రైతులు కన్నీరు పెడితే అరిష్టం.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
రైతుల కళ్లలో నీళ్లు వస్తే దేశానికి అరిష్టమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 19వ రోజు కర్నూలు జిల్లా కోడమూరులో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వచ్చానని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్నదాతలకు ఒరిగిందేమీ లేదన్నారు. కర్షకులు కష్టాలు తీర్చేందుకు వారి దగ్గర నుంచే సూచనలు తీసుకుంటానని చెప్పారు. రైతులు ముందుకు వచ్చి సలహాలు ఇవ్వాలని, తాము అధికారంలోకి వచ్చాక వీటిని అమలు చేస్తానని హామీయిచ్చారు. రైతుల ముఖంలో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటుధరలు రావడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి తక్కువ ధరకు పంట కొనుగోలు చేసి హెరిటేజ్ దుకాణాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎరువుల ధరలు పెరిగాయని, పంట ఉత్పత్తి ధరలు తగ్గాయని వివరించారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొంత మంది రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు.
‘రైతుల బాధలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలు ఇందిరా గాంధీ హయం నుంచే మొదలయ్యాయి. చంద్రబాబు పాలనలో రెట్టింపయ్యాయి. రైతులకు వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచి వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆయన మరణం రైతులకు శాపంగా మారింది. మినుములు, మిర్చి, కందులు, శనగలు, అపరాలకు గిట్టుబాటు ధర లేదు. మేము పండించిన పంటలకు మద్దతు కల్పించాలని కోరుతున్నాం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాల’ని భీమవరం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కోరారు.
వ్యవసాయ పెట్టుబడులు, గిట్టుబాటు ధరలు, మద్దతు ధర తదితర విషయాలపై రైతులను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. పత్తి, ఉల్లి, కంది, శనగ, వేరుశనగ, టమాట ధరలు ఎలా ఉన్నాయని అడిగారు. పత్తి పంటకు కౌలు కాకుండా 35 వేలు నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి అవుతోందన్నారు. క్వింటా పత్తికి 3 నుంచి 4 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఇలాయితే పత్తి పండించిన రైతులు ఏరకంగా బతుకుతారని జగన్ ప్రశ్నించారు.
క్వింటా ఉల్లిపాయలు రూ.1500 నుంచి 2 వేలకు రైతుల దగ్గరి నుంచి కొంటున్నారని, హెరిటేజ్ షాపులో కిలో ఉల్లిపాయాలు 50 రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. చంద్రబాబు దళారి అయితే రైతులకు గిట్టుబాటు ధర ఎలా వస్తుందని నిలదీశారు. రైతుల 25 కేజీల టమాటాల బాక్సు 100 నుంచి 150 రూపాయాలు కొంటున్నారని, హెరిటేజ్ షాపులో కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. గిట్టుబాటు ధర లేక టమాటాలను రైతులు రోడ్డుపై పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా వేరుశనగలు మూడు వేలకు రూపాయలకు కొని, హెరిటేజ్ షాపులో కిలో 150 రూపాయలు అమ్ముతున్నారని తెలిపారు. క్వింటా శనగలు 3 నుంచి 4 వేలు రూపాయలకు అన్నదాతల దగ్గరి నుంచి కొని హెరిటేజ్ దుకాణంలో మాత్రం కిలో 120 రూపాయల వరకు అమ్ముతున్నారని వివరించారు. కంది రేటు విషయంలోనూ ఇదేరకమైన మోసానికి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.