ASBL Koncept Ambience

పార్వతీపురం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌

పార్వతీపురం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌

రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయలేదని, ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారని, రైతులు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయని చంద్రబాబు, వారిని మోసం చేశారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో డ్రామాలు, మోసాలు చేశారని, మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన చర్యలున్నాయని జననేత గుర్తు చేశారు. 

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఉదయం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

జిల్లాకు పెద్ద సున్నా

అయిదేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలన చూశామని, ఆయన హయాంలో విజయనగరం జిల్లాకు ఏం చేశారని చూస్తే పెద్ద సున్నా కనిపిస్తుందని, 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడో మనందరికీ తెలుసని, ఇప్పుడు మళ్లీ అలాంటి డ్రామాలు, మోసాలే కనిపిస్తున్నాయని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. 

విజయనగరం–వైయస్సార్‌

విజయనగరం జిల్లాకు నాడు మహానేత వైయస్సార్‌ హయాంలోనే న్యాయం జరిగిందని, తోటపల్లి ప్రాజెక్టు అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. రూ.450 కోట్ల ఆ ప్రాజెక్టులో రూ.400 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90 శాతం పనులు ఆయన పూర్తి చేయగా, మిగిలిన 10 శాతం పనులు చంద్రబాబు పూర్తి చేయలేదని తెలిపారు. అందుకే 1.25 లక్షల ఎకరాలకు గానూ ఇప్పుడు 80 వేల ఎకరాలకు మించి నీరందడం లేదని చెప్పారు. ఒడిసాతో వివాదం ఉండడంతో ఎవరూ జంఝావతి ప్రాజెక్టు చేపట్టలేదని, కానీ ఆ మహానేత దాన్ని చేపట్టి రబ్బర్‌ డ్యామ్‌ కట్టారని వెల్లడించారు. 

చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు

చంద్రబాబునాయుడు మాటిమాటికి స్పెషల్‌ ఫ్లైట్‌లు వేసుకుని చెన్నై, బెంగళూరు వెళ్తారని, ఇంకా సరిపోదు అనుకుంటే కాఫీ తాగడానికి సాయంత్రం రాహుల్‌గాంధీ దగ్గరకు కూడా పోతాడని, కానీ అదే స్పెషల్‌ ఫ్లైట్‌ వేసుకుని పక్కనే ఉన్న ఒడిసా చీఫ్‌ మినిస్టర్‌ దగ్గరకు మాత్రం పోనే పోడని జననేత ఆక్షేపించారు.  ఆ దిశలో చంద్రబాబు చొరవ చూపించి ఉంటే, జంఝావతి, వంశధార ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఈ ప్రాంత రైతుల భూములు సశ్యశ్యామలం అయ్యేవని స్పష్టం చేశారు. 

స్థానిక సమస్యలు

ఇదే పార్వతీపురం పురపాలక సంఘంలో తాగనీటి సమస్య తీవ్రంగా ఉందని, నాగావళి నదిలో నేలబావులు పాడై పోతే ఈ నాలుగున్నర ఏళ్లలో పట్టించుకున్న వారే లేరని గుర్తు చేశారు. పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని చెప్పారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులు

పార్వతీపురం ప్రాంతంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువని, దారి పొడవునా పాదయాత్రలో వారిని చూశానని, వారంతా తన దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారని, సమస్యలు ప్రస్తావించారని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు. కాగా, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ వారి సమస్యను పట్టించుకోలేదని, పైగా ఆ సంస్థ ఆస్తులను చంద్రబాబుతో పాటు, ఆయన బినామీలు కాజేశారని ఆరోపించారు. 

అందరి బాధలు చూశా 

 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి కుటంబం పడుతున్న ఆవేదన విన్నానని, ప్రతి కుటుంబం పడుతున్న కష్టాన్ని కళ్లతో చూశానని చెప్పారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రతి ఒక్కరికీ ఇవాళ, భరోసా ఇస్తున్నానని, అదే ‘నేను ఉన్నాను’ అని జననేత ప్రకటించారు. 

రుణమాఫీ మోసం

రుణాలు మాఫీ కాక, ఇస్తానన్న రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోక, ఆ ఇచ్చే అరకొర కూడా మోసం చేసేందుకు ఎన్నికల తేదీ వచ్చేంత వరకు ఆ నాలుగో దఫా, అయిదో దఫాను కూడా వాయిదా వేసుకుంటూ వచ్చి, తీరా ఎన్నికల తేదీ వచ్చేటప్పటికి మాత్రమే ఆ డబ్బులు డిపాజిట్‌ చేయాలని చెప్పిన చంద్రబాబు మోసం చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. అదే సొమ్ము ముందే ఇచ్చి ఉంటే కనీసం రైతులకు వడ్డీ అయినా సరిపోయి ఉండేదని స్పష్టం చేశారు. 

గిట్టుబాటు ధర లేదు

ఇవాళ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని, ఏ పంట తీసుకున్నా సరే.. వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, వేరుశనగ, అరటి, టమోటా.. ఇలా ఏ పంట తీసుకున్నా ఏ ఒక్క పంటకూ ఈ 5 సంవత్సరాలలో గిట్టుబాటు ధర రాలేదని గుర్తు చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే అని, అయితే తన సొంత కంపెనీ హెరిటేజ్‌ లాభాల కోసం చంద్రబాబు దళారి అయి, వారికి కెప్టెన్‌ అయ్యారని ఆరోపించారు. 

అసైన్డ్‌ భూములు లాక్కుంటున్నారు

ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు చివరకు కాపుల కులాల పట్ల చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తున్నారని, పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను అత్తగారి సొత్తు అయినట్లు, ఇష్టం వచ్చినట్లుగా బలవంతంగా లాక్కుంటున్నారని ఆక్షేపించారు. 

ఎన్నికలు వచ్చేసరికి.. 

ఎన్నికలు వచ్చే సరికే ఓట్ల కోసం మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు రకరకాల సినిమాలు, డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. వాటిని ప్రజలంతా గుర్తించారని అన్నారు.

ప్రజలు–కష్టాలు 

తమకు రుణాలు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు రావడం లేదని కౌలు రైతులు పడుతున్న కష్టాలు, బాధలు చూశానని, పిల్లలను స్కూల్‌కు పంపాలంటే తల్లిదండ్రులు పడుతున్న బాధలు చూశానన్న శ్రీ వైయస్‌ జగన్, ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబునాయుడు దగ్గరుండి నీరు గారుస్తూ మూసేయిస్తున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదని, పుస్తకాలు టైమ్‌కు ఇవ్వడం లేదని, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని.. ఇక ఇవే స్కూళ్లలో మరుగుదొడ్లు ఉండవని, ప్రహరీలు ఉండవని, ఆ విధంగా చంద్రబాబునాయుడు వాటిని నీరు గారుస్తూ పిల్లలందరినీ తన బినామీ సంస్థ నారాయణకు పంపించే కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు.  

ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు పాలన గురించి గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు ఆవేదనగా చెబుతున్న మాటలు విన్నానని, వాళ్ల పిల్లలను ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, ఎంబీఏలు, ఎంసీఏలు ఏ పెద్ద చదువులు చదివించాలన్నా కూడా వారు  అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని, ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్ప తమ పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు.  

సమయానికి 108 రాక, ఆరోగ్యశ్రీలో జబ్బులు కవర్‌ కాక, ప్రభుత్వ ఆస్పత్రులు అన్యాయమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులలో కనీసం డాక్టర్లు కూడా ఉండకపోవడం, పక్షవాతం వంటి రోగాల బారిన పడిన రోగులు కుర్చీలు, మంచాలకే పరిమితమైనా కూడా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉండడం దారుణమని అన్నారు.

ఉపాధ్యాయులు, వీఏఓలు, మధ్యాహ్న భోజనం పథకం అక్కాచెల్లెమ్మలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, ఉద్యోగాలు పోగొట్టుకున్న కాంట్రాక్ట్‌ వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు.. వీళ్లందరూ జీతాలు పెంచమని అడుగుతుంటే వాళ్ల కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని అన్నారు. 

ప్రభుత్వం ఏర్పడినప్పుడు లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్‌ కమిటీ చెప్పడంతో, ఉద్యోగాలు రిలీజ్‌ అవుతాయేమో, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయేమో, గవర్నమెంట్‌ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి, డిగ్రీలు చేత పుచ్చుకున్న పిల్లలు ఆశగా ఎదురు చూస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. అయినా నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా కూడా ఆ పరీక్షలు రాయాలన్న చిత్తశుద్ధితో కోచింగ్‌ సెంటర్లకు వెళ్తూ వేలకు వేలు తగలేస్తున్న పిల్లల బాధలు కూడా చూశానని చెప్పారు. 

చివరకు ఆ ఉద్యోగాలు వచ్చేందుకు అంతో ఇంతో అవకాశం ఉన్న ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు తన స్వార్ధం కోసం తాకట్టు పెట్టిన పరిస్థితి కూడా చూశానని తెలిపారు. 

జన్మభూమి కమిటీలు 

గ్రామాలలో జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయని, ఆ మాఫియా సామ్రాజ్యంలో పెన్షన్‌ కావాలన్నా లంచం, రేషన్‌కార్డు కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం.. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇస్తే తప్ప పనులు జరగని పరిస్థితులను చూశానని చెప్పారు.  

ఈ రాష్ట్రంలో ఈ అయిదేళ్లుగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం పడుతున్న కష్టాలను విన్నానని, అందుకే అందరికీ భరోసా ఇస్తున్నానని అన్నారు.

ఎన్నికలు–చంద్రబాబు

ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చేయని డ్రామాలు ఉండవని,  చెప్పని అబద్ధం ఉండదని, చేయని మోసం ఉండదని జననేత గుర్తు చేశారు.  ఎన్నికలు వచ్చేసరికి గ్రామాలకు మూటుల మూటల డబ్బులు పంపిస్తాడని, ప్రతి చేతిలో 3 వేల రూపాయల డబ్బులు పెట్టి అందరినీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడని, అలా మరో మోసం చేస్తాడని చెప్పారు.

ఈరోజు తమ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదని, ఆయనతో మమేకమైన ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ5తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లతో యుద్ధం చేస్తున్నామని వెల్లడించారు.  ఇవాళ ధర్మానికి–అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. 

అందుకే ప్రతి ఒక్కరూ గ్రామాలల్లో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ  ప్రతి తాత, ప్రతి రైతును కలవాలని కోరారు.

ఇవన్నీ వివరించండి 

‘ప్రతి అక్కకూ చెప్పండి. అక్కా, ఎన్నికల వేళ చంద్రబాబునాయుడు గారిచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దక్కా, 20 రోజులు ఓపిక పట్టక్కా, ఆ తర్వాత మనందరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు, ప్రతి అక్క చేతిలో 15 వేలు చేతిలో పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి’. 

‘ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దక్కా. 20 రోజులు ఓపిక పట్టక్కా. ఈరోజు మన పిల్లలను ఇంజనీర్లుగానూ, డాక్టర్లుగానూ, కలెక్టర్‌ వంటి ఏ చదువులైనా కూడా మన పిల్లలను ఇవాళ అప్పులపాలు కాకుండా చదివించే పరిస్థితి లేదక్కా, మన పిల్లలు ఇవాళ చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందక్కా, ఇటువంటి పరిస్థితి పోవాలక్కా, చంద్రబాబు ఇచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దక్కా. 20 రోజులు ఓపిక పట్టక్కా. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగానూ, డాక్టర్లుగానూ, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా ఫరవాలేదు అన్న ఉచితంగా చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్క దగ్గరకు వెళ్లి చెప్పాలి. ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి’.

‘అక్కా చంద్రబాబు ఇచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దక్కా. అందరం కూడా పొదుపు సంఘాలలో ఉన్నాం. పొదుపు సంఘాలలో ఉన్న అందరం చంద్రబాబునాయుడిని నమ్మాం. 5 సంవత్సరాలు చంద్రబాబునాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాడేమో అని చెప్పి ఎదురుచూశాం. ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ఎగ్గొట్టాడు. ఇంతకు ముందు సున్నా వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. సున్నా వడ్డీ అనే పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు అని చెప్పి ప్రతి అక్కకూ చెప్పండి. ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి’. 

‘చంద్రబాబు నాయుడు గారిచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దని పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. 20 రోజుల ఓపిక పట్టక్కా. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి ఎన్నికల నాటి వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలను అన్న నాలుగు దఫాల్లో నేరుగా అక్కా చెల్లెమ్మల చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి’.

‘ప్రతి అక్కకూ ఆ మాటలు చెబుతూ ఇంకా చెప్పండి. అక్కా అంతే కాదక్కా, అన్న ముఖ్యమంత్రి అయ్యాక, మళ్లీ సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాలు తీసుకొస్తా ఉన్నాడు, బ్యాంకుల దగ్గరకు మనం గర్వంగా వెళ్లొచ్చు, బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు మనం పొందవచ్చు. ఆ రుణాలన్నింటికీ వడ్డీ అన్నే కడతాడక్కా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కనూ, చెల్లినీ లక్షాధికారిని చేసే రోజులు, లక్షాధికారిని చేయాలని చెప్పి, ఆ రోజుల్లో ఆ దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారి పరిపాలనలో రాజన్న రాజ్యం చూశాము, మళ్లీ ప్రతి అక్కను, ప్రతి చెల్లిని లక్షాధికారిని చేసే రోజులు ఆ రాజన్న కొడుకు జగనన్నతోనే సా«ధ్యమూ అని చెప్పి ప్రతి అక్కకూ చెప్పండి. ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి’.

‘పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఆ అక్కలకు చెప్పండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి అక్క దగ్గరకు వెళ్లి చెప్పండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు మధ్య పేదరికంలో ఉన్న అక్కలకు చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే 3 వేల రూపాయలకు మోసపోవద్దక్కా. 20 రోజులు ఓపిక పట్టక్కా. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అక్కా. ఆ తర్వాత అన్న వైయస్సార్‌ చేయూత అన్న పథకం తీసుకొస్తాడక్కా. అన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి అక్క చేతిలో 75 వేల రూపాయలు నాలుగు దఫాల్లో చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి’.

‘గ్రామాల్లో ఉన్న ప్రతి రైతు దగ్గరకు వెళ్లండి. అన్నా చంద్రబాబునాయుడు గారిని నమ్మాం. ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కానీ ఆయన చేస్తున్న రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నా అని చెప్పండి. ఆ ప్రతి రైతుకు చెప్పండి. 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా గిట్టుబాటు ధర రాలేదని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టన్నా. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి’. 

‘అన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికే ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం 12 వేల 500 రూపాయలు చేతిలో పెడతాడని చెప్పి, అక్షరాలా 50 వేల రూపాయలు పెట్టుబడి కోసం అన్న ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతుకు చెప్పండి. అంతే కాదు ఆ రైతులకు చెప్పండి. అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు. వాటికి గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘ప్రతి అవ్వ, తాత దగ్గరకు వెళ్లండి. అవ్వా ఎన్నికలు వచ్చాయి. మీకు పెన్షన్‌ ఎంత వస్తుందని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని చెబుతుంది. లేదా వెయ్యి రూపాయలు వచ్చేవని చెబుతుంది. అప్పుడు అడగండి అవ్వా, ఎన్నికలే రాకపోయి ఉంటే, జగనన్న చెప్పి ఉండకపోతే, చంద్రబాబు నాయుడు ఈ రెండు వేలు ఇచ్చే వాడా అని అడగండి. అవ్వా చంద్రబాబు ఇచ్చే 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టవ్వా, నీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు ఇచ్చే పెన్షన్‌ మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వ, తాతకు చెప్పండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ తీసుకొని పోవాలని, ప్రతి అక్క దగ్గరకూ తీసుకుని పోవాలని, ప్రతి చెల్లెమ్మ దగ్గరకు తీసుకునిపోవాలని, ప్రతి అన్నకూ చెప్పాలని, ప్రతి అవ్వకూ తాతకూ చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలని, విశ్వసనీయత అన్న పదానికి అర్ధం రావాలని, ఎన్నికలప్పుడు మోసం చేస్తూ మాటలు మాట్లాడడం, ఎన్నికలైపోయన తర్వాత ప్రజలను మోసం చేసే పరిస్థితి మారిపోవాలని జననేత ఆకాంక్షించారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలజింగి జోగారావుతో పాటు, పార్టీ అరకు ఎంపీ అభ్యర్థి గొడ్డేటి మాధవిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :