రూ.3 వేల చొప్పున, 20 ఏళ్లు చెల్లించాలని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు చేసే అవినీతిని పేదలు 20 ఏళ్లు భరించాలని అన్నారు.
మాఫీ చేస్తాం
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోవాలని, రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే.. ‘జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడితే, ఆ రూ.3 లక్షల అప్పును పూర్తిగా మాఫీ చేస్తాము’ అని ప్రకటించారు.
అగ్రిగోల్డ్
ఒంగోలుతో పాటు, జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువని, కానీ ఈ 5 ఏళ్లలో వారికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. పైగా వారి అత్తగారి సొత్తు అన్నట్లుగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఆయన మంత్రులు, బినామీలు అడ్డగోలుగా ఆ సంస్థ ఆస్తులు దోచేస్తున్నారని ఆరోపించారు. అందుకే బాధితులకు హామీ ఇస్తున్నానని చెప్పారు.
అమలు కాని హామీలు
ఒంగోలు నగరంలో 5 ఏళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ పనులు జరగలేదని.. పోతురాజు కాలువను రూ.100 కోట్లతో ఆధునీకరిస్తామన్నా, ఆ పనీ చేయలేదని.. ఇంకా గుండ్లకమ్మ నుంచి నీరిస్తానన్న హామీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు.
నగరంలో రోజూ తాగు నీరిస్తామన్నా, 3 రోజులకు ఒకసారి కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని, అది కూడా నాడు 10 ఏళ్ల క్రితం మహానేత వైయస్సార్ రామతీర్థం కట్టాడు కాబట్టి సాధ్యమవుతోందని తెలిపారు.
జనాభా పెరుగుతున్నా వసతులు పెరగలేదని, నీరు సక్రమంగా సరఫరా చేయడం లేదని చెప్పారు.
ఒక్క పరిశ్రమ వచ్చిందా?
మహానేత వైయస్సార్ హయాంలో ఒంగోలులో రిమ్స్, వైద్య కళాశాల ఏర్పాటు కాగా, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కనీసం ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటైందా? ఒక్క యూనివర్సిటీ అయినా వచ్చిందా? అని శ్రీ వైయస్ జగన్ ప్రశ్నించారు.
కానీ ఎన్నికలు వస్తే చంద్రబాబు వచ్చి ఒక రాయి వేసి, టెంకాయ కొట్టి వెళ్తాడని.. ఇంకా రామయ్యపట్నం పోర్టును కట్టాలని ఏరోజూ చంద్రబాబునాయుడు భావించలేదని, కృష్ణపట్నం పోర్టు కోసం దాన్ని పక్కన పెట్టేశారని చెప్పారు. కానీ ఎన్నికలు వచ్చే సరికి వచ్చి టెంకాయ కొడుతున్నారని ఆక్షేపించారు.
ధనిక సీఎం–పేద రైతు
మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అవినీతి.. ఇవే 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో చూశామన్న జననేత, ఇవాళ దేశంలో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నిల్చారని, అదే సమయంలో రాష్ట్ర రైతులు దేశంలోనే అత్యంత పేదలుగా మిగిలిపోయారని తెలిపారు. నాబార్డు నివేదికలో ఈ విషయం తేటతెల్లమైందని, రాష్ట్ర రైతులకు దేశంలోనే అత్యధిక రుణాలున్నాయని కూడా నాబార్డు నివేదికలో తేలిందని చెప్పారు.
రుణాలు పెరిగాయి
పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు ఈ 5 ఏళ్లలో రూ.14,205 కోట్ల నుంచి రూ.28 వేల కోట్లకు చేరాయని జననేత తెలిపారు. అదే విధంగా నిరుద్యోగుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపైందని, ఎక్కడ చూసినా నిరుద్యోగులు కనిపిస్తున్నారని, ఉపాధి కోసం వలస పోతున్నవారు కనిపిస్తారని అన్నారు.
ఒక్కరికే ఉద్యోగం
రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లుంటే, ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పించకపోతే, నెలకు రూ.2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ‘జాబు రావాలంటే బాబు రావాలని’ కూడా జోరుగా ప్రచారం చేశారని గుర్తు చేశారు.
అయితే రాష్ట్రంలో ఎవరికైనా జాబు వచ్చిందంటే, ఒక్క చంద్రబాబు కొడుక్కు మాత్రమే వచ్చిందని, తొలుత ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత మంత్రి పదవి వచ్చిందని చెప్పారు.
పిల్లలకు వెన్నుపోటు
రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల ఖాళీలున్నాయని కమలనాధన్ కమిటీ తేల్చిందని, కానీ వాటిని చంద్రబాబు భర్తీ చేయలేదని, మరోవైపు హోదాను తాకట్టు పెట్టి పిల్లలకు వెన్నుపోటు పొడిచాడని ఆక్షేపించారు. దీంతో ‘ఇవాళ జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా’ మారిందని చెప్పారు.
చంద్రబాబు ఈ 5 ఏళ్ల పాలనలో ఏయే ఉద్యోగాలు పోయాయన్న వివరాలను ఈ సందర్భంగా జననేత ప్రస్తావించారు.
గోవిందా గోవిందా:
– 30 వేల మంది ఆదర్శౖ రెతుల ఉద్యోగాలు.
– గృహ నిర్మాణ శాఖలో 3500 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు.
– 1000 గోపాలమిత్రల ఉద్యోగాలు.
– ఆయుష్ విభాగంలో 800 మంది ఉద్యోగాలు.
– సాక్షరభారత్‌లో 30 వేల మంది ఉద్యోగాలు.
– మధ్యాహన భోజన పథకంలో 14 ఏళ్ల నుంచి పని చేస్తున్న 85 వేల మంది కార్మికుల ఉద్యోగాలు.
అని వివరించిన శ్రీ వైయస్ జగన్, మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి జీతాలివ్వడం లేదని, ఆ గణాంకాలు ప్రస్తావించారు.
బాబు వచ్చాడు:
– ప్రభుత్వంలో 1.25 లక్షల ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాలు ఇంకా ఇవ్వలేదు.
– వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్.
– ఉద్యోగులు తమ భవిష్య నిధి (జీపీఎఫ్) నిధులు తీసుకోకుండా ఆంక్షలు.
– హోం గార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు, గురుకులాలు, సర్వశిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న వారికి 4 నెలలుగా జీతాలు లేవు.
– రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్.
– ఫీజు రీయింబర్స్‌మెంట కింద రూ.1800 కోట్లు బకాయిలు.
– మధ్యాహ్న భోజన పథకంలో సరుకుల కోసం నిధులివ్వక, పిల్లల కడుపు మాడుస్తున్నారు.
ఇవన్నీ స్పష్టంగా వివరించిన శ్రీ వైయస్ జగన్, ఇలాంటి వ్యక్తికి తిరిగి అధికారం కట్టబెడితే, రేపు మనకు కనీసం రేషన్ అయినా ఇస్తాడా? అన్నది ఆలోచించాలని కోరారు.
చివరి 3 నెలలు..
‘అయిదేళ్ల కోసం ప్రజలు అధికారం ఇస్తారు. ఆ 60 నెలల్లో 57 నెలలు ప్రజలకు అన్యాయం చేసి, చివరి మూడు నెలలకు రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లుంటే, కేవలం 3 లక్షల మందికి, నెలకు రూ.2 వేల బదులు రూ.1000 మాత్రమే, అది కూడా కేవలం 3 నెలలకు మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు’ అని వివరించిన శ్రీ వైయస్ జగన్, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో తన 3648 కి.మీ పాదయాత్ర సాగిందని చెప్పారు.
ప్రతిచోటా నిరుద్యోగుల బాధలు చూశానని, అందుకే హామీ ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని భరోసా ఇచ్చారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులు, యువత కోసం ఏమేం చేస్తామన్నది శ్రీ వైయస్ జగన్ వివరించారు.
ప్రభుత్వం ఏర్పడితే–నవరత్నాలు:
– ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 ఉద్యోగాలు వెంటనే భర్తీ.
– ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాలపై క్యాలెండర్ విడుదల.
– ప్రతి గ్రామంలోనూ చదువుకున్న 10 మందితో సచివాలయం ఏర్పాటు.
కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు కావాల్సిన అన్నింటినీ నిష్పాక్షికంగా ఆ సచివాలయాలు అందిస్తాయి. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే వాటిని పరిష్కరిస్తాయి. నవరత్నాలులో ఏది కావాలన్నా గ్రామ సచివాలయాలే చేసి పెడతాయి.
– ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ నియామకం.
చదువుకున్న, సేవా దృక్పథం ఉన్నవారిని వాలంటీర్లుగా నియమిస్తాం. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాము. గ్రామ సచివాలయానికి అనుసంధానంగా వాలంటీర్లు పని చేస్తారు. ఆ 50 ఇళ్లకు సంబంధించి ఏం కావాలన్నా, ఆ వాలంటీర్లు చేసి పెడతారు. లంచాలు, సిఫార్సులు ఉండవు. కులం, మతం ఏదీ చూడరు.
– ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లు.. ఆర్టీసీ నడిపే నిర్వహించే ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనాలు కార్లలో యువతకు ప్రాధాన్యం. ప్రభుత్వం ద్వారా ఆదాయం వచ్చే ప్రతి కాంట్రాక్ట్ నిరుద్యోగ యువతకే.
– వారు కార్లు, బస్సులతో పాటు, ఇంకా ఏమైనా కొనుక్కుంటే సబ్సిడీ.
– వాటన్నింటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు.
– పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం.
– అదే విధంగా పరిశ్రమలకు కూడా చేయూతనిచ్చే విధంగా జిల్లా కేంద్రం యూనిట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు.
ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలు, వాటి అవసరాలకు అనుగుణంగా యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ.
– ప్రత్యేక హోదా సాధన.
హోదా వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే అందుకు మీ అందరి సహకారం కావాలి.
కాబట్టి 25 మంది ఎంపీలను గెలిపిస్తే, వారికి తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు తోడై, మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వస్తే.. రాష్ట్రానికి హోదా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అందుకే మన మద్దతు అవసరం ఉంటుంది. ఆ తరుణంలో హోదాకు సంతకం పెడితేనే మద్దతు ఇస్తాం.
ఆ విధంగా ప్రత్యేక హోదా సాధిద్దాము. ఒకసారి హోదా వస్తే పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు వస్తాయి. తద్వారా ఉద్యోగాల విప్లవం వస్తుంది. దాంతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది.
మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో ఇవన్నీ చేయగలుగుతానన్న నమ్మకం నాకుంది.
గ్రామాలకు మూటల డబ్బులు
ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు పెరుగుతాయని, ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
అందుకే ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.
వారికి ఇవన్నీ వివరించండి
‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, ఫీజులు చూస్తే లక్షల్లో ఉండగా, ప్రభుత్వం మాత్రం ఇచ్చేది అరకొరగా ఉందని, అందుకే పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి. అందుకే వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.
‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలందలేదని కూడా గుర్తు చేయండి’.
‘వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.
నవరత్నాలు
నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.
వ్యవస్థ మారాలి
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.
పార్టీ అభ్యర్థుల పరిచయం
ఒంగోలు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు, పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బాలినేనికి మంత్రి పదవి
బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని గెలిపిస్తే, ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రిని చేస్తానని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన జననేత, అందరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.