ASBL Koncept Ambience

ఎస్.కోట బహిరంగ సభలో వైయస్ జగన్

ఎస్.కోట బహిరంగ సభలో వైయస్ జగన్

టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్క 2004లో తప్ప, 30 ఏళ్ల పాటు నిరాటంకంగా ఆదరించి, గెలిపించిన ఎస్‌.కోట నియోజకవర్గంలో ప్రజలు మెచ్చుకునే కనీసం మూడు పనులైనా జరిగాయా? అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడి భీమిసింగి చక్కెర ఫ్యాక్టరీ మళ్లీ రూ.43 కోట్ల తీవ్ర నష్టాల్లో మునిగిందని, యథావిథిగా పరిశ్రమలన్నీ మూతబడుతున్నాయని ఆయన వెల్లడించారు. 4వ నెల అంటే, ఏప్రిల్‌ 30వ తేదీన జన్మించిన చంద్రబాబు.. ఆయన పుట్టిన తేదీ మహాత్యమో లేక.. నైజమో? తెలియదు కానీ ప్రజలను ఫూల్స్‌ను చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఒక్క మేలైనా జరిగిందా? అని ప్రశ్నించిన జననేత, అంతటా అవినీతి తప్ప, ఎక్కడా అభివృద్ధి లేదని స్పష్టం చేశారు. కాబట్టి మళ్లీ చంద్రబాబు పాలన కావాలా? అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

అన్నీ గుర్తున్నాయి

తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్ర ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి కూడా కొనసాగిందని, ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి సమస్య గుర్తుందని, వారి బాధలన్నీ చూశానని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. 

ఒక్కసారి ఆలోచించండి

మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశాక ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆదరిస్తే ఏం చేశారు?

టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్క 2004లో తప్ప, నిరాటంకంగా 30 ఏళ్ల పాటు, ఆదరించి, ఆశీర్వదించి గెలిపించిన ఎస్‌.కోట నియోజకవర్గంలో ప్రజలు మెచ్చుకునే కనీసం 3 పనులైనా జరిగాయా? అని జననేత ప్రశ్నించారు.

ఎల్‌.కోట, కొత్తవలస, వేపాడ మండలాల్లో నిరంతరం కరువే అని, ఇక్కడ చేరువలోనే రైవాడ రిజర్వాయర్‌ ఉన్నా తాగు, సాగు నీటికి కట కటే అని చెప్పారు. రైవాడ రిజర్వాయర్‌ నుంచి విశాఖ పారిశ్రామిక వాడకు నీరు తరలిస్తున్నారని, కానీ ఇక్కడి వారి గురించి పట్టించుకోవడం లేదన్న శ్రీ వైయస్‌ జగన్, మరి చంద్రబాబు గాడిదలు కాశాడా? అని నిలదీశారు.

పరిశ్రమల మూత

చంద్రబాబు వచ్చాక యథావిథిగా పరిశ్రమలు మూతబడుతున్నాయని చెప్పారు. 2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు, ఇక్కడి భీమిసింగి చక్కెర కర్మాగారాన్ని దగ్గరుండి మూసివేయించారని గుర్తు చేశారు. ఆ తర్వాత మహానేత వైయస్సార్‌ సీఎం కాగానే, దాన్ని తెరిపించగా, మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం కాగానే ఇదే కంపెనీ రూ.43 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. 

చేదెక్కుతున్న చెరుకు

చివరకు చెరుకు రైతులకు కూడా న్యాయం జరగడం లేదని, వారికి రూ.2600 కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. కానీ ఇదే చెరుకుకు ఉత్తరప్రదేశ్‌లో రూ.3150 «ధర ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఆ విధంగా ఎవరికీ మేలు జరగడం లేదని చెప్పారు.

అంతా అధోగతి

విశాఖ నగరానికి అతి సమీపంలో ఉన్నా ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, మరోవైపు విద్యుత్‌ ఛార్జీల మోతతో జ్యూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలు మూతబడుతున్నాయని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. రెల్లి వద్ద గిరిజన వర్సిటీ పనులు 5 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న ఆయన, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఈ నియోజకవర్గం లేదా రాష్ట్రానికి ఒక్క మేలైనా జరిగిందా? అని ప్రశ్నించారు.

వాగ్ధానాలు–‘420’

2014 ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఆ ఏడాది ఏప్రిల్‌లో 650 వాగ్ధానాలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఏప్రిల్‌లో మళ్లీ మోసం చేసేందుకు వందల వాగ్ధానాలు చేస్తున్నారని ఆక్షేపించారు. 

‘చంద్రబాబు పుట్టిన తేదీ ఏప్రిల్‌ 20. అంటే 4వ నెల, 20వ తేదీ. ఇంకా చెప్పాలంటే ‘420’. కాబట్టి ఆయన బుద్ధులు కూడా అలాగే ఉన్నాయి’ అని జననేత పేర్కొన్నారు.

ఏప్రిల్‌ ‘ఫూల్స్‌

‘ఇవాళ ఏప్రిల్‌ 1. అంటే ఆల్‌ ఫూల్స్‌ డే. అబద్ధాలు చెప్పుకుని పిల్లలు ఆట పట్టించుకుంటారు. కానీ చంద్రబాబు పుట్టినరోజు మహాత్యమో లేక నైజమో కానీ. ఆయన తన జీవితమంతా ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినది ఏదీ చేయడు. ఎన్నికల ముందు ఎన్నో చెబుతాడు. ఆ తర్వాత చూస్తే ఏమీ చేయడు. భూమి మీద ఉన్నవారిని పాతాళంలోకి నెట్టేస్తాడు’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

అమలు కాని హామీలు

‘వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కానీ ఏమైంది? చంద్రబాబు సీఎం అయ్యేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉంటే, ఈ 5 ఏళ్ల తర్వాత అవి ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి. అలాగే పొదుపు సంఘాల రుణాలు ఆనాడు రూ.14,200 కోట్లు ఉంటే, అవి ఇవాళ వడ్డీలతో తడిసి మోపెడై రూ.28 వేల కోట్లకు చేరాయి’.

‘ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. కానీ రెండూ ఎగ్గొట్టాడు. ఆ విధంగా ప్రతి పిల్లవాడికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. ప్రతి కులం, మతానికి ఎన్నికల వాగ్దానాలు చేసి ఒక పుస్తకం వేశాడు. అదే మేనిఫెస్టో. కానీ అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ బాబు చేస్తున్నారు అని టీవీ ఛానళ్లు ఆకాశానికి ఎత్తుకున్నాయి. కానీ అవన్నీ ఏమయ్యాయి. ఆరోజు చేసిన వాగ్ధానాలు అమలు చేయలేదు కాబట్టే, పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టో మాయం చేశారు’.

‘చంద్రబాబు సీఎం కాగానే తొలి 5 సంతకాలు చేశారు. కానీ వాటికే దిక్కూ దివాణం లేదు. ఆ తర్వాత 2014, ఆగస్టు 15న ప్రతి జిల్లాకు హామీలు ఇచ్చారు. అవే విషయాలను అసెంబ్లీలో కూడా ప్రకటించారు. కానీ అవన్నీ ఏమయ్యాయి. చంద్రబాబు అభివృద్ధి చేస్తానని చెప్పి, చేసింది అవినీతి మాత్రమే. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే అంత అవినీతి ఎవరూ చేయలేదు’ అని జననేత ఆరోపించారు.

వెన్నుపోటు

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు, గత 5 ఏళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడన్న జననేత, మరి ఆయనను నమ్మొచ్చా అని ప్రశ్నించారు.

వ్యవస్థ మారాలి

కాబట్టి ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఎవరైనా నాయకుడు మాట ఇచ్చి, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టి అమలు చేయకపోతే, ఆయన తన పదవికి రాజీనామా చేసి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. 

మోసం–కుట్ర

ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలన్న జననేత, మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో చంద్రబాబు చేయని కుట్ర, చేయని మోసం ఉండదని.. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతారని అన్నారు.

ఇవాళ తమ యుద్ధం కేవలం చంద్రబాబుతోనే కాకుండా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, చంద్రబాబుకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో జరుగుతోందని చెప్పారు. వారు చెప్పేవన్నీ అబద్ధాలే. చేసేవన్నీ అసత ప్రచారాలే. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు.. చేయనిది చేసినట్లు, చేసింది చేయనట్లు చూపుతారని ఆరోపించారు.

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

కాబట్టి అందరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌.. ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటినా ప్రభుత్వం మాత్రం ముష్టిగా రూ.35 వేలు మాత్రమే ఇస్తోందని గుర్తు చేయండి’.

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, అలా మాఫీ చేయకపోగా, సున్నా వడ్డీ రుణాలు కూడా అందలేదని గుర్తు చేయండి’.

‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో ఆ అక్కా చెల్లెమ్మకే ఇస్తాడని చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి అక్కను కలవండి. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాము. ఆ తర్వాత వైయస్సార్‌ చేయూత పథకం తీసుకువచ్చి రూ.75 వేలు నాలుగు దఫాల్లో నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు పూర్తిగా ఎగ్గొట్టేశాడని చెప్పండి. అలాగే ఈ 5 ఏళ్లలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో అన్న మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు  కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న ఆ గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న కానీ రూ.2 వేల ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు చెప్పే మాటలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ఇల్లు లేని ప్రతి నిరుపేదను కలవండి. ఆరోజు రాజన్న రాజ్యం చూశామని, ఆయన పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారని చెప్పండి. మళ్లా జగనన్నతోనే అది సాధ్యమని, ఆయనే నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇస్తాడని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన చంద్రబాబు, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి’ అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నారు. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె.శ్రీనివాస్‌తో పాటు, పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :