ASBL Koncept Ambience

పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో జననేత

పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో జననేత

చంద్రబాబునాయుడుకు ఒకసారి ఓటేసి మోసపోయామని, మళ్లీ ఆ పొరపాటు చేసి మోసపోవద్దని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈసారి ఆయనకు ఓటేస్తే ఇక ప్రభుత్వ పాఠశాలలు ఏవీ ఉండవని, గ్రామాల్లోనూ నారాయణ విద్యా సంస్థలే ఉంటాయని, వాటిలో ఎల్‌కేజీకే లక్ష రూపాయలు వసూలు చేస్తారని, ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయని, అన్నీ ఛార్జీల్లో వీరబాదుడే అని, పెన్షన్లన్నీ తీసేస్తారని, రేషన్‌ కార్డులన్నీ కోసేస్తారని ఆయన చెప్పారు. ఇళ్లూ భూములు ఏవీ మిగలవని, దేన్నీ వదిలిపెట్టకుండా దోచేస్తారని, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు అందరి జీవితాలను శాసిస్తాయని, రైతులు, మహిళలకు ఏ రుణాలూ అందవని పేర్కొన్నారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 సర్వీసులు పని చేయవని, అన్ని సంక్షేమ పథకాలకు ఇక మంగళం పాడినట్లే అని జననేత అన్నారు.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో శుక్రవారం సాయంత్రం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

షుగర్‌ ఫ్యాక్టరీలు

సుదీర్ఘంగా 3648 కి.మీ పాదయాత్ర నగరి నుంచి కూడా సాగిందని, ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి బాధ, ప్రతి కష్టం గుర్తుందని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీ మూతబడిందని, దాంతో 360 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఫ్యాక్టరీ మూసేయడంతో రైతులు అనివార్యంగా ప్రైవేటు రంగానికి చెందిన మయూరి, ఇంద్ర చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకు అమ్మాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు దగ్గరుండి సహకార రంగంలోని రేణిగుంట, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయించారని తెలిపారు.

మామిడి రైతులు

ఇదే జిల్లాలో మామిడి రైతులు ఎక్కువే అని, వారిని కూడా చంద్రబాబు పీల్చి పిప్పి చేశారన్న జననేత, ఇక్కడి గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ రెండూ టీడీపీకి చెందిన వారివే అని గుర్తు చేశారు. ఒకటి ఎంపీకి సంబంధించింది కాగా, మరొకటి ఎమ్మెల్యేకు చెందిన కంపెనీ అని చెప్పారు. ఆ రెండు కంపెనీలు దేశంలోనే ఎంతో పేరున్న తోతాపురి మామిడి రైతులకు అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. తోతాపురి మామిడికి రూ.16 వేలు వస్తే కానీ గిట్టుబాటు కాదని, కానీ ఏటా దిగుబడి సమయంలో రెండు కంపెనీలు కుమ్మక్కై రైతులకు రూ.6 వేలు కూడా చెల్లించడం లేదని ఆవేదన చెందారు. 

చిత్తూరు డెయిరీ 

ఇదే జిల్లాలో తనను కలిసిన రైతులు, మినరల్‌ వాటర్‌ స్థాయిలో లీటరు పాలకు కేవలం రూ.23 మాత్రమే దక్కుతున్నాయని చెప్పారని, అందుకు ప్రధాన కారణం చిత్తూరు డెయిరీ మూతబడడమే అని, హెరిటేజ్‌కు నష్టం వస్తుందని దాన్ని దగ్గరుండి చంద్రబాబు నీరు గార్చారని ఆక్షేపించారు.

గాలేరు–నగరి

జిల్లాలోని గాలేరు నగరి ప్రాజెక్టు 25800 ఎకరాలకు సాగు, తాగు నీరందిస్తుందని, దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో వేణుగోపాల్‌సాగర్‌ చేపట్టి గతంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారని జననేత తెలిపారు. కానీ మిగిలిన పనుల అంచనాలు దారుణంగా పెంచి సీఎం రమేష్‌కు ఇచ్చారని, అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. 

నగరి–మహానేత

చిత్తూరు జిల్లాలో మరమగ్గాల మీద ఆధారపడి దాదాపు 10 వేల మంది కార్మికులు ఉన్నారని, నగరిలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తే వారికి మేలు జరిగేదని, కానీ చంద్రబాబు ఆ పని చేయలేదని వెల్లడించారు.

కాగా, నాడు మహానేత వైయస్సార్‌ ఇక్కడ మురుగునీటి పారిశుధ్య కేంద్రం (అఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) ఏర్పాటు చేసినా, దాన్ని చంద్రబాబు ప్రారంభించలేదని, ప్లాంట్‌ ప్రారంభిస్తే పేరు వైయస్సార్‌కు వస్తుందని చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు. 

రోజాపై కక్ష

‘మీ (నగరి) ఎమ్మెల్యే నా పక్కనే ఉంది. నా సోదరి. రాజకీయాల్లో ఎవరైనా ఆడవారిని ప్రోత్సహిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఆమె మహిళా సమస్యల గురించి గట్టిగా మాట్లాడిందని ఏ మాత్రం గౌరవం లేకుండా, మహిళ అని కూడా చూడకుండా సభ నుంచి సస్పెండ్‌ చేయించారు’ అని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

5 ఏళ్లలో ఏం చూశాం?

ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మోసం, మోసం, మోసం.. ఇవే చూశామని, ఇంకా అవినీతి, దుర్మార్గాన్ని గ్రామస్థాయికి కూడా తీసుకుపోవడం చూశామని చెప్పారు. 2014లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే, అన్ని రకాలుగా మోసపోయామని, నష్టపోయామని గుర్తు చేశారు. 

ఇప్పుడు మళ్లీ ఓటేస్తే..

‘ఇప్పుడు కూడా పొరపాటున ఓటేస్తే.. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయిస్తాడు. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో 6 వేల స్కూళ్లు మూసివేయించాడు.

కాబట్టి మళ్లీ చంద్రబాబు ఓటేస్తే పేదలు ఎక్కడా బడికి పంపే పరిస్థితి ఉండదు. ప్రతి చోటా నారాయణ స్కూళ్లు మాత్రమే ఉంటాయి. వాటిలో ఎల్‌కేజీకే ఇప్పుడు రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. చంద్రబాబును మళ్లీ గెలిపిస్తే ఆ ఫీజు లక్ష రూపాయలకు చేరుతుంది’.

‘ఇక ఇంజనీరింగ్‌ ఫీజులు రూ.5 లక్షలు దాటుతాయి. ఇప్పటికే ఈ 5 ఏళ్లలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నులు, పెట్రోల్, డీజిల్‌ ధరలు, కుళాయి ఛార్జీలు బాదుడే బాదుడు. మళ్లీ ఓటేస్తే ఇక వీరబాదుడే’.

‘మళీ ఓటేస్తే, అధికారంలోకి రాగానే పెన్షన్‌ కార్డులు తీసేస్తాడు. రేషన్‌ కార్డులు కోసేస్తాడు. 2014కు ముందు రాష్ట్రంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, చంద్రబాబు వారిని 36 లక్షలకు తగ్గించాడు. అదే విధంగా రేషన్‌ కార్డులు కూడా తగ్గించాడు. కాబట్టి మళ్లీ ఓటేస్తే పెన్షన్‌ కార్డులు, రేషన్‌ కార్డులు మొత్తం తీసేస్తాడు’.

‘మీ ఇళ్లు, భూములు ఏవీ మిగలవు. ఇప్పటికే కొత్త భూసేకరణ చట్టం తెచ్చాడు. వెబ్‌లాండ్‌ పేరుతో భూరికార్డులు తారుమారు చేస్తున్నాడు. మన ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు, అడవులు ఇప్పటికే అంతంత మాత్రమే ఉన్నాయి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అవి ఏవీ ఉండవు. అన్నీ దోచేస్తారు’.

‘ఇప్పుడు ఇసుక లారీ రూ.40 వేలు కాగా, మళ్లీ చంద్రబాబు గెలిస్తే అది లక్ష రూపాయలవుతుంది. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను సృష్టించాడు. అవి ప్రతి పనికి లంచం తీసుకుంటున్నాయి. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మీరు గ్రామాల్లో ఏ సినిమా చూడాలో, ఏ టీవీ ఛానల్‌ చూడాలో, ఏ పత్రిక చదవాలో కూడా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. అలా అయితేనే మీకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇస్తారు’.

‘ఇప్పటికే ఆయన తన సినిమా మహానాయకుడు చూడాలంటున్నాడు. వాస్తవాలతో కూడిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల కాకుండా చూస్తున్నాడు’. 

‘కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ, 108, 104 సర్వీసులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండవు. పేదలకు ఇళ్లు ఇచ్చేది ఉండదు. 1994లో టీడీపీ తన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం పెట్టి గెల్చారు. కానీ ఆ తర్వాత 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక. బియ్యం ధర క్రమంగా పెంచి రూ.5 చేశాడు. మద్య నిషేధాన్ని ఎత్తివేశాడు. ఏకంగా 50 కంపెనీలు అమ్మేశాడు’.

‘రైతులు, పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాలందవు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో రైతులకు రుణాలు కూడా ఇవ్వరు. ఇప్పుడు ప్రకటిస్తున్న పథకాలు ఎన్నికల తర్వాత ఉండవు’.

‘మనుషులను చంపినా కేసులుండవు. గ్రామ స్థాయి నుంచి పైస్థాయి వరకు ఆయన పోలీసులే. ఇక మీడియా మేనేజ్‌మెంట్‌. అందుకే ఏదీ పేపర్లలో రాదు. టీవీల్లో కనిపించదు. కేసులు అసలే ఉండవు. ఆయనే చంపిస్తాడు. మళ్లీ బంధువులే చంపాడని ప్రచారం చేస్తాడు’.

‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏ పదవులు దక్కవు. గతంలో ఒక బీసీకీ జడ్జీ పదవి రాకుండా లేఖ రాశాడు. చంద్రబాబు చివరి మూడు నెలల్లో చూపిస్తున్న సినిమాలు, టీవీల్లో చేస్తున్న ప్రచారాలు చూసి నమ్మితే.. నర మాంసం తినే అందమైన రాక్షసిని నమ్మినట్లే’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

విశ్వసనీయత రావాలి

చంద్రబాబుకు ఒకసారి ఓటేసి మోసపోయామని, మళ్లీ మనం మోసపోవద్దన్న జననేత, ఈ వ్యవస్థలో మార్పు రావాలని, రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ రావాలని ఆకాంక్షించారు. మాట మీద నిలబడని నాయకుడు పదవి వీడి ఇంటికి పోవాలని, అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ వస్తాయని స్పష్టం చేశారు. 

రోజుకో సినిమా

మరో 14 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు రోజుకో సినిమా చూపించడంతో పాటు, కుట్ర చేస్తున్నాడని.. అవి రానురాను మరింత తీవ్రమవుతాయని చెప్పారు.

ఇక ప్రతి ఊరికి మూటల డబ్బు పంపి, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతాడని ఆరోపించారు.

గ్రామాలకు వెళ్లండి

అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలకు వెళ్లాలని, ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతుకు చంద్రబాబు మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ చెప్పండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే, ఏటా రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదివినా అన్న స్వయంగా చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’.

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లికి చెప్పండి. ఎన్నికలప్పుడు చంద్రబాబును నమ్మాం. కానీ ఆయన రుణమాఫీ చేయకుండా మోసం చేశాడని, సున్నా వడ్డీ రుణ పథకం ఎగ్గొట్టాడని గుర్తు చేయండి. కాబట్టి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమ పథకానికి అసలే మోసపోవద్దని చెప్పండి. ఒక  20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే ఎన్నికల నాటికి ప్రతి పొదుపు సంఘం మహిళకు ఉన్న మొత్తం రుణాన్ని నాలుగు దఫాల్లో వారి చేతికే ఇస్తాడని చెప్పండి. అలాగే సున్నా వడ్డీ రుణాలు మళ్లీ వస్తాయని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా వారి చేతుల్లోనే పెడతాడని చెప్పండి’.

‘ప్రతి రైతన్నకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఆగి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఏటా మే మాసంలోనే ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.12,500 ఇస్తాడని చెప్పండి. అలాగే ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాకుండా, వాటికి గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి. ఇంకా సున్నా వడ్డీ రుణాలు కూడా వస్తాయని చెప్పండి’.

‘ప్రతి అవ్వ, తాత దగ్గరకు వెళ్లండి. పెన్షన్‌ గురించి ఆరా తీయండి. అవ్వ సమాధానం చెప్పగానే అప్పుడు ఆ అవ్వను అడగండి. అవ్వా ఒకవేళ ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న ఇస్తానని చెప్పకుంటే చంద్రబాబు ఇప్పుడు ఈ రూ.2 వేలు ఇచ్చేవాడా? అని అడగండి. కాబట్టి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, 20 రోజులు ఆగి, మీ మనవడిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మీ పెన్షన్‌ను పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ప్రతి అన్నకు చెప్పండి. నాడు రాజన్న మాదిరిగా పేదల కోసం ఇళ్లు కడతాడని, నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తాడని చెప్పండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు. 

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు అందరికీ మేలు చేస్తాయని, కాబట్టి వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని, ప్రతి ఒక్కరికి వాటి ప్రయోజనాలు వివరించాలన్న జననేత, ఆ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

నగరి నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్‌.కె.రోజాతో పాటు, పార్టీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్పను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :