ASBL Koncept Ambience

జగన్ మరిచిన నిజాలు

జగన్ మరిచిన నిజాలు

చంద్రబాబును ఉరితీయాలి. చంద్రబాబును ఏం చేసినా తక్కువే. ఎందుకు? పట్టిసీమలో అవినీతి, సదావర్తిలో అవినీతి, అమరావతి వెనుక అవినీతి. అయితే ఇవన్నీ కాస్సేపు నిజమే అనుకుందాం. కానీ మరి జగన్ పై కూడా భయంకరంగా అవినీతి ఆరోపణలు వున్నాయి. కేసులు వున్నాయి. జైలుకు వెళ్లిన వైనం వుంది.

మరి ఉపఎన్నికల్లో కానీ, ఆ తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎందుకు జగన్ కు అన్ని సీట్లు కట్టబెట్టారు జనం? అంటే రాజకీయాల్లో అవినీతి అనే దాన్ని జనం పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నది ఫస్ట్ పాయింట్. రెండవది డెవలప్ మెంట్ లో జరిగే అవినీతిని అస్సలు పట్టించుకోరు అన్నది రెండో పాయింట్.

పట్టిసీమలో అవినీతే వుందని అనుకుందాం. కానీ దాని వల్ల నీళ్లు పొందినవారికి ఆ అవినీతి అనవసరం. రాష్ట్రం అంతా ఎల్ ఇ డి లైట్లు పెట్టారు. దాని వెనుక అవినీతి వుందని జగన్ అంటాడనుకుందాం. కానీ ఆ లైట్ల వెలుగులు అనుభవించేవారి ఆనందం గురించి తెలియదు. రాజశేఖర రెడ్డి కనిపెట్టిన అతి కొత్త, అతి గొప్ప సూత్రం అభివృధ్ధి-అవినీతి అన్నది.

వందరూపాయలు నేరుగా తినేసే బదులు, రెండు వందలు ఖర్చు చూపించి, వంద డెవలప్మెంట్ కు ఇచ్చి, వంద తినేయండి. జనం ఏమీ అనుకోరు. జనానికి అవినీతిని ప్రశ్నించే హక్కు తమకు లేదని ఎప్పుడో తెలుసు. ఎందుకంటే, రాజకీయ అవినీతి అనేది ఓటు దగ్గరే ప్రారంభమవుతుంది. ఓటుకు వెయ్యి, రెండు వేలు అన్న చిన్న కాలవ మాదిరిగా ప్రారంభమై, అది రాష్ట్రస్థాయికి వెళ్లేసరికి కోట్లు అవుతోంది.

అందువల్ల జనం చూసేది, మనకేమిచ్చారు. మన ఊరికేమిచ్చారు? మన నియోజకవర్గానికి ఏం చేసారు అన్నది మాత్రమే. కానీ జగన్ ఈ విషయం మరిచిపోయి, ఎంత సేపూ అవినీతి మీదనే దృష్టి పెట్టారు. బాబు విషయంలో జగన్ ఎత్తి చూపించేవి ఏమిటి? పట్టిసీమ, సదావర్తి, అమరావతి. ఆ పైన హామీలు అమలు చేయలేదు అన్నవి. వీటిలో హామీల అమలు అన్నది మాత్రమే అసలు సిసలు పాయింట్. కానీ ఆ ఒక్కటీ చాలదు ఎన్నికల్లో జగన్ గెలవడానికి ఎందుకంటే, హామీల అమలు సంగతి ఎలా వున్నా, ఏదో రకమైన డెవలప్ మెంట్ బాబు చూపిస్తూ వస్తున్నారుగా? ఆ సంగతి విస్మరిస్తే ఎలా?

ఉదాహరణగా వైజాగ్ రైల్వే జోన్ హామీ విస్మరించారు అనుకుందాం. కానీ విశాఖ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా మార్చేసారు కోట్లు ఖర్చుచేసి. జనం దృష్టిలో అక్కడ కాపన్ సేట్ అయిపోయిందిగా. రైతు రుణ మాఫీ జరగలేదు. నిజమే. కానీ రెండు వందలకు బదులు నెల అయ్యేసరికి వెయ్యి రూపాయలు అందుకుంటున్న వారిలో అధికశాతం మంది ఆ రైతు కూలీలు, కౌలు దారులేగా? చంద్రన్న కానుక అందుకుంటున్నది వారేగా. మరి ఇంక ఏమిటి సమస్య.

జగన్ విస్మరించింది ఒక్కటే. తన తండ్రి విజయవంతగా ప్రదర్శించిన రాజకీయ అభివృద్దితో కూడిన అవినీతి కళనే చంద్రబాబు కావచ్చు, రేపు భవిష్యత్ లో పాలకులు కాబోయే వారు కావచ్చు అనుసరించేది. అందువల్ల ఇకనైనా రాజకీయ అవినీతిపై దృష్టి మానేసి, చంద్రబాబును టార్గెట్ చేయడం మానేసి, తాను వస్తే ఏం చేస్తాను అన్నదే చెప్పాలి. తనకు ఓ చాన్స్ ఇచ్చి చూడమని అడగాలి. అంతే కానీ, నేను వచ్చేస్తాను, పక్కా అని చెప్పడం కాదు. అలా జనాల్ని ఓ చాన్స్ అడిగితే ఇచ్చే అవకాశం వుంటుంది కానీ, నేనే వస్తాను పక్కా అంటే.. వస్తావా? ఎలా వస్తావు మేము చాన్స్ ఇవ్వుకుండా అని చండి టైపు లో వ్యతిరేకించే ప్రమాదం వుంది.

ఇక కమింగ్ టు నంద్యాల. ఆ ప్లేస్ ఎవరిది. భూమా ఫ్యామిలీకి అభిమానం వున్నది. ఆ ఇంటి పెద్ద చనిపోయాడు. రెండు పదులు దాటిన పిల్లలు ముగ్గురు జనం కళ్ల ముందు వున్నారు. తల్లీ తండ్రీ లేరు. మా సోదరుడిని గెలిపించడమని జనాల్ని, అమ్మా నాన్న లేని ఇద్దరు ఆడకూతుళ్లు ఫ్రాధేయపడుతున్నారు. అటు చూస్తే రాజకీయంగా ఢక్కా మొక్కీలు తిన్న బలమైన అభ్యర్థి వున్నారు.

అప్పుడు జనం, ముఖ్యంగా మహిళా ఓటర్లు సైకలాజికల్ గా ఏం ఆలోచిస్తారు. వైఎస్ చనిపోయిన తరవాత జరిగిన ఎన్నికల్లో జగన్ ను జనం ఆ విధంగానే చూసారుగా చాలా వరకు. దొంగ అయినా పది మంది కలిసి కొడితే మన జనాలకు సానుభూతి వస్తుంది. అలాంటిది తల్లి తండ్రి లేని ఆడకూతుళ్ల మీద రాదా? నంద్యాలలో అది చాలా వరకు వచ్చిందన్నది వాస్తవం.

ఇవన్నీ జగన్ మరిచిన నిజాలు. కాదు, నంద్యల ఓటమి వెనుక వున్న నిజాలు.

-మిత్రులు ఆర్వీ సహకారంతో

Tags :