కర్నూలు జిల్లా వెల్థుర్తి ప్రజాసంకల్పయాత్రలో వైయస్ జగన్ ప్రసంగం..
బాబు కుర్చీ దిగిపోతేనే అన్నీ.. వస్తాయ్..
చంద్రబాబు కుర్చీ ఎక్కితే మంచాన పడ్డ సంక్షేమం
మళ్లీ మంచిరోజులు రావాలంటే బాబును కుర్చీ నుంచి దించాలి.
పిల్లకాలువలు తవ్వించలేని స్థితిలో బాబు ప్రభుత్వం
బాబు సీఎం కాగానే మూడుసార్లు కరెంటు ఛార్జీలు, మూడు సార్లు బస్సు ఛార్జీలు పెంచారు
బాబు సీఎం కాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ తగ్గిపోయింది
108, 104 ఎక్కడ?
కొత్త పరిశ్రమలు దేవుడెరుగు? ఉన్న పరిశ్రమలూ మూతపడుతున్నాయ్..
వైయస్ఆర్ హయాంలో 32 లక్షల ఎకరాల భూపంపిణీ ..
బాబు హయాంలో భూపంపిణీ కాదు.. భూములు లాక్కొంటున్నారు.
ప్రజలకు భరోసా ఇవ్వటానికే ప్రజాసంకల్పయాత్ర
ఈ రోజు మీరంతా నాతో పాటు అడుగులో అడుగు వేశారు. కొన్ని వేల మంది వెల్ధుర్తిలో నడిరోడ్డు మీద నిలబడాల్సిన అవసరం లేకపోయినా వచ్చారని శ్రీ జగన్ అన్నారు. చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయతలు పంచిపెట్టారని, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి అవ్వాతాతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి పదవి కోసంచంద్రబాబు చెప్పని అబద్ధం లేదని, ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవ్వర్నీ వదిలిపెట్టకుండా అందర్నీ మోసం చేశారన్నారు. నాలుగు సంవత్సరాల ఈ పరిపాలన చూసిన తర్వాత ఎలాంటి నాయకుడు కావాలని ప్రజల్ని అడిగారు. మోసం చేసే నాయకత్వం కావాలా? అబద్ధాలు చెప్పే నాయకత్వం కావాలా అని ఆయన అడిగారు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. లేకపోతే ఎన్నికల కోసం, ఓట్ల కోసం ప్రజలకు ఏదంటే అది చేస్తారు. తర్వాత ప్రజలు మోసపోతారు. ఏమీ చేయలేని ప్రజలు ఆ రాజకీయ నాయకుల వైపు చూస్తారు. అప్పుడు రాజకీయ నాయకులు అవహేళన చేస్తారన్నారు. అందుకే రాజకీయాలు మారాలన్నారు. చంద్రబాబు పరిపాలన చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఓ ఉదాహరణ చెప్పారు. బళ్లలో.. . పిల్లలు స్కూల్స్ లో ఆడుకునేటప్పుడు బరువు ఎటువైపు ఉంటుందో అటువైపు పైకి ఎగురుతుందని, కూరగాయలు వేసే త్రాసులోనూ బరువు ఎటువైపు ఉంటుందో అటువైపు వెళ్తుందన్నారు. బాబు హయాంలో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కూడా గాల్లో ఉందన్నారు. బాబును ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే సంక్షేమపథకాలన్నీ ప్రజలకు అందుబాటులో వస్తాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే.. సంక్షేమం.. గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. అంటూ.. బాబు పాలనను శ్రీ వైయస్ జగన్ మండిపడ్డారు. బాబు దిగిపోగానే ఉచిత విద్యుత్ వచ్చిందని కరెంటు బకాయిలు రద్దైపోయాయన్నారు.
బాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చిందన్నారు. చంద్రబాబు కుర్చీ నుంచి దిగిపోగానే 23 లక్షల ఇళ్లు కట్టి రికార్డు సృష్టించారని అన్నారు. బాబు దిగిన తర్వాతే లక్షల ఎకరాలు భూపంపిణీ జరిగిందని, జలయజ్ఞం జరిగాయన్నారు. గ్యాస్ ధర పెరిగినా వైయస్ఆర్ భరించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిన తర్వాతే 104, 108 కుయ్ కుయ్ అంటూ వచ్చాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిన తర్వాతే ప్రతి పేదవాడికీ తోడుగా ఉండే పరిపాలన వచ్చిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిన తర్వాతే పేదవాడికీ రూ.2 కిలో బియ్యం వచ్చాయన్నారు. 2014లో బాబు ముఖ్యమంత్రి అయ్యాక బల్లె మీద బరువు పెరిగిందన్నారు. దీంతో రైతుల అప్పులు పెరిగిపోయాయి. చంద్రబాబు బరువు పెరిగాక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల వడ్డీలు పెరిగాయి. చంద్రబాబు బరువుతో ఫీజు రీయింబర్స్ మెంట్ పెరిగాయన్నారు.
చంద్రబాబు బరువు పెరిగితే కరెంటు ఛార్జీలు మూడు సార్లు పెరిగాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు. 108కు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్.. అంటూ రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు. కావ్. కావ్ .. అంటూ ప్రజలు బాధపడుతున్నారని శ్రీ జగన్ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఆరోగ్యశ్రీ దూరమైంది. హైదరాబాద్ లో వైద్యం చేయరట. పేదలను వైద్యానికి దూరం చేశారన్నారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలు పోయాయన్నారు. డోన్ లో పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్న విషయాన్నిఈ సందర్భంగా శ్రీ జగన్ గుర్తు చేశారు.
బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగాలన్నీ హుష్ కాకి అయ్యాయన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారన్నారు. ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు. పేదలకు భూపంపిణీ లేదని.. పేదల నుంచి భూములు లాక్కొంటున్నారని శ్రీ జగన్ మండిపడ్డారు. హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రేషన్ షాపులకు వెళ్తే.. చింతపండు, పామాయిల్, పప్పులు.. ఇచ్చేవారని బాబు ముఖ్యమంత్రి అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదన్నారు. మంచి రోజులు రావాలంటే ఏం చేయాలని శ్రీ జగన్ ప్రజల్ని ప్రశ్నించారు. ఇప్పుడు చెప్పినవి నేను చెప్పేవి కావని.. చరిత్ర చెప్పేవన్నారు.
నాన్నగారి హయాంలో హంద్రీనీవా నుంచి నీళ్లు ఇవ్వాలని కోట్లు ఖర్చు చేసి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు పరుగులు పెట్టించారన్నారు. మరి, ఈనాటికీ పిల్ల కాల్వలు తవ్వించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇదే నియోజకవర్గంలో రామల్లకోట, తుందుర్తి, మరి నాలుగు చోట్ల ఎస్సీ హాస్టళ్లు మూసేశారు. మరో మూడు బీసీ హాస్టళ్లు మూసేయించారని శ్రీ జగన్ మండిపడ్డారు. మంచి చేయకపోగా.. మంచి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభిచానని శ్రీ జగన్ తెలిపారు. మోసపోయిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకు పాదయాత్ర చేపట్టానని శ్రీ జగన్ స్పష్టం చేశారు. రైతాంగం, యువత, మహిళ, ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటానని మీ బిడ్డను ఆశీర్వదించమని శ్రీ జగన్ కోరారు.
కృష్ణా జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోయిన రైతులు ఛలో అసెంబ్లీ అంటే.. వారిపై కేసులు నమోదు చేశారని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న మీ బిడ్డను ఆశీర్వదించండని కోరారు. నవరత్నాలు ప్రకటించాము.. వాటిల్లో మార్పులు చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా శ్రీదేవికి తోడుగా ఉండమని చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఏ విధంగా పట్టపగలు చంపారో ప్రజానీకానికి గుర్తు చేశారు. ఈ పరిపాలనలో న్యాయం ధర్మం లేదు.. ప్రశ్నిస్తే చంపించే వరకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.