ASBL Koncept Ambience

ఎమ్మిగనూరు ప్రచార సభలో వైయస్‌ జగన్‌

ఎమ్మిగనూరు ప్రచార సభలో వైయస్‌ జగన్‌

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపడితే చేనేత కుటుంబాలకు కొండంత అండగా ఉంటామని, మగ్గం ఉన్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున ఏటా రూ.24 వేలు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబునాయుడు ఒక్కరికీ మేలు చేయకపోయినా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా.. ఎల్లో మీడియా మాత్రం అంతా బాగుందని, బాబు పాలన బంగారం అంటూ జోరుగా ప్రచారం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. వాస్తవానికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని నాబార్డు నివేదికలో స్పష్టమైందని జననేత వెల్లడించారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.

ఉల్లి రైతుల కన్నీరు

రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కిలో ఉల్లి కనీసం ఒక్క రూపాయి కూడా పలకడం లేదని, అదే సమయంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ మార్కెట్లలో కిలో ఉల్లి రూ.23 అమ్ముతున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. దళారీలను నియంత్రించాల్సిన చంద్రబాబు, తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం వారికే నాయకుడిగా మారి, రైతులకు నష్టం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఈ 5 ఏళ్లలో ఏం చేశారు?

చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరికీ మేలు చేయకపోయినా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ఎల్లో మీడియా మాత్రం ‘బాబు పాలన బంగారం’ అంటూ జోరుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. 

కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరిన జననేత, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలన గురించి తాను రెండే రెండు ఉదాహరణలు ప్రస్తావిస్తానని చెప్పారు.

అవే.. గత ఎన్నికల్లో రైతులు, అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు ఏం హామీలు ఇచ్చారు? ఏం చేశారు? అన్నది ఆలోచించాలని కోరారు.

‘పచ్చ’ కళ్లు

సమాజంలో 60 శాతం రైతులుండగా, 50 శాతం మహిళలున్నారని, వారిని అన్ని రకాలగా దారుణంగా మోసం చేసినా, ఎల్లో మీడియాతో పాటు, ఆయన పార్టనర్, యాక్టర్‌కు మాత్రం అంతా బాగా కనిపిస్తుందని చెప్పారు.

రైతు రుణాలు

గత ఎన్నికల నాటికి (చంద్రబాబు సీఎం అయ్యేనాటికి) ఉన్న రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని కత్తిరించి కత్తిరించి రూ.24,500 కోట్లకు తగ్గించారని.. అవి కూడా 5 విడతల్లో ఇస్తానన్నారని తెలిపారు.

మూడు విడతల నిధులు ఇచ్చామని చెప్పి, మరో రెండు విడతల నిధులు ఇప్పటికీ ఇవ్వలేదని.. అయితే ఎన్నికలు రావడంతో ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తానంటున్నారని చెప్పారు. అయితే అదే మొత్తం రెండేళ్ల క్రితం ఇచ్చి ఉంటే రైతులకు కనీసం వడ్డీ అయినా తగ్గేది కదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడెంత?

ఎక్కడైనా రుణమాఫీ జరిగితే అవి తగ్గుతాయని, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా రైతుల రుణాలు పెరిగాయని వెల్లడించారు. 

చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రూ.87,612 కోట్లు ఉన్న రైతుల రుణాలు ఇవాళ ఏకంగా రూ.1.50 లక్షల కోట్లకు చేరాయని, చంద్రబాబును నమ్ముకొని రైతులు మోసపోయారని, కరువొచ్చినా వారిని ఆదుకోవడం లేదని, వారికి బీమా అందడం లేదని, గతంలో వచ్చే సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదని, ఇదీ చంద్రబాబు పాలన అని జననేత వివరించారు.

రాష్ట్రంలో రైతుల దుస్థితిపై నాబార్డు ఒక నివేదిక ఇచ్చిందంటూ అందులోని అంశాలు ప్రస్తావించారు.

నాబార్డు నివేదిక:

– రైతులకు నెలవారీగా వస్తున్న ఆదాయంలో రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉంది.
– ఆదాయ, వ్యయంలో రైతులకు మిగులులో ఏపీ చివరి స్థానంలో ఉంది.
– దేశంలోనే ఏపీ రైతుల అప్పులు రెండో స్థానంలో ఉన్నాయి.
– దేశంలోని రైతుల్లో 45 శాతం అప్పుల్లో ఉంటే ఏపీ రైతుల్లో 75 శాతం అప్పుల పాలయ్యారు.
– మైక్రో ఫైనాన్స్‌ ని«ధుల్లో 60 శాతం రైతులు కూరుకుపోయారు.

ఇవన్నీ రాష్ట్రంలో రైతుల దుస్థితికి నిదర్శనం అన్న శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల పరిస్థితి ప్రస్తావించారు.

పొదుపు సంఘాల మహిళలు

– 2014 నాటికి రూ.14,205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలు వడ్డీలతో ఎగబాకి ఇవాళ రూ.26 వేల కోట్లకు చేరాయి. 
– వారికి ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు.
– మరోవైపు వారికి సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు.
– డ్వాక్రా రుణమాఫీపై అసెంబ్లీలో ప్రశ్న వేస్తే, ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇదే సమాధానం చెప్పింది.
– డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని, ఆ ఆలోచన కూడా లేదని ప్రభుత్వం వెల్లడించింది. 
అని వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ఇంకా గత ఎన్నికల్లో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన మరిన్ని హామీలను గుర్తు చేశారు.

మహిళలు–ఇతర హామీలు

– కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
– ఫోన్‌ చేస్తే 5 నిమిషాల్లోనే పోలీసుల రాక
– ఆడపిల్ల పుడితే రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌. 

వీటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు మోసం, మోసం, మోసం తప్ప మరేదీ చూడలేదని అన్నారు. 

రోజుకో సినిమా, డ్రామా

ఇక మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పటికే చంద్రబాబు రోజుకో సినిమా, డ్రామా చూపిస్తున్నారని, ఆయన, ఎల్లో మీడియా అంతా కలిసి కుట్రలు చేస్తున్నారని, ఉన్నది లేనట్లు..ఉన్నది లేనట్లు చూపుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పని అబద్ధం, చేయని మోసం, అన్యాయం, చూపని సినిమా ఉండదని చెప్పారు. 

ఇంకా గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెట్టి, వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు.

అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాలకు వెళ్లాలని, ప్రతి ఇంట్లో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ ప్రతి తాత, ప్రతి రైతుకు చంద్రబాబు మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ చెప్పండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌.. ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజు లక్ష రూపాయలు దాటినా ప్రభుత్వం మాత్రం ముష్టిగా రూ.35 వేలు మాత్రమే ఇస్తోందని గుర్తు చేయండి’.

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు, పసుపు–కుంకుమకు అస్సలు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబును నమ్మితే రుణమాఫీ జరగలేదని, సున్నా వడ్డీ రుణాలంద లేదని గుర్తు చేయండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, పసుపు–కుంకుమ పథకంతో చేస్తున్న డ్రామాను నమ్మొద్దని చెప్పండి’. 

‘20 రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో వారి చేతుల్లోనే పెడతారని చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని కలవండి. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఆగి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి’.

‘ప్రతి రైతుకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా చేసిన మోసం వివరించండి. సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. అలాగే ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కకపోవడాన్ని కూడా చెప్పండి. అందుకే 20 రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే, ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, వాటికి గ్యారెంటీ కూడా ఇస్తాడని కూడా చెప్పండి’.

‘ప్రతి అవ్వ, తాత దగ్గరకు వెళ్లండి. వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. ఆ అవ్వ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న కానీ చెప్పకపోయి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, 20 రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రిని అవుతాడని, ఆ తర్వాత మీ మనవడు మీకు ఇచ్చే పెన్షన్‌ పెంచుకుంటూ పోయి రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి’.

‘ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి, ఇవాళ ఊరికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని గుర్తు చేయండి. అందుకే రాజన్న మాదిరిగా జగనన్న  పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పండి’. అని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.

విశ్వసనీయత రావాలి

ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. విశ్వసనీయత రావాలి. మాట నిలబెట్టుకోని నాయకుడు పదవి వీడి ఇంటికి పోవాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయి. అందుకు మీ అందరి సహకారం కావాలి.

పార్టీ అభ్యర్థుల పరిచయం

ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె.చెన్నకేశవరెడ్డితో పాటు, పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఎమ్మెల్యే చేరిక

కాగా, ఎమ్మిగనూరు సభలో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు, పలువురు వాల్మీకి పోరాట సమితి నాయకులు కూడా పార్టీలో చేరారు. వారందరికీ స్వయంగా కండువా కప్పిన జననేత, పార్టీలోకి ఆహ్వానించారు.

 

Tags :