ASBL Koncept Ambience

పిడుగురాళ్లలో బహిరంగ సభలో వైయస్‌ జగన్‌

పిడుగురాళ్లలో బహిరంగ సభలో వైయస్‌ జగన్‌

‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సాగర్‌ నుంచి నీరు తీసుకువస్తా. మిల్లర్ల మీద అక్రమంగా పెట్టిన కేసులు, వారికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తాను. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నుంచి ఆ సొమ్ము పూర్తిగా కక్కిస్తాను’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

నవరత్నాలు పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పసుపు–కుంకుమ పథకాలు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చేసరికి పలు స్కీమ్‌లు అమలు చేస్తున్న చంద్రబాబు, మళ్లీ మోసం చేస్తున్నారని, చంద్రబాబుకు వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా ఉందని, కాబట్టి చంద్రబాబు ఒకసారి మోసాలు గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు. 

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్లలో బుధవారం మధ్యాహ్నం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

దారుణ పాలన

గురజాల పక్కనే సాగర్‌ ఉన్నా, నియోజకవర్గంలో చాలా చోట్ల తాగడానికి నీళ్లు లేవని, అయినా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఏ పనీ చేయలేదని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. కానీ ఎన్నికలు రావడంతో ఒక నెల ముందు చంద్రబాబు కొడుకు మంత్రి లోకేష్‌ వచ్చి, బుగ్గవాగు నుంచి కృష్ణా నీరిస్తున్నామంటూ టెంకాయ కొట్టారని చెప్పారు. అలా ఎన్నికల ముందు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని, అంత దారుణపాలన ఇక్కడ సాగుతోందని పేర్కొన్నారు.

గిట్టుబాటు ధర లేదు

గురజాల నియోజకవర్గంలో రైతులకు సాగు నీరు, తాగు నీరుండదని, అంతో ఇంతో పండిన పంటలకు మరోవైపు గిట్టుబాటు ధరలు అస్సలు ఉండవని జననేత గుర్తు చేశారు. పత్తి కనీస మద్దతు ధర రూ.5450 కాగా, రూ.5 వేలు కూడా రావడం లేదని, అలాగే మిర్చికి రూ.10 వేలు రావాల్సి ఉన్నా, రూ.6 వేలు కూడా రావడం లేదని తెలిపారు. 

స్థానిక సమస్యలు

గురజాల నియోజకవర్గంలో 70 గ్రామాలలో తాగే నీరు లేదని, ఇక పిడుగురాళ్లలో లక్ష మంది ఉన్నా కనీసం 100 పడకల ఆస్పత్రి కూడా లేదని, దీంతో ఎవరికి ఏ ఆపద వచ్చినా గుంటూరు వెళ్లాల్సిందే అని చెప్పారు. ఫలితంగా చాలా మంది రోగులు చనిపోతున్నారని ఆవేదన చెందారు. 

ఇక్కడ అభివృద్ధి అంటే?

పిడుగురాళ్ల, గురజాలలో జరిగిన అభివృద్ధి ఏమిటి అంటే, యరపతినేని శ్రీనివాసరావు అనే దిక్కుమాలిన ఎమ్మెల్యే మైనింగ్‌ వ్యాపారం పేరుతో గనులు దోచుకుంటున్నారని జననేత ఆక్షేపించారు. ఇక్కడ మైనింగ్‌ మాఫియా జరిగిందని కోర్టు రూ.100 కోట్ల జరిమానా వేసిందని ఆయన తెలిపారు. ఆ మాఫినాను అరికట్టాల్సిన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఇదే ఎమ్మెల్యేతో కలిసి భాగం పంచుకుంటున్నారని ఆరోపించారు.

ఆ రూ.100 కోట్లు రికవరీ చేయాలని కోర్టు ఆదేశిస్తే, సీఐడీతో చంద్రబాబు దర్యాప్తు చేయించారని, ఎమ్మెల్యేను వదిలి చిన్న చిన్న కంపెనీలు, వ్యాపారులు, మిల్లర్లకు  నోటీసులు పంపి ఫైన్‌ కట్టమంటున్నారని చెప్పారు.

దౌర్జన్యాలు

ఇదే చంద్రబాబు హయాంలో ఏ స్థాయిలో ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయో వివరిస్తూ.. సినిమాహాళ్ల యజమానులు కూడా కప్పం కట్టాల్సి వస్తోందని, లేకపోతే వాటిని మూసేయిస్తున్నారని తెలిపారు. క్లబ్బులు పని చేస్తున్నాయని, రౌడీ రాజ్యం, మాఫియా రాజ్యం సాగుతోందని చెప్పారు.

గురజాలలో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాయన్న జననేత, మరోవైపు రాష్ట్రంలో పరిస్థితి చూడాలని అన్నారు. 

ఏం చూశాం?

ఈ 5 ఏళ్లలో మనం చూసింది మోసం తప్ప మరేదీ కాదని.. చంద్రబాబు పాలనలో మనం చూసింది మోసం, అబద్ధాలు, అన్యాయం, అవినీతి అంటూ, వాటన్నింటిపై ఒక్కసారి ఆలోచించాలని కోరారు. 

వైయస్సార్‌సీపీ వాగ్ధానాలు

‘మన వాగ్ధానాలు మనం చేశాం. 21 నెలల క్రితం పార్టీ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. పాదయాత్రలో వాటిని ప్రతి నిరుపేద, రైతు దగ్గరకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం. వారి సూచనలు, సలహాలకు అనుగుణంగా నవరత్నాలులో మార్పు చేశాం’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

మరి చంద్రబాబు వాగ్ధానాలు?

‘ఇక చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు ఒక మంచి మనసు నుంచి కాకుండా, కేవలం భయం నుంచి పుట్టుకొచ్చాయి. మళ్లీ 5 ఏళ్లు మోసం చేసేందుకు ఆయన వంచనతో వాగ్ధానాలు చేస్తున్నారు’ అని జననేత స్పష్టం చేశారు.

పథకాలు కాపీ

చంద్రబాబు మాటలు నమ్మి సర్వం పోగొట్టుకున్న రైతులకు మేలు చేసేందుకు రైతు భరోసా ప్రకటించాయని, రైతులకు పెట్టుబడిగా నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని, 21 నెలల క్రితం మహానేత వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించామని గుర్తు చేశారు.

కాగా, చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందు తమ పథకాలు కాపీ కొడుతూ ‘అన్నదాన సుఖీభవ’ ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లు మోసం చేశాక, మళ్లీ సిగ్గు లేకుండా అదే పని చేస్తున్నారని ఆక్షేపించారు.

అక్కా చెల్లెమ్మలు

పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారని పేర్కొన్నారు. అందుకే వారికి న్యాయం చేసేందుకు, వారికి ఎన్నికల నాటికి ఉన్న మొత్తాన్ని నేరుగా వారికే నాలుగు దఫాల్లో అందిస్తామని మాట ఇచ్చామని, ఆ విధంగా వారికి భరోసా ఇచ్చామని.. ప్రతి అక్కా, ప్రతి చెల్లికి భరోసా ఇస్తూ నడిచామని తెలిపారు.

పసుపు–కుంకుమ

కానీ చంద్రబాబు ఇదే పొదుపు సంఘా అక్కా చెల్లెమ్మలను మోసం చేసి సున్నా వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టాడని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో ‘పసుపు–కుంకుమ’ పేరుతో డ్రామా చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ పథకంలో చంద్రబాబు ఇస్తున్న మొత్తం రూ.6 వేల కోట్లు మాత్రమే కాగా, వారికి ఇప్పుడు నిజానికి రూ.28 వేల కోట్ల రుణాలున్నాయని గుర్తు చేశారు. 

ఎంత వ్యత్యాసం? 

కాబట్టి మనం (వైయస్సార్‌సీపీ) ఇస్తామన్న రూ.28 వేల కోట్లు ఎక్కడ? ముష్టి వేస్తున్నట్లు చంద్రబాబు ఇస్తున్న రూ.6 వేల కోట్లు ఎక్కడ? అన్నది ఒక్కసారి ఆలోచించాలని కోరారు. 

నిరుద్యోగ భృతి మోసం

రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లకు ఉద్యోగం లేక ఉపాధి కల్పించకపోతే నెలకు రూ.2 వేల భృతి ఇస్తానన్న మాట నిలుపుకోలేదని చెప్పారు. అయితే ఎన్నికలు రావడంతో పిల్లలకు సినిమా చూపిస్తున్నాడని, కేవలం 3లక్షల మందికి నెలకు రూ.1000 చొప్పున అది కూడా మూడు నెలలకు మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్నారని, కానీ ఎప్పటి నుంచో అందరికీ ఇస్తున్నట్లు టీవీల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.

హోదా–వెన్నుపోటు

అధికారం చేపట్టగానే హోదా తెస్తామని చెప్పి మోసం చేశాడని, అంతే కాకుండా ఖాళీగా ఉన్న 1.42 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, మరోవైపు హోదా రాకుండా చేసి పిల్లలకు వెన్నుపోటు పొడిచాడని, దీంతో యువత చాలా నష్టపోయిందని తెలిపారు.

ఇదీ నష్టం !

ఒక వేళ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ఉంటే, నెలకు కనీసం రూ.15 వేల చొప్పున, 5 ఏళ్లలో వారు దాదాపు రూ.9 లక్షలు సంపాదించుకునే వారని, కానీ వారిని మోసం చేసి, ఇప్పుడు టీవీల్లో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.  

మళ్లీ మోసాలు

ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు అన్ని రకాల స్కీమ్‌లు చెబుతున్నాడని, మళ్లీ మోసం చేస్తున్నాడని జననేత గుర్తు చేశారు. చంద్రబాబుకు వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, ప్రచారం చేసేందుకు ఆయనకు అమ్ముడుపోయిన ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, ఆయనకు అమ్ముడు పోయిన ఇతర మీడియా ఉందని తెలిపారు.

గుర్తు చేసుకోండి

చంద్రబాబు మోసాలు గుర్తు చేసుకోవాలన్న ఆయన, 1995, ఆ తర్వాతి ఘటనలను ప్రస్తావించారు.

‘1994 ఎన్నికల్లో టీడీపీ రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం, వ్యవసాయానికి 50 రూపాయలకు హెచ్‌పీ విద్యుత్‌ సరఫరా వంటి హామీలు ఇచ్చి గెల్చింది. కానీ ఏడాది తర్వాత 1995లో చంద్రబాబు అధికారం చేపట్టగానే సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేశారు. కిలో బియ్యం ధర రూ.5.25 చేశారు. ఇక వ్యవసాయంలో హెచ్‌పీ విద్యుత్‌ ఛార్జీని ఏకంగా రూ.650 చేశారు’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

రోజుకో పుకారు 

ఈ ఎన్నికల్లో కూడా కుట్ర చేస్తున్నారని, చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలుసని.. అందుకే ప్రతి రోజు ఒక పుకారు సృష్టిస్తున్నారని అన్నారు. ఆ పుకార్లపై చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో చర్చలు పెడుతున్నారని, ఆ విధంగా ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని, వారిని మభ్య పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని,  ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని  గుర్తు చేయండి. అందుకే వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమ పేరుతో చేస్తున్న డ్రామాలకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి’.

‘వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. రుణ మాఫీ కోసం చంద్రబాబు ఇచ్చిన మొత్తం కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్పండి. అలాగే సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి’.

‘అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 ఇస్తాడని, అలా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు మీ చేతిలో పెడతాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామాలలో ఇంటి కోసం ఎదురు చూస్తున్న ప్రతి నిరుపేదను కలవండి. వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. మళ్లీ పేదలకు ఇళ్లు రావాలంటే, మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే అది జగనన్నకే సాధ్యమని, ఆయనే రాజన్న రాజ్యంలో మాదిరిగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాడని చెప్పండి’. అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. 

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

ఒక్క అవకాశం ఇవ్వండి

‘పక్కనే నాగార్జునసాగర్‌ ఉంది. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడికి తప్పనిసరిగా సాగర్‌ నీరు తీసుకువస్తాను. అలాగే మిల్లర్ల మీద అక్రమంగా పెట్టిన కేసులు, వారికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తాను. అంతే కాకుండా యరపతినేని నుంచి ఆ సొమ్ము (రూ.100 కోట్లు) కక్కిస్తాను’ అని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. 

పార్టీ అభ్యర్థుల పరిచయం

గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసు మహేష్‌రెడ్డితో పాటు, పార్టీ నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులును సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :